చరిత్రలో కొన్ని ఉద్యమాలు ఒకే సంఘటనతో ప్రారంభమైనట్లు కనిపించినా, వాటి వెనుక చాలాకాలంగా పేరుకుపోయిన అసంతృప్తి ఉంటుంది. జంతర్‌మంతర్ వేదికగా జరిగిన విద్యార్థి ఉద్యమం అందుకు నిదర్శనం. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఆగ్రహంతో ప్రారంభమైన ఈ పోరాటం, కొద్ది రోజుల్లోనే భారత యువతలో పేరుకుపోయిన అవిశ్వాసం, నిరుద్యోగ భయం, పరీక్షల విశ్వసనీయతపై సందేహాలు, ప్రభుత్వ జవాబుదారీతనంపై ప్రశ్నలు, ప్రజాస్వామ్యంలో యువత పాత్ర వంటి అనేక అంశాలకు ప్రతీకగా మారింది. ఒక తరం తన భవిష్యత్తు గురించి వేసిన ప్రశ్నగా రూపాంతరం చెందింది. ప్రారంభ దినాల్లో జంతర్‌మంతర్‌లో కొద్దిమంది విద్యార్థులతో మొదలైన నిరసనను చాలామంది సాధారణ ఆందోళనగానే చూశారు. రోజులు గడిచేకొద్దీ దాని స్వరూపం మారిపోయింది. పార్లమెంట్ వైపు విద్యార్థుల భారీ ర్యాలీ, పోలీసుల అడ్డంకులు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంఘటనలు ఉద్యమాన్ని కొత్త దశకు తీసుకెళ్లాయి. ఉద్యమాన్ని అణచివేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఎదురుతిరిగాయి. నిరసనలు మరింత విస్తరించడంతో రాజకీయ ఒత్తిడి పెరిగి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిరసన స్థలంలో జరిగిన ప్రతి సంఘటన కొన్ని నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా చేరింది. ఒక విద్యార్థి ప్రసంగం, ఒక తల్లి కన్నీరు, ఒక పోలీసు బలప్రయోగం, ఒక విద్యార్థి ప్రతిఘటన ... అన్నీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షమయ్యాయి. ఉద్యమం వార్తల్లోకి రావాలని ఎదురుచూడలేదు; ఉద్యమమే వార్తలను సృష్టించింది. ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే జరిగిన సంఘటనల వరుసను మాత్రమే చూడడం సరిపోదు. భారత యువత ఎలా ఆలోచిస్తోంది? ఎలా సంఘటితమవుతోంది? సమాచారాన్ని ఎలా ఆయుధంగా మార్చుకుంటోంది? ప్రజాస్వామ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటోంది? అనేది చూడాలి. ఆ కోణంలో చూస్తే ఇది ఒక నిరసన మాత్రమే కాదు; 21వ శతాబ్దపు భారత యువత రాసిన కొత్త ఉద్యమ వ్యాకరణం. జెన్‌జీ ఎగరేసిన జయకేతనం!
కొత్త వ్యాకరణం
భారతదేశంలో విద్యార్థి ఉద్యమాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే ఈ ఉద్యమం వాటిలో చాలా వాటికి భిన్నమైన ఒక కొత్త కార్యశైలిని ఆచరణలో చూపించింది. ఒక నాయకుడు, ఒక సంస్థ, ఒక కార్యాలయం, ఒక పత్రిక, ఒక వేదిక మీద ఆధారపడకుండా, వేలాది మంది తమ తమ స్థానాల నుంచి ఒకే లక్ష్యానికి అనుసంధానమయ్యారు. ఉద్యమం ఒక నెట్‌వర్క్‌లా పనిచేసింది. ఒక చోట అడ్డుకున్నా మరోచోట ప్రారంభమైంది. ఒకరిని నిర్బంధించినా మరొకరు ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యంలో సమాచారం కూడా ఒక రాజకీయ శక్తి అని ఈ ఉద్యమం నిరూపించింది. ఒకప్పుడు ఉద్యమానికి అనుకూలంగా వార్తలు వస్తేనే అది బలపడేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విద్యార్థులే వార్తలను సృష్టించారు. సంఘటన జరిగిన నిమిషాల్లోనే వీడియోలు బయటకు వచ్చాయి. స్వతంత్ర యూట్యూబ్ చానళ్లు, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు, టెలిగ్రామ్ గ్రూపులు, ఎక్స్ పోస్టులు ఉద్యమాన్ని నిరంతరం ప్రజల ముందుంచాయి. అందువల్ల గోడీ మీడియా నియంత్రణ పద్ధతులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
ఈ ఉద్యమంలో కనిపించిన మరో మార్పు నాయకత్వ సంస్కృతి. ఉద్యమాన్ని ముందుకు నడిపిన నాయకులు తాము మాత్రమే మాట్లాడకుండా, విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళలు, రైతులు, నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలకు కూడా వేదిక ఇచ్చారు. దీంతో ఉద్యమం ఒక వ్యక్తి చుట్టూ కాకుండా, ఒక సమిష్టి చైతన్యంగా ఎదిగింది. ఇదే కారణంగా అణచివేత తర్వాత కూడా అది విచ్ఛిన్నం కాలేదు; మరింత విస్తరించింది. 21వ శతాబ్దపు ప్రజా ఉద్యమాలు కేవలం వీధుల్లోనే జరగవు; అవి ఒకేసారి వీధుల్లో, మొబైల్ ఫోన్లలో, సోషల్ మీడియాలో, న్యాయస్థానాల చర్చల్లో, పార్లమెంటులో, కుటుంబాల సంభాషణల్లో, అంతర్జాతీయ వేదికలలో కూడా జరుగుతాయి. ఈ బహుళస్థాయి పోరాట పద్ధతినే ఈ తరం యువత తన కొత్త ఉద్యమ వ్యాకరణంగా ఆవిష్కరించింది.
