సినిమా కేవలం వినోదం కాదు. సమాజాన్ని చూసే ఒక దృక్కోణం. వర్తమానాన్ని ప్రశ్నించే ఒక కళారూపం. అధికారాన్ని విమర్శించే ఒక ఆయుధం. అందుకే ప్రజాస్వామ్యంలో సినిమా సృజనాత్మక స్వేచ్ఛకు ప్రతీకగా నిలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ స్వేచ్ఛపై సెన్సార్ కత్తెర వేలాడుతోంది. ముఖ్యంగా రాజకీయాలు, మతం, కులం, చరిత్ర, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సినిమాల విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇటీవల నటుడు ప్రకాశ్‌రాజ్, దర్శక నటుడు ఆర్. నారాయణమూర్తి ఈ అంశంపై తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2020-21లో 1,475 సినిమాలకు మార్పులు, కట్స్ సూచించగా, 2021-22లో 1,911, 2022-23లో 2,205, 2023-24లో 2,440, 2024-25లో ఏకంగా 3,033 సినిమాలకు మార్పులు సూచించబడ్డాయి. ఇందులో ప్రతి మార్పూ రాజకీయ కారణాలతో జరిగిందని చెప్పలేం. కానీ రాజకీయ, మత, సామాజిక అంశాలున్న సినిమాల విషయంలో సెన్సార్ జోక్యం పెరుగుతున్నదన్న విమర్శను విస్మరించలేం. మలయాళ సినిమా ‘ఎల్2 ఎంపురాన్’ ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇందులో 2002 గుజరాత్ అల్లర్ల దృశ్యాలు, జాతీయ దర్యాప్తు సంస్థ ప్రస్తావనలు ఉండకూడదని సెన్సార్ బోర్డు మార్పులు సూచించింది. ఆ తరువాత కూడా రాజకీయ ఒత్తిడితో నిర్మాతలు మరికొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఒక రాజకీయ సంఘటనను తెరపై చూపించడం కూడా ఎంతటి ఒత్తిడికి దారితీస్తుందో ఈ వివాదం చూపించింది. ‘పంజాబ్ 95’ విషయంలో పరిస్థితి మరింత తీవ్రమైంది. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ 127 కట్స్ సూచించింది. ఒక వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించిన సినిమాలో వాస్తవ చరిత్రకు సంబంధించిన పదాలు, ప్రదేశాలు, సంఘటనలూ తొలగిస్తే - ఇక ఏం మిగులుతోంది? తమిళ సినిమా ‘మనుషి’లో పౌరసత్వ చట్టం, కులం, మతం, రాజకీయ భావజాలం గురించి ప్రస్తావించడంపై సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘ఫూలే’ సినిమాలో మహర్, మాంగ్, శూద్ర, కులం, పీష్వాయి వంటి చారిత్రక పదాలను మార్చాలని సూచించింది. కులవ్యవస్థపై పోరాడిన జ్యోతిరావు ఫూలే జీవితాన్ని చెప్పే సినిమాలో కులవ్యవస్థకు సంబంధించిన పదాలనే తొలగిస్తే ఇక ఆ కథకు అర్థం ఏముంటుంది?
మలయాళ ‘హాల్’లో బీఫ్ బిర్యానీ తినే దృశ్యం, ‘ధ్వజ్ ప్రణామ్’, ‘గణపతి వట్టం’, మతపరమైన సంభాషణలు వంటి అంశాలపై అభ్యంతరాలు వచ్చాయి. కేరళ హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ‘ప్రైవేట్’ సినిమాలో ‘సిటిజన్‌షిప్ బిల్’, ‘రామరాజ్యం’ వంటి పదాలపై సెన్సార్ బోర్డు కట్స్ చెప్పింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే ‘బచ్చల మల్లి’లో భగవద్గీత శ్లోకాలు, అయ్యప్ప స్వాముల ప్రస్తావనలు, భవాని దీక్షకు సంబంధించిన దృశ్యాలు తొలగించబడ్డాయి. ‘విశ్వం’లో ‘మోడీ’ అనే పదం ఉన్న పాటను మ్యూట్ చేశారు. దేవతలకు అగౌరవంగా ఉందని చెప్పి ఇటీవల ‘సరస్వతి’ పేరును ‘ఎస్ సరస్వతి’గా, ‘హే భగవాన్’ పేరును ‘హే బల్వంత్’గా మార్చారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’లో ‘కామ్రేడ్’ అనే పదంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసిందని, ఇది దారుణమని ఆర్. నారాయణమూర్తి బహిరంగంగా ప్రశ్నించారు.
