గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమరింత తీవ్రంగా ఎల్‌‌నినో

3 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 12:07 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • ఆగస్టు తరువాత పరిస్థితులపై మంత్రివర్గం ఆందోళన

  • సాగునీటి కష్టాలు తప్పవు

  • భూగర్భ జలాలు తగ్గుతాయి

  • రైతులకు వాతావరణ పరిస్థితులు వివరించాలని నిర్ణయం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​ఎల్‌‌నినో ప్రభావం ఆగస్టు తరువాత మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో గురువారం జరిగింది. ఈ సమావేశ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మీడియాకు వివరించారు. ఎల్‌‌నినో వల్ల వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ఈ అంశంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. సుదీర్ఘ చర్చ తరువాత ఎల్‌‌నినో ప్రభావాన్ని రైతులకు వివరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ప్రస్తుతం సాధారణం కంటే 51శాతం వర్షం తక్కువగా ఉందని, రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని విలేకరుల సమావేశంలో మంత్రి పార్ధసారధి చెప్పారు. ఈ నేపధ్యంలో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని కేబినెట్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ పంటలు వేయటం వల్ల సకాలంలో సాగు నీరు అందక పోతే రైతులు నష్టపోతారని, ఈ ఏడాది నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటల సాగు వైపు రైతులు మొగ్గుచూపాలని మంత్రివర్గం సూచించిందని చెప్పారు. భూగర్భ జలాలు సైతం అడుగంటే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కొత్తగా బోర్లు వేసే ఆలోచనను కూడా రైతులు చేయొద్దని, దీని ద్వారా భూగర్భ జలాలు మరింత అడుగంటే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. పోలవరం వద్ద గోదావరి నది ప్రతి ఏడాది ఈ సమయానికి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నీరు ప్రవహించేదని, ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండటంతో ఈ ఏడాది కేవలం 35 నుండి 38వేల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే ప్రవహిస్తోందన్నారు. దీంతో గోదావరి,కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సాగు నీరు అందని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో సాగు చేసే రైతులు ఇప్పటికే 70 శాతం మంది రైతులు నాట్లు వేశారని, కొత్తగా ఇక ఏవరూ వేయొద్దని కోరారు. రైతులకు ప్రభుత్వం,వ్యవసాయ శాఖలు అండగా ఉంటాయని,రైతులు కూడా ప్రభుత్వం అందించే సూచనలు,సలహాలు పాటించాలని కోరారు. రైతులను ఆదుకోవడానికి వివిధ రకాల విత్తనాల కిట్లను అందించడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. తాగునీటి సరఫరాకు ట్యాంకర్ల వినియోగంపై కూడా ప్రభుత్వం సమాలోచన చేస్తుందన్నారు. పశుగ్రాసం కొరత రాకుండా మెట్ట పంటల సాగు ఆలోచన చేయలని కోరారు. రాష్ట్రంలో 59 శాతం ఆయకట్టు భూమి,41 శాతం వర్షాధార పంట భూములు ఉన్నాయని,ఈ ఏడాది ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. అందుకు అవసరమైన విత్తనాల కిట్లను కూడా వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుందన్నారు. ఎల్‌‌నినో ప్రభావాలను తగ్గించడానికి జల వనరులను రెగ్యులైజ్ చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పారు.

‘నేతన్నల సేవ’కు రూ.25వేలు

చేనేత కార్మికులకు ‘నేతన్నల సేవలో’ పథకం పేరుతో ఏడాదికి రూ.25వేల ఆర్ధిక సహాయం అందించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయస్సుతో సంబంధం లేకుండా, వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.25వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ఈ విద్యాసంవత్సరం నుంచి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. గోదావరి పుష్కరాలు-2027 భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేసేందుకు రూ.50కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం చేసినట్లు చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మార్క్‌‌ఫెడ్‌‌కు టర్మ్ లోన్‌గా రూ.300 కోట్లు పొందేందుకు ప్రభుత్వ హామీ ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించామన్నారు. ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలోని జెట్ సిటీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ టవర్-1లోని స్థలాన్ని, తొలుత కేటాయింపు పొందిన ఎఎల్‌ఇఎపి తదితర సంస్థలకు కేటాయించాలన్న ఎపిఐఐసి ప్రతిపాదనను ఆమోదించామన్నారు. మిగిలిన టవర్లను పిపిపి విధానంలో లేదా అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుని పూర్తి చేయాలని ఎపిఐఐసికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

పలు భూకేటాయింపులకు ఆమోదం

నంద్యాల జిల్లాలో గణపురం, పాములపాడు గ్రామాల్లో 7.73 ఎకరాల భూమిని మినీ హైడల్ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఎన్‌‌సిఎల్‌ ఇండస్ట్రీస్‌ ‌లిమిటేడ్‌‌కు 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగింత.

విశాఖపట్నం రూరల్ మండలం ఎండాడ గ్రామంలో 2.16 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌గ్యాస్ర్టోఎంటరాలజీ(ఎఐజి) హైదరబాద్‌ హాస్పిటల్స్‌ ‌చైర్మన్‌‌కు ఎకరానికి రూ.5కోట్లు చొప్పున ‌అప్పగించేందుకు ఆమోదం.

చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం పట్నం గ్రామంలో3 ఎకరాలను మార్కెట్ విలువ చెల్లింపుపై ఎపిటిఎకు బదిలీ.

కడప జిల్లా కొండాపురం మండలం కె బొమ్మేపల్లి గ్రామంలో 43.79 ఎకరాలను నెడ్‌‌క్యాప్‌‌కు అప్పగింత.

ప్రకాశం జిల్లా కొండపి మండలం కె.జి.కండ్రిక గ్రామంలో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమిని కొండపి అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి కార్యాలయ భవన నిర్మాణం కోసం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 0.50 ఎకరాల భూమిని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి కార్యాలయం నిర్మాణం కోసం ఏడాదికి రూ.1000ల చొప్పున లీజుకు అప్పగించేందుకు ఆమోదం.

నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో 97 ఎకరాల భూమిని సోలార్‌, విండ్‌ ‌ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు ఎకరానికి రూ.5లక్షల చొప్పున నెడ్‌‌క్యాప్‌‌కు అప్పగింత.

చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లె గ్రామంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 9.36 ఎకరాల భూమిని ఏడాదికి ఎకరానికి రూ.15వేలు లీజు చొప్పున నెడ్‌‌క్యాప్‌‌కు అప్పగింత.

పుట్టపర్తిలో సమీకృత అత్యాధునిక ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా, SSS ఏరోస్పేస్ ప్రైవేట్ కంపెనీ కోసం 76.13 ఎకరాల భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగింపు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలోని 66.74 ఎకరాల భూమిని ఎకరానికి రూ.6.25లక్షల చొప్పున అటవీ భూమి మళ్లింపునకు బదులుగా చేపట్టాల్సిన పరిహారంగా గ్రీన్‌‌కో ఎనర్జీస్‌‌కు అందజేత.

శ్రీరాంపురం గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలో 13.76 ఎకరాల భూమిని మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు ఎకరానికి రూ.32.50లక్షల చెల్లింపుపై ఎపిఐఐసికి దాఖలా పరిచే ప్రతిపాదనకు ఆమోదం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్