చేతిలో మీడియా
ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంది. అది వీడియో తీయడానికి, ప్రత్యక్ష ప్రసారం చేయడానికి, ఆధారాలు నమోదు చేయడానికి, దేశానికి సమాచారం చేరవేయడానికి ఒక సాధనంగా మారింది. ఒక సంఘటన జరిగితే అది మరుసటి నిమిషంలోనే దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షమైంది. జంతర్‌మంతర్‌లో జరిగిన ప్రసంగాలు, పోలీసులతో జరిగిన వాగ్వాదాలు, విద్యార్థులపై లాఠీచార్జి, గాయపడిన వారి వాంగ్మూలాలు, మహిళా విద్యార్థుల కన్నీళ్లు, నిరాహార దీక్షలు, సంఘీభావ సభలు... ప్రతి సంఘటనను ఉద్యమకారులే చిత్రీకరించి ప్రజలకు అందించారు. దీంతో "అసలు ఏమి జరిగింది?" అనే ప్రశ్నకు సమాధానం కోసం మీడియా సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. యూట్యూబ్ జర్నలిస్టులు, స్వతంత్ర వార్తా వేదికలు, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు, టెలిగ్రామ్ ఛానళ్లు, ఎక్స్ ఖాతాలు నిరంతరం ప్రత్యక్ష సమాచారాన్ని అందించాయి. సమాచార ప్రవాహం మీద ప్రభుత్వ అనుకూల మీడియా నియంత్రణను డిజిటల్ నెట్‌వర్క్‌లు సవాలు చేశాయి. ప్రధాన స్రవంతి మీడియాపై అవిశ్వాసం కూడా ఈ ఉద్యమంలో బహిరంగంగా వ్యక్తమైంది. అనేక చోట్ల విద్యార్థులు విలేకరులను ప్రశ్నించారు. "మా మాట కూడా చూపండి", "పూర్తి వీడియో ప్రసారం చేయండి", "కట్ చేసిన క్లిప్‌లు కాదు, జరిగినదంతా చూపండి" అని డిమాండ్ చేశారు. కొన్ని సందర్భాల్లో గోడీ మీడియా నిరసనకారుల ఆగ్రహాన్ని ఎదుర్కొంది. భారత ప్రధాన మీడియాపై యువతలో పెరుగుతున్న అవిశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలిచింది. సమాచార ఉత్పత్తి, ప్రసారం, ధృవీకరణ... ఈ మూడు ప్రక్రియలూ కొద్దిమంది మీడియా సంస్థల చేతుల్లో కాకుండా ప్రజల చేతుల్లోకి వెళ్లాయి. ఇదే ఈ ఉద్యమం సమాచార రంగానికి నేర్పిన అత్యంత విలువైన పాఠం.
వ్యంగ్యం ఒక ఆయుధం!
పోరాటం అంటే నినాదాలు, ఘర్షణలు మాత్రమే అనుకునే అభిప్రాయాన్ని ఈ విద్యార్థి ఉద్యమం బద్దలు కొట్టింది. వ్యంగ్యం, మీమ్స్, కార్టూన్లు, చిన్న వీడియోలు, చమత్కార నినాదాలు, వ్యంగ్య ప్లకార్డులు... ఇవన్నీ ఈ ఉద్యమంలో భాగమయ్యాయి. నవ్విస్తూ ప్రశ్నించడం, అవమానించకుండా విమర్శించడం, కోపాన్ని సృజనాత్మకతగా మార్చడం ఈ ఉద్యమం ప్రత్యేకత. ప్లకార్డులు కొన్ని ఒకే వాక్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కొన్ని సినిమా డైలాగులను మార్చి సందేశం చెప్పాయి. కొన్ని ప్రముఖ ప్రకటనల శైలిని అనుకరించి పరీక్షా వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. వీధిలో పట్టుకున్న ఒక ప్లకాడి దేశమంతా డిజిటల్ పోస్టర్‌గా మారిపోయింది.
