సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒక డాక్యుమెంటరీ.. ఎన్నో ప్రశ్నలు..

1 గంట క్రితం

ఒక డాక్యుమెంటరీ.. ఎన్నో ప్రశ్నలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీల మధ్య అనుబంధం, అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణపై ప్రశ్నలు లేవనెత్తిన 36 నిమిషాల డాక్యుమెంటరీ 'ది ఫ్రెండ్షిప్ ఫైల్స్‌' రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని నిలువరించాలంటూ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేయగా, కలకత్తా హైకోర్టు అక్టోబరు 26న సినిమా ప్రదర్శన, క్లిప్పులు, పునఃప్రసారాలపై తాత్కాలిక నిషేధం విధించింది. సోషల్‌ మీడియా వేదికల నుంచి గుర్తించిన లింకులను తొలగించాలని ఆదేశించింది. హాట్‌మెయిల్‌ సహ వ్యవస్థాపకుడు సబీర్‌ భాటియా రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి 'హౌ మోడీ అండ్‌ అదానీ స్టోల్‌ ఇండియా' అనే ఉపశీర్షిక ఉంది. మోడీ, అదానీల మధ్య సాన్నిహిత్యం, ప్రభుత్వ విధానాలు, కీలక ఆర్థిక రంగాల్లో అదానీ సంస్థ ప్రాబల్యం పెరగడం వంటి అంశాలను ఈ చిత్రం చర్చకు తెచ్చింది.

​ఎదుగుదల వెనుక..

గౌతమ్‌ అదానీ వ్యాపార ప్రస్థానం గుజరాత్‌ నుంచే మొదలైంది. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అదానీ గ్రూప్‌ విస్తరణ వేగం పుంజుకోగా, 2014లో ఆయన ప్రధాని అయిన తరువాత దేశవ్యాప్తంగా పలు కీలక రంగాల్లోకి విస్తరించింది. ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు, విద్యుత్‌, సంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సంస్థ ప్రాబల్యం పెరిగింది. 2019లో ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణలో నిర్వహణ అనుభవం లేని అదానీ గ్రూప్‌కు ఆరు విమానాశ్రయాల నిర్వహణ హక్కులు దక్కడం వివాదాస్పదమైంది. టెండర్‌ నిబంధనల్లో అనుభవాన్ని తప్పనిసరి అర్హతగా తొలగించడంపై విమర్శలు వచ్చాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ముంబయి విమానాశ్రయంలోనూ అదానీ గ్రూప్‌ మెజారిటీ వాటాను దక్కించుకుంది. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, టెండర్‌ నిబంధనల మార్పులు, సహజ వనరుల కేటాయింపుల్లో ఈ సంస్థకు లభించిన ప్రయోజనాలు ప్రతిపక్షాల విమర్శలకు కారణమయ్యాయి. ఈ ఎదుగుదల వ్యాపార సామర్థ్య ఫలితమేనా? ప్రభుత్వ విధానాల తోడ్పాటు కూడా ఉందా? అన్న ప్రశ్నలను డాక్యుమెంటరీ ముందుకు తెచ్చింది.

​స్నేహం.. ప్రయోజనాలు

మోడీ, అదానీల మధ్య సాన్నిహిత్యం రాజకీయంగా మొదటి నుంచీ చర్చనీయాంశమే. 2014 ఎన్నికల ప్రచారంలో మోడీ ఉపయోగించిన విమానాలు అదానీ గ్రూప్‌కు చెందినవే. ప్రధాని అయిన తరువాత ఢిల్లీకి వెళ్లేందుకు కూడా అదానీ విమానాన్ని ఉపయోగించారు. విదేశీ పర్యటనల్లో అదానీ కనిపించడం, కొన్ని దేశాల్లో మోడీ పర్యటనల అనంతరం అదానీ గ్రూప్‌ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పరిణామాలను ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం అదానీ వ్యాపార విస్తరణకు ఉపయోగపడిందన్న విమర్శలు కొనసాగాయి. అమెరికాలో అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు ఈ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. 2024 నవంబరులో అమెరికా న్యాయశాఖ గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీ తదితరులపై భారత అధికారులకు లంచాలు ఇచ్చి సౌర విద్యుత్‌ ఒప్పందాలు పొందేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో క్రిమినల్‌ అభియోగాలు నమోదు చేసింది. అమెరికా పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే 2026 ఆగస్టులో అమెరికా న్యాయశాఖ అభ్యర్థన మేరకు న్యాయస్థానం ఆ క్రిమినల్‌ అభియోగాలను శాశ్వతంగా కొట్టివేసింది. ఈ పరిణామం వెనుక మోడీ ప్రభుత్వ ఒత్తిడి, అమెరికాకు లొంగుబాటు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి.