భావజాల పక్షపాతం
సెన్సార్ బోర్డు రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న విమర్శలకు బలాన్నిచ్చే ఉదాహరణలు ఉన్నాయి. ఒక సినిమా అధికారాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తే, కుల వివక్షను చూపిస్తే, మత రాజకీయాలను విమర్శిస్తే ‘భావాలు దెబ్బతింటాయి’, ‘ప్రజా శాంతికి భంగం’ వంటి కారణాలతో కత్తెర వేస్తోంది. అదే సమయంలో ఒక నిర్దిష్ట మతాన్ని బాధితురాలిగా, మరో మతాన్ని దోషిగా చూపించే సినిమాలకు మాత్రం ఈ ప్రమాణాలను వర్తింపజేయటం లేదు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చరిత్రను ఏకపక్షంగా చూపించిందని, ముస్లింలపై ద్వేషాన్ని పెంచేలా చిత్రీకరించిందని విమర్శలు ఎదుర్కొంది. అయినా సెన్సారు కత్తెర వేయలేదు. బీజేపీ పాలిత అనేక రాష్ట్రాలు సినిమాకు పన్ను మినహాయింపులు ఇచ్చాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు సినిమా చూడటానికి సెలవులు కూడా ఇచ్చారు. తరువాత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ సమైక్యతకు ఇచ్చే నర్గిస్ దత్ పురస్కారాన్ని కూడా ఈ సినిమా పొందింది. వేలాది మంది కేరళ యువతులను మతం మార్చి ఉగ్రవాద సంస్థల్లోకి పంపారని అబద్ధాన్ని ప్రచారం చేసిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు ఇచ్చాయి. తరువాత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రహణం పురస్కారాలు ఇచ్చారు. ‘రజాకార్’ విషయంలోనూ అదే పక్షపాతం కొనసాగింది.
ఈ ద్వంద్వ ప్రమాణాలను పలువురు సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. ‘కేంద్ర సెన్సార్షిప్’ పెరుగుతోందని నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించారు. ‘కేరళ ఫైల్స్’ వంటి కట్టుకథల సినిమాలకు సెన్సారు మద్దతు ఉండగా, మరికొన్ని సినిమాలు ఎందుకు విడుదలకు ఇబ్బంది పడుతున్నాయని ప్రశ్నించారు. ‘దుర్గా’ అనే పేరు సినిమాలో ఉంటే అభ్యంతరం ఎందుకు, అదే పేరుతో మద్యం బ్రాండ్లు, బార్లు ఉంటే అభ్యంతరం ఎందుకు ఉండదని అడిగారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా సెన్సార్ నిబంధనలు ఏకపక్షంగా మారుతున్నాయని విమర్శించారు. ‘పంజాబ్ 95’ విషయంలో ఒక సినిమాకు వర్తించే ప్రమాణాలు మరో సినిమాకు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. ‘ఫూలే’ దర్శకుడు అనంత్ మహదేవన్ కూడా సెన్సార్ సూచనలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సెన్సార్ ప్రమాణాలు స్పష్టంగా ఉండాలి
సెన్సార్ బోర్డు చేయాల్సిన పని సినిమా దర్శకుడు, రచయిత స్థానంలో కూర్చొని కథను తిరిగి రాయడం కాదు. చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ధ్రువీకరణ ఇవ్వడం. కానీ ఒక పాత్ర పేరు ఏం ఉండాలి, ఒక చారిత్రక పదం వాడాలా వద్దా, ఒక రాజకీయ సంఘటనను ఎంతవరకు చూపించాలి, ఒక మతానికి సంబంధించిన పదం తెరపై పలకవచ్చా లేదా అనే స్థాయికి జోక్యం పెరిగితే అది ధ్రువీకరణ కాదు... సృజనాత్మక నియంత్రణ అవుతుంది. ఒక దర్శకుడు సినిమా తీసేటప్పుడు ‘ఈ సన్నివేశానికి సెన్సార్ అభ్యంతరం చెబుతుందా?’, ‘ఈ పదం వల్ల రాజకీయ వివాదం వస్తుందా?’, ‘ఈ పాత్రను ఇలా చూపిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి?’ అని ముందుగానే ఆలోచించడం మొదలుపెడితే సృజనాత్మక స్వేచ్ఛ కాగితంపై మాత్రమే మిగులుతుంది. అధికారాన్ని ప్రశ్నించని, వివాదాన్ని తప్పించుకునే, ఇప్పటికే ఆమోదించబడిన భావజాలంలోనే తిరిగే సినిమాలే మిగిలే ప్రమాదం ఉంది. సెన్సార్ వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. హింస, బాలల దుర్వినియోగం, అసభ్యత, చట్టవ్యతిరేక కంటెంట్ వంటి అంశాలకు స్పష్టమైన ప్రమాణాలు అవసరమే. కానీ రాజకీయ విమర్శ, చారిత్రక వ్యాఖ్యానం, కుల వివక్ష, మత రాజకీయాలు, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తడం వంటి అంశాలకు ‘మనోభావాలు’ అనే అస్పష్టమైన ప్రమాణాన్ని ప్రయోగించడం మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సినిమా సమస్యని ప్రశ్నించినప్పుడే అది కళగా మారుతుంది. చరిత్రలోని బాధను చూపించినప్పుడే అది సాక్ష్యంగా నిలుస్తుంది. సమాజంలోని అన్యాయాన్ని చూపించినప్పుడే అది ప్రజల గొంతుక అవుతుంది. ఆ గొంతును కత్తిరించడం సెన్సార్ పని కాదు. కాకూడదు.
- సుజయ సాహితి








కామెంట్లు (0)