ఉద్యమంలో పాల్గొన్న యువతకు మీమ్స్ సహజమైన భాష అయింది. గంటల తరబడి ఉపన్యాసాలు వినే తరం కాదు ఇది. ఒక పదునైన మీమ్, ముప్పై సెకన్ల వీడియో, ఒక కార్టూన్, ఒక చమత్కార వ్యాఖ్య ద్వారా క్లిష్టమైన రాజకీయ ప్రశ్నలను కూడా లక్షలాది మందికి చేరవేయగలిగింది. ఉద్యమానికి సంబంధించిన మీమ్స్, చిన్న వీడియోలు, వ్యంగ్య పోస్టులు కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించాయి. వ్యంగ్యం ఇక్కడ వినోదం కాదు; సందేశాన్ని వేగంగా వ్యాప్తి చేసే సాధనం అయింది.
ఈ హాస్యం ద్వేషాన్ని రెచ్చగొట్టేలా కాకుండా, అధికారాన్ని ప్రశ్నించేలా సాగింది. ప్రత్యర్థిని అమానుషంగా చిత్రీకరించడం కంటే, వారి వాదనల్లోని వైరుధ్యాలను బయటపెట్టడానికే ఎక్కువగా ఉపయోగించారు. అందువల్ల ఉద్యమం తన నైతిక ఆధిక్యాన్ని కూడా నిలబెట్టుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమాల్లో కూడా ఇదే పద్ధతి కనిపించింది.
ఇదే సమయంలో ఉద్యమం మరో ప్రచార పోరును కూడా ఎదుర్కొంది. ప్రభుత్వ అనుకూల మీడియా ఈ ఉద్యమాన్ని పరిమిత సంఘటనగా చూపించే ప్రయత్నం చేసింది. కొందరు దీన్ని రాజకీయ ప్రేరేపితమని, విదేశీ ప్రభావం ఉందని ఆరోపించారు. విద్యార్థుల నిజమైన ఆవేదనను పక్కనపెట్టి ఇది దేశాన్ని అస్తవ్యస్తం సృష్టించే ప్రయత్నంగా చిత్రీకరించారు. అయితే, ఈ విష ప్రచారంపై ఉద్యమం పాత పద్ధతిలో ప్రతిస్పందించలేదు. పెద్ద పెద్ద వివరణలు ఇవ్వడం, గంటలకొద్దీ విలేకరుల సమావేశాలు నిర్వహించడం కంటే, జరిగిన సంఘటనల వీడియోలను, ప్రత్యక్ష సాక్ష్యాలను, విద్యార్థుల అనుభవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. "మా గురించి మేమే చెబుతాం" అనే ధోరణిని అవలంబించింది.
ఒక తప్పుడు సమాచారం బయటకు వస్తే, కొద్ది నిమిషాల్లోనే దానికి విరుద్ధమైన వీడియోలు, ఫొటోలు, ప్రత్యక్ష ప్రసారాలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇంగ్లీష్ పోస్టులు, వీడియోలు, సబ్‌టైటిల్స్, అంతర్జాతీయ మీడియాకు అందించిన సమాచారం ద్వారా ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించింది. దీంతో విదేశీ వార్తా సంస్థలు, మానవ హక్కుల సంస్థలు కూడా ఈ ఉద్యమాన్ని గమనించడం ప్రారంభించాయి. దేశీయ చర్చ అంతర్జాతీయ చర్చగా విస్తరించింది. ప్రజాస్వామ్యంలో సత్యం తనంతట తానే గెలవదు; దాన్ని నిరంతరం ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకురావాలి. అందుకే ఈ ఉద్యమం కేవలం నినాదాలతోనే కాదు; ఆధారాలతో, వీడియోలతో, ప్రత్యక్ష సాక్ష్యాలతో, ప్రజల విశ్వాసాన్ని సంపాదించే ప్రయత్నంతో కూడా ముందుకు సాగింది.
అణచివేతకు తిరగమోత!