​సినిమాల్లోనూ రాజకీయం

గతంలో 'ది కేరళ స్టోరీ' సినిమా విషయంలోనూ రాజకీయ వివాదం చెలరేగింది. కేరళకు చెందిన 32 వేల మంది మహిళలు మతం మారి ఐఎస్‌ఐఎస్‌లో చేరారంటూ సినిమాలో చేసిన ప్రచారానికి ప్రామాణిక ఆధారాలు లేవని వాస్తవ పరిశీలన సంస్థలు వెల్లడించాయి. సుప్రీంకోర్టులోనూ ఈ సంఖ్యకు ఆధారం లేదని నిర్మాతలు అంగీకరించారు. అయినప్పటికీ ప్రధాని మోడీ ఎన్నికల సభల్లో ఈ సినిమాను ప్రస్తావించగా, బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు ప్రకటించాయి. 'ది కాశ్మీర్‌ ఫైల్స్‌' విషయంలోనూ బీజేపీ నాయకుల నుంచి ఇదే తరహా ప్రచారం కనిపించింది. అయితే ఇప్పుడు 'ది ఫ్రెండ్షిప్ ఫైల్స్‌' విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందంటూ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కోర్టును ఆశ్రయించింది. ఒక సినిమా తమ రాజకీయ వాదనలకు అనుకూలంగా ఉంటే ప్రచారం చేయడం, తమకు ఇబ్బందికరమైన ప్రశ్నలు లేవనెత్తే సినిమా విషయంలో నిషేధం కోరడం చర్చకు దారితీస్తోంది. ఇది భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో విమర్శలకు ఉండాల్సిన స్థానం వంటి అంశాలను ముందుకు తెస్తోంది.

​ప్రశ్నలకు సమాధానాలేవి?

'ది ఫ్రెండ్షిప్ ఫైల్స్‌' వివాదం ఒక డాక్యుమెంటరీ ప్రదర్శనకే పరిమితమైనది కాదు. దేశ ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యం, ప్రభుత్వ విధానాలపై వాటి ప్రభావం, రాజకీయ నాయకత్వానికి పారిశ్రామికవేత్తలకు మధ్య ఉండాల్సిన దూరం వంటి మౌలిక ప్రశ్నలను ముందుకు తెస్తోంది. ప్రధాని, పారిశ్రామికవేత్త మధ్య స్నేహం ఉండటంలో తప్పులేదు. కానీ ఆ సాన్నిహిత్యం ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తోందా? ప్రజల ఆస్తులు, సహజ వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నాయా? కీలక రంగాల్లో ప్రైవేటు గుత్తాధిపత్యం పెరుగుతోందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి. సినిమాలోని ఆరోపణలు నిజమో కాదో తేల్చాల్సింది ఆధారాలు, విచారణలు, న్యాయస్థానాలు. అదే సమయంలో అధికారాన్ని ప్రశ్నించే హక్కును కాపాడటం కూడా ప్రజాస్వామ్యానికి అవసరం. అనుకూల సినిమాలను ప్రోత్సహిస్తూ, విమర్శనాత్మక కథనాలను అడ్డుకునే ప్రయత్నాలు భావప్రకటనా స్వేచ్ఛపై ఆందోళనలు రేకెత్తిస్తాయి. లింకులను తొలగించవచ్చు, ప్రదర్శనలను నిలిపివేయవచ్చు. కానీ సినిమా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరాన్ని మాత్రం తప్పించుకోలేరు.

bhatiya.jpg

ఎవరీ సబీర్‌ భాటియా?

'ది ఫ్రెండ్షిప్ ఫైల్స్‌' రూపొందించిన సబీర్‌ భాటియా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగాన్ని మార్చిన హాట్‌మెయిల్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1968లో చండీగఢ్‌లో జన్మించిన ఆయన కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కాల్టెక్‌)లో చదివి, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. ఆపిల్‌ సంస్థలో హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన అనంతరం జాక్‌ స్మిత్‌తో కలిసి 1996లో హాట్‌మెయిల్‌ను ప్రారంభించారు. ఎక్కడి నుంచైనా ఉచితంగా ఈ-మెయిల్‌ పంపుకునే సదుపాయంతో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. 1997లో మైక్రోసాఫ్ట్‌ సుమారు 400 మిలియన్‌ డాలర్లకు (రూ.1600 కోట్లు) హాట్‌మెయిల్‌ను కొనుగోలు చేసింది. అనంతరం పలు సాంకేతిక, వ్యాపార సంస్థలతో పనిచేసిన భాటియా, అక్టోబరు 9న తన 'బీ క్యూబ్డ్‌' యూట్యూబ్‌ ఛానల్‌లో 'షాడో సిటిజన్స్‌'తో కలిసి 'ది ఫ్రెండ్షిప్ ఫైల్స్‌'ను విడుదల చేశారు.

​డాక్యుమెంటరీపై కోర్టు నిషేధాజ్ఞలు వచ్చినా భాటియా వెనక్కి తగ్గలేదు. 'ఈ వ్యాజ్యం అదానీ సంస్థ ప్రతిష్ఠకు నష్టం కలిగిందంటూ రూ.50 కోట్లు కోరుతోంది. కానీ ఈ డాక్యుమెంటరీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను కలవరపెట్టిందని, ఉన్నత స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందని నేను భావిస్తున్నాను. సత్యం నా వైపు ఉంది' అని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. మరో పోస్టులో దొడ్డిదారిలో సంపాదించిన సంపద వల్ల విశ్వసనీయత, ప్రతిష్ఠ లభించవని, తన దృష్టిలో ఆ ప్రతిష్ఠ విలువ సున్నా అని పేర్కొన్నారు.

- ప్రజాశక్తి సినిమా డెస్క్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్