ఉద్యమాలను అణచివేయడం ద్వారా అవి బలహీనపడతాయని పాలకపక్షాలు తరచూ భావిస్తాయి. కానీ చరిత్రలో అనేక సందర్భాల్లో అందుకు విరుద్ధమైన ఫలితాలే కనిపించాయి. ఈ విద్యార్థి ఉద్యమంలో కూడా అదే జరిగింది. ప్రారంభంలో పరిమితంగా ఉన్న నిరసనలు, పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత మరింత విస్తరించాయి. ఉద్యమాన్ని ఆపాలని తీసుకున్న చర్యలే, ఉద్యమానికి కొత్త మద్దతును కూడగట్టాయి. పార్లమెంట్ వైపు శాంతియుతంగా కదులుతున్న విద్యార్థులను బారికేడ్లతో అడ్డుకోవడం, తోపులాటలు, లాఠీచార్జి, అరెస్టులు, మహిళా విద్యార్థులను ఈడ్చుకెళ్లిన దృశ్యాలు, గాయపడిన యువత వీడియోలు... ఇవన్నీ క్షణాల్లో దేశమంతా వ్యాపించాయి. ఒకప్పుడు ఇలాంటి సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన వారికే తెలిసేది. ఇప్పుడు మాత్రం కోట్లాది మంది తమ మొబైల్ ఫోన్లలో వాటిని ప్రత్యక్షంగా చూశారు. ఆ దృశ్యాలు ఉద్యమంలో పాల్గొనని వారిలో కూడా ప్రశ్నలను రేకెత్తించాయి. "శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా?" అనే చర్చ విస్తరించింది.
అణచివేత జరిగిన ప్రతిసారీ ఉద్యమం కొత్త రూపంలో ముందుకు వచ్చింది. ఢిల్లీలో పోలీసు చర్యల తర్వాత ముంబయి, హైదరాబాద్, నాగ్‌పూర్, పుణే, బెంగళూరు, కోల్‌కతా, పాట్నా వంటి నగరాల్లో సంఘీభావ నిరసనలు జరిగాయి. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా తమ విశ్వవిద్యాలయాల వద్ద మద్దతు కార్యక్రమాలు నిర్వహించారు. ఒక నగరంలో జరిగిన అణచివేత చర్య, మరెన్నో నగరాల్లో ప్రతిస్పందనకు దారితీసింది. ఉద్యమాన్ని ఒక ప్రాంతంలో నిలువరించాలని ప్రయత్నిస్తే అది దేశమంతటా విస్తరించింది.
ఈ ఉద్యమంలో మరో విశేషం విద్యార్థులు సహనాన్ని కోల్పోకుండా ఉండటం. పోలీసులు బలప్రయోగం చేసిన సందర్భాల్లో కూడా విద్యార్థులు రాజ్యాంగ పీఠికను చదవడం, పూలు అందించడం, శాంతియుతంగా కూర్చోవడం, జాతీయ జెండాను ప్రదర్శించడం వంటి చర్యలతో విద్యార్థులు స్పందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. బలప్రయోగం చేసినవారు ఒకవైపు, ప్రశాంతంగా నిలబడిన విద్యార్థులు మరోవైపు కనిపించడంతో ఉద్యమానికి నైతిక ఆధిక్యం లభించింది. సామాజిక ఉద్యమాల అధ్యయనంలో దీనిని "Backfire Effect" (తిరుగుదెబ్బ ప్రభావం) అంటారు. అంటే ఒక ఉద్యమాన్ని అణచివేయడానికి తీసుకున్న చర్యలే, ప్రజల్లో దానిపట్ల మరింత సానుభూతిని పెంచుతాయి. ఉద్యమాలపై అధికార వ్యవస్థల అతిగా చేసిన బలప్రయోగం ప్రజల్లో ఉద్యమం పట్ల సానుకూలతను పెంచింది. అణచివేతను నమోదు చేసిన వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలు, గాయపడిన వారి వాంగ్మూలాలు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, మాజీ న్యాయమూర్తులు స్పందన... ప్రజల మద్దతును కూడగట్టాయి. ఒక సంఘటనను కేవలం బాధితులే కాదు, సమాజంలోని అనేకులు తమదిగా స్వీకరించినప్పుడు అణచివేత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది.
దేశమంతా దద్దరిల్లింది!
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్త చైతన్యంగా మారింది. విద్యార్థులు, యువకులూ లేవనెత్తిన ప్రశ్నలు దేశంలోని ప్రతి కుటుంబానికీ సంబంధించినవిగా ఉండటం దీనికి కారణం. పరీక్ష రాసిన విద్యార్థి ఒక ఇంట్లో ఉంటే, నిరుద్యోగి మరో ఇంట్లో ఉన్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకుడు ఇంకో ఇంట్లో ఉన్నాడు. విద్య, ఉద్యోగం, భవిష్యత్తు, న్యాయం... ఈ నాలుగు అంశాలు ప్రతి కుటుంబాన్నీ తాకాయి. అందుకే ఢిల్లీలో మొదలైన ఆవేదన దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. హైదరాబాద్, ముంబయి, నాగ్‌పూర్, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, లక్నో, పాట్నా, భోపాల్ వంటి నగరాల్లో సంఘీభావ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కోచింగ్ కేంద్రాల వద్ద విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీలు, మానవహారాలు, నిరసన సభలు నిర్వహించారు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి రోడ్లపైకి వచ్చారు. దీంతో ఇది భారత యువత ఉద్యమంగా రూపాంతరం చెందింది.
ఈ ఉద్యమానికి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. రచయితలు, కళాకారులు, సినీ ప్రముఖులు, మాజీ న్యాయమూర్తులు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమ మద్దతు తెలిపారు. ఒక వర్గం సమస్య క్రమంగా సమాజం మొత్తం చర్చించే అంశంగా మారింది. ఏ ఉద్యమానికైనా ఇది ఒక కీలక మలుపు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు సంఘీభావ సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన కొద్ది నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా, అక్కడి నుంచి విదేశాల్లోని భారతీయ విద్యార్థులకూ చేరింది. ఎక్కడ సంఘీభావ కార్యక్రమం జరుగుతుందో, ఎప్పుడు సమావేశం ఉంటుందో, ఎవరికి న్యాయ సహాయం అవసరమో... అన్నీ ఒకే నెట్‌వర్క్‌లో ప్రసారం అయ్యాయి. ఒక సమస్యతో ప్రారంభమైన ఉద్యమం ఇతర వర్గాలకు, ఇతర ప్రాంతాలకు విస్తరించడం చాలా ప్రభావం చూపిస్తుంది. స్థానిక నిరసన జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయికి ఎదగడం, నినాదాలు, వ్యూహాలు మరొక ప్రాంతానికి చేరడం; ఒకరి చర్య మరొకరిని ప్రేరేపిస్తూ వరుసగా ఉద్యమాలు విస్తరించడం... వంటి లక్షణాలు ఈ విద్యార్థి ఉద్యమంలో స్పష్టంగా కనిపించాయి.
వ్యవస్థల కదలిక
ఏ ప్రజా ఉద్యమానికైనా నిజమైన ప్రభావం అది వీధుల్లో ఎంతమంది పాల్గొన్నారు అన్నదానితో మాత్రమే కొలవలేం. ఆ ఉద్యమం అధికార వ్యవస్థను ఎంతవరకు స్పందింపజేసింది? ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, రాజకీయ పార్టీలు, విద్యాసంస్థలు, మీడియా వంటి వ్యవస్థలు తమ వైఖరిని పునఃసమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అనే ప్రశ్నలతో దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. ఆ కోణంలో చూస్తే ఈ విద్యార్థి ఉద్యమం కేవలం నిరసనగా నిలవలేదు; వ్యవస్థ మొత్తాన్ని స్పందించాల్సిన పరిస్థితిలోకి నెట్టింది. ప్రారంభంలో ఉద్యమాన్ని ఒక సాధారణ విద్యార్థి ఆందోళనగా చూసిన అధికార వర్గాలు, అది దేశవ్యాప్త చర్చగా మారిన తర్వాత తమ వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు వినిపించాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. కేంద్ర మంత్రులు వరుసగా వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. విద్యా విధానం, పరీక్షల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలు మళ్లీ జాతీయ చర్చలోకి వచ్చాయి. ఒక విద్యార్థి సమస్యగా మొదలైన అంశం ఒక బలమైన అజెండాగా మారింది.
ఈ ఉద్యమంలో న్యాయవ్యవస్థ పాత్ర కూడా కీలకంగా మారింది. ఉద్యమానికి సంబంధించిన పిటిషన్లు కోర్టుల ముందుకు వచ్చాయి. శాంతియుత నిరసన హక్కు, పోలీసు చర్యల చట్టబద్ధత, విద్యార్థుల పౌరహక్కులు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై న్యాయస్థానాల్లో వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఉద్యమం వీధి నుంచి న్యాయస్థానాల వరకూ విస్తరించింది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో ఈ పరిణామాలు గుర్తు చేశాయి. ఈ ఉద్యమం పాలక పక్షాన్నే కాదు, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించింది. "మాకు మద్దతు ప్రకటించడం సరిపోదు; పరిష్కారం కోసం మీరు ఏం చేస్తున్నారు?" అని విద్యార్థులు నిలదీశారు. ఈ ధోరణి ఉద్యమాన్ని సంప్రదాయ పార్టీ రాజకీయాలకు అతీతంగా నిలబెట్టింది. ఏ రాజకీయ పక్షానికీ పూర్తిగా అనుబంధంగా కనిపించకుండా, ఉద్యమం తన స్వతంత్రతను కాపాడుకొంది.
ప్రారంభంలో పరిమితంగా కవరేజ్ ఇచ్చిన కొన్ని ప్రధాన మీడియా సంస్థలు, ఉద్యమం విస్తరించిన తర్వాత దీనిపై విస్తృతంగా చర్చించాల్సి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురించడంతో దేశీయ చర్చ మరింత విస్తరించింది. ప్రజాభిప్రాయం ఒత్తిడి పెరిగినప్పుడు వ్యవస్థలు తమ మౌనాన్ని కొనసాగించడం ఎంత కష్టమో ఈ ఉద్యమం చూపించింది. ప్రజాస్వామ్యంలో ఉద్యమం చివరి లక్ష్యం కేవలం నిరసన వ్యక్తం చేయడం కాదు; వ్యవస్థలను మరింత జవాబుదారిగా మార్చడం. ఈ విద్యార్థి ఉద్యమం అధికారాన్ని ప్రశ్నించింది. వ్యవస్థలను స్పందింపజేసింది. ప్రజల అజెండాగా మార్చింది. అదే ఏ ప్రజాస్వామ్య ఉద్యమానికైనా అత్యంత ముఖ్యమైన విజయం.
దుష్ప్రచారం విఫలం... యువత విజయం
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఏ దశలోనూ సానుకూలంగా చూడలేదు. ఉద్యమం వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడానికి, విద్యార్థుల ఆందోళనలను పరిశీలించడానికి ప్రయత్నించలేదు. ఉద్యమాన్ని తక్కువ చేసి చూపడం, దాని విశ్వసనీయతను దెబ్బతీయడం, దానిపై అనుమానాలు సృష్టించడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ అనుకూల మీడియా కూడా ప్రారంభ రోజుల్లో ఈ ఉద్యమాన్ని పూర్తిగా విస్మరించి, దేశంలో ఏమీ జరగనట్టుగా వ్యవహరించింది.
సోషల్ మీడియాలో బీజేపీ అనుకూలవాదులు ఉద్యమంపై మరింత తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం సాగించారు. ఈ ఉద్యమం దేశాన్ని అస్థిరపరచే కుట్రలో భాగమని, దేశవ్యతిరేక శక్తులు దీనిని నడిపిస్తున్నాయని, నిరసనకారులు భారతీయ సంస్కృతి, పురాణాలను అవమానిస్తున్నారంటూ ఎప్పటిలాగానే ఆధారరహిత ప్రచారం చేశారు. కేరళకు చెందిన బీజేపీ మేధావి టి.జి. మోహన్‌దాస్ తాను ఉద్యమ వేదిక దగ్గర ఉండి ఉంటే కర్ఫ్యూ విధించేవాడినని, కాల్పులు జరిపించేవాడినని, కొంతమంది చనిపోయేవారని, మరికొందరు శాశ్వత వికలాంగులుగా మారేవారని పేర్కొన్నాడు. మహిళా ఉద్యమకారిణుల పట్ల అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ తరహా ధోరణి అనేక మంది బీజేపీ అనుకూల యూట్యూబర్లలో కూడా కనిపించింది. అయితే ఈ దుష్ప్రచారానికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురైంది. ఏ సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుని ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వచ్చారో, అదే సోషల్ మీడియా ఇప్పుడు వారికే ఎదురునిలబడి వారి వాదనలను ఏకగ్రీవంగా ఖండించింది. గతంలో బీజేపీకి అనుకూలంగా ఉన్న అనేక మంది ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఎండగట్టారు.
మోడీ కూడా ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ఉద్యమం గురించి నోరు మెదపలేదు. చివర్లో అర్ధరాత్రి సమయంలో ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో "మిత్రోం", "మై డియర్ ఫ్రెండ్స్", "థాంక్యూ ఫ్రెండ్స్" అంటూ చేసిన సంబోధన తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. ఇంతకాలం విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించిన ప్రభుత్వం ఇప్పుడు వారినే "మిత్రులు" అని సంబోధించడం అపహాస్యంగా ఉందంటూ సోషల్ మీడియాలో అనేక మంది వ్యాఖ్యానించారు. మంత్రిపదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా తన ధోరణిని వీడలేదు. దీనికి నైతిక బాధ్యత వహిస్తున్నట్టుగా ఎక్కడా పేర్కొనలేదు. ఉద్యమం విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందనే భయంతోనే రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. మొత్తంగా చూస్తే, ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోవడం కంటే వ్యూహాత్మకంగా, దుష్ప్రచారం ద్వారా బలహీనపరిచే ప్రయత్నమే ఎక్కువగా చేసింది. చేస్తోంది. తప్పుడు కేసులు బనాయించి, భయపెట్టి, దుష్ప్రచారం చేసినా యువత మళ్లీ ప్రశ్నిస్తుందని, ప్రజాస్వామ్య హక్కుల కోసం మరోసారి ఎదురునిలుస్తుందని ఈ ఉద్యమం స్పష్టంగా చాటిచెప్పింది.
దారి చూపే కొత్త వెలుగు
ఈ విద్యార్థి ఉద్యమం భారత యువత గురించి ఒక అపోహను చెదరగొట్టింది. ఈ తరం మొబైల్ ఫోన్లలో మాత్రమే జీవిస్తుందని, సామాజిక సమస్యల పట్ల ఆసక్తి ఉండదని, ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పాల్గొనదని తరచూ వినిపించే విమర్శలకు ఈ ఉద్యమం సమాధానం చెప్పింది. అదే మొబైల్ ఫోన్ ప్రజలను సంఘటితం చేయడానికి, నిజాన్ని నమోదు చేయడానికి, ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి, ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఎంత శక్తివంతమైన సాధనమో నిరూపించింది. సాంకేతికత ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం కాదని, దాన్ని మరింత విస్తరించే సాధనమని ఈ తరం చూపించింది. శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధమైన హక్కు అనే విషయాన్ని ఈ ఉద్యమం మళ్లీ గుర్తుచేసింది. సమాచారాన్ని నియంత్రించడం గతంలోలా సులభం కాదని కూడా చూపించింది.
ఈ ఉద్యమం కొన్ని కీలకమైన పాఠాలను కూడా నేర్పింది. ప్రతి ఒక్కరూ పాల్గొనే ఉద్యమ ప్రతినిధిగా మారవచ్చని, సమాచారం కూడా ఒక రాజకీయ శక్తి అని, ప్రజాభిప్రాయమే అతిపెద్ద ప్రభావశీలి అని, వీధి పోరాటం, న్యాయపోరాటం, డిజిటల్ పోరాటం ఒకేసారి నడవగలవని నిరూపించింది. స్థానిక సమస్యను జాతీయ చర్చగా మార్చడం ఇప్పుడు చాలా వేగంగా సాధ్యమవుతోందని, ప్రతి మొబైల్ ఫోన్ ఒక పత్రిక, ఒక కెమెరా, ఒక చరిత్ర పత్రంగా మారగలదని ఈ ఉద్యమం స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ప్రత్యర్థిని ఓడించడంలో మాత్రమే ఉండదు; ఎక్కువ మంది ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షించడంలో ఉంటుంది. అందుకే ఈ ఉద్యమం ఆగ్రహాన్ని, ఆవేదనను మాత్రమే ప్రదర్శించలేదు; సంభాషణను, సమైక్యతనూ కూడా నిర్మించింది. ప్రభుత్వం, న్యాయస్థానాలు, మీడియా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కళాకారులు, మేధావులు... అందరినీ చర్చలోకి తీసుకు వచ్చింది. విస్తృతమైన సామాజిక మద్దతును నిర్మించింది. ఇది భారత యువత తన కాలానికి తగిన విధంగా రాసుకున్న కొత్త ఉద్యమ వ్యాకరణం. ఆ వ్యాకరణంలో వీధి ఉంది, మొబైల్ ఉంది; నినాదం ఉంది, డేటా ఉంది; ఆవేశం ఉంది, ఆలోచన ఉంది; ప్రతిఘటన ఉంది, బాధ్యత కూడా ఉంది. ఇది కేవలం ఒక ఉద్యమం కాదు; మారుతున్న భారతదేశానికి అద్దం పట్టిన ఒక చారిత్రక ఘట్టం. భవిష్యత్తుకు దారి చూపే కొత్త వెలుగు.
విద్యార్థి ఉద్యమం సాగింది ఇలా ...
మే 16న క్రాకోచ్ జనతా పార్టీ పుట్టుకతో ప్రారంభమైన ఈ ఉద్యమం, జూన్ 6న జంతర్‌మంతర్‌లో ప్రత్యక్ష నిరసనగా మారి జూలై 25 నాటికి 50 రోజుల మైలురాయిని దాటింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించినా, విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, అరెస్టుల విరమణ, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉందని క్రాకోచ్ జనతా పార్టీ ప్రకటించింది. ఆ ఉద్యమ కాలపట్టిక ఇదీ...
మే 15, 2026 : సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశ యువతను ఉద్దేశించి చేసిన "బొద్దింక" వ్యాఖ్య దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత, పోటీ పరీక్షల అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
మే 16: అభిజిత్ దీప్కే క్రాకోచ్ జనతా పార్టీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వేదికను ప్రారంభించాడు. "బొద్దింకలన్నీ ఒక్కటైతే?" అనే సందేశంతో యువతను ఏకం చేసే వ్యాఖ్య రాశాడు. కొద్ది రోజుల్లోనే కోటిన్నర మంది ఫాలోవర్లుగా చేరటం భారత యువత ఆగ్రహాన్ని ప్రతిబింబించింది.
మే 17–31: నీట్, ఇతర పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలలో జాప్యం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా యువత క్రాకోచ్ జనతా పార్టీ వేదిక చుట్టూ సమీకరించడం ప్రారంభించింది. లక్షలాది మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమానికి మద్దతు తెలిపారు.
జూన్ 6: అభిజిత్ దీప్కే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించాడు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యలు ప్రధాన డిమాండ్లుగా ప్రకటించారు.
జూన్ 7: ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించేందుకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ఉద్యమ నాయకులు ప్రకటించారు.
జూన్ 8–13: దేశంలోని అనేక రాష్ట్రాల్లో సంఘీభావ నిరసనలు జరిగాయి. విద్యార్థి సంఘాలు, ఉద్యోగార్థులు, పౌరసంఘాలు ఉద్యమంలో చేరాయి.
జూన్ 14: ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని మరింత విస్తరించాలని క్రాకోచ్ జనతా పార్టీ నిర్ణయించింది.
జూన్ 15–27: జంతర్‌మంతర్ ఉద్యమ కేంద్రంగా మారింది. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు.
జూన్ 28: పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష ప్రారంభించి విద్యార్థి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
జూలై 1–10: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, మాజీ సైనికులు, రచయితలు, సినీ ప్రముఖులు, పౌరసంఘాలు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఉద్యమం జాతీయ చర్చగా మారింది.
జూలై 11–17: ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్ష పార్టీలు కూడా విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ప్రకటించాయి.
జూలై 18: పోలీసులు జంతర్‌మంతర్‌లోని నిరసన శిబిరాన్ని ఖాళీ చేయించే సమయంలో లాఠీచార్జి, అరెస్టులు చోటుచేసుకున్నాయి. పలువురు గాయపడ్డారు. సోనం వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆయన నిరాహార దీక్ష సుమారు 21 రోజుల పాటు కొనసాగింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించినప్పటికీ, విద్యార్థుల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు.
జూలై 19–20: దేశవ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. "నన్నూ అదుపులోకి తీసుకోండి" కార్యక్రమానికి భారీ స్పందన లభించింది.
జూలై 20: చలో సంసద్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది విద్యార్థులు, యువత ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం విస్తృత ఆంక్షలు విధించింది. పలు రైళ్లను ఆలస్యంగా నడపడంతో పాటు కొన్ని రైళ్లను ఢిల్లీకి చేరకముందే నిలిపివేసింది. మొబైల్ నెట్‌వర్క్ సేవలను నిలిపివేయగా, జంతర్‌మంతర్‌కు వెళ్లకుండా విద్యార్థులను నగరంలోని అనేక ప్రాంతాల్లో అడ్డుకుంది. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఎక్కడికక్కడే నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగానికి దిగారు. టియర్ గ్యాస్ షెల్లు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి చేశారు. వాటర్ క్యానన్లతో నీటి ధారలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మహిళా విద్యార్థుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా పెల్లెట్ గన్లు కూడా ఉపయోగించారు.
జూలై 21: గాయపడిన విద్యార్థులను ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పరామర్శించారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు మరింత పెరిగాయి.
జూలై 22: అభిజిత్ దీప్కే ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఉద్యమం కొనసాగుతుందని క్రాకోచ్ జనతా పార్టీ ప్రకటించింది.
జూలై 23: 26 రోజులపాటు కొనసాగిన నిరవధిక నిరాహార దీక్షను సోనం వాంగ్‌చుక్ అధికారికంగా విరమించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై శాంతియుత నిరసనలకు సంబంధించి కేసులు నమోదు చేయబోమని, పరీక్షా వ్యవస్థలో సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చిస్తామని, ఇతర డిమాండ్లపై చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో దీక్షను ముగిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ఎలాంటి నిర్ణయం రాలేదు.
జూలై 24: మరిన్ని చర్చలు జరిగాయి. విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ, పరీక్షా సంస్కరణలు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. మంత్రి రాజీనామా అంశంపై ప్రతిష్ఠంభన కొనసాగింది.
జూలై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రధాన డిమాండ్లను అంగీకరించింది. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు విజయోత్సవాలు జరుపుకున్నారు. క్రాకోచ్ జనతా పార్టీ నిరవధిక ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించడం, అరెస్టయిన వారందరినీ విడుదల చేయడం, పోలీసుల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవడం, ప్రకటించిన సంస్కరణలను అమలు చేయడం వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
జూలై 26–28: బిహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విద్యార్థులపై అరెస్టులు, కేసుల నమోదు, పోలీసుల వేధింపులు కొనసాగటంపై క్రాకోచ్ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహనను ఉల్లంఘిస్తున్నారని విమర్శించింది. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే మరోసారి భారీ ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడే ఉద్దేశం లేదని తెలిపింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసి కేసుల ఉపసంహరణ, ఇతర హామీల అమలుపై చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
సత్యాజీ
94900 99167







కామెంట్‌లు (0)