తీర నగరాలకు ఐరాస హెచ్చరిక
ముంబయి, కోల్‌కతా సహా ప్రపంచంలోని వందలాది నగరాలకు ముప్పు
జెనీవా : ఒక ఉదయం లేచి చూస్తే... మనకు తెలిసిన ఓ సముద్ర తీరం కొంత కనిపించకపోతే ? నిన్నటి వరకు వాహనాలు తిరిగిన రోడ్లను వరద నీరు ముంచెత్తితే ? ఇళ్లలోని బావులు, బోర్లు ఉప్పునీటిగా మారితే ? తరతరాలుగా అక్కడే జీవిస్తున్న కుటుంబాలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తే ? .... ఇది కల్పిత కథ కాదు. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ తీర ప్రాంతాల ముందు నిలిచిన తీవ్రమైన భవిష్యత్తు ముప్పు..!
సముద్ర మట్టాల పెరుగుదల గతంలో ఎన్నడూ లేనంత వేగంతో కొనసాగుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. 2024లోనే ప్రపంచ సముద్ర మట్టం దాదాపు 6 మిల్లీమీటర్లు పెరిగింది. భూమి వేడెక్కుతున్న కొద్దీ సముద్రపు నీరు ఉష్ణంతో విస్తరించడం, హిమనదులు, మంచు పలకలు కరగడం ఇందుకు ప్రధాన కారణాలు. ఇది కేవలం సముద్రానికి సంబంధించిన సమస్య కాదు. ఇది తాగునీటి సమస్య... ఆహార భద్రత సమస్య... నివాస సమస్య... ఆర్థిక సమస్య... చివరకు మానవ వలసల సమస్య..!
ఆ రెండు తీర నగరాలకు ముప్పు ఎక్కువ ..!
సముద్ర మట్టం పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలోని తక్కువ ఎత్తయిన తీర ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా నదీ డెల్టాలపై విస్తరించిన నగరాలకు ముప్పు మరింత ఎక్కువ. భారత్‌లో ముంబై, కోల్‌కతా ఈ ప్రమాదానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. సముద్రంతో ముడిపడిన విస్తారమైన నగర జీవితం ముంబయిది. మరోవైపు గంగా డెల్టాకు సమీపంలోని తక్కువ ఎత్తయిన భూభాగంలో కోల్‌కతా విస్తరించి ఉంది.

భూమి కుంగిపోతోంది..!
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగడంతోపాటు భూమి కూడా క్రమంగా కుంగిపోతోంది. అంటే సముద్రం పైకి రావడం మాత్రమే కాదు... భూమి కూడా నీటివైపు దిగజారుతోంది. దక్షిణాసియాలోని ముంబయి, కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా వంటి ప్రాంతాల్లో 1.4 కోట్ల మందికి పైగా ప్రజల నివాసాలు శాశ్వతంగా నీట మునిగే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరిస్తోంది.
వరదొస్తే ....
సముద్రం ముందుకు వస్తే మొదట కనిపించేది వరద. కానీ దాని ప్రభావం అంతటితో ఆగదు. సముద్రపు ఉప్పునీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకెళితే తాగునీటి వనరులు కలుషితమవుతాయి. నేలలో ఉప్పుజలతత్వం పెరిగితే పంటల దిగుబడులు తగ్గుతాయి. వ్యవసాయం దెబ్బతింటుంది. సాగునీరు, భూగర్భ జలాలు, తీర ప్రాంత జీవవ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. అంతేకాదు... రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ వ్యవస్థలు, ఆసుపత్రులు, పాఠశాలలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కూడా నీటి ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే సముద్ర మట్టం పెరుగుదల అనేది కేవలం తీరంలో నివసించే వారి సమస్య కాదు. ఒక నగర ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేయగల సంక్షోభం..!
ప్రపంచ జనాభాలో పది మందిలో ఒకరు ....
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77 కోట్ల మంది ప్రజలు అధిక ఆటుపోట్ల రేఖకు 5 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు ప్రతి పది మందిలో ఒకరు సముద్ర మట్టాల పెరుగుదలకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో జీవిస్తున్నారు. వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (IPCC) అంచనా ప్రకారం .... 2050 నాటికి ప్రపంచ సగటు సముద్ర మట్టం దాదాపు 0.23 మీటర్లు పెరిగే అవకాశం ఉంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించినా ఇప్పటికే జరుగుతున్న మార్పుల కారణంగా సముద్ర మట్టాల పెరుగుదల పూర్తిగా ఆగిపోదు.
2050 నాటికి ఆ పరిస్థితి : ఐరాస హెచ్చరిక
ప్రపంచం తగినంతగా సిద్ధం కాకపోతే 2050 నాటికి 120 కోట్ల మంది ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. పసిఫిక్ ద్వీపాల్లోని కొన్ని సముదాయాలు ఇప్పటికే ఈ ముప్పును ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నాయి. భూభాగం క్రమంగా కోల్పోతుండటంతో కొన్ని ప్రాంతాల్లో పునరావాస చర్యలు మొదలయ్యాయి.
ట్రిలియన్ల డాలర్ల నష్టం ....
సముద్ర మట్టాల పెరుగుదల మానవ జీవితాలనే కాదు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ కుదిపేయనుంది. తీర ప్రాంత మౌలిక సదుపాయాలకు ఇప్పటికే 1.8 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోందని అంచనాలు చెబుతున్నాయి. తగిన అనుసరణ చర్యలు చేపట్టకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 1.2 ట్రిలియన్ నుంచి 4 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం సంభవించే అవకాశం ఉంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సముద్రపు కోత ఇప్పటికే వేగం పుంజుకుంది. జర్మనీ తీరరేఖలో దాదాపు 70 శాతం సముద్రపు కోతను ఎదుర్కొంటోంది. ఫ్రెంచ్ రివియెరాలోని కొన్ని చిన్న ఇసుక తీరాలు 19వ శతాబ్దం చివరి నుంచి దాదాపు 50 శాతం విస్తీర్ణాన్ని కోల్పోయాయి. కరీబియన్ ప్రాంతంలో 2050 నాటికి దాదాపు 40 శాతం బీచ్‌లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.
సముద్రాన్ని ఆపలేం.. కానీ ప్రమాదాన్ని తగ్గించవచ్చు ....
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి 18 కీలక చర్యలను సూచించింది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను వేగంగా తగ్గించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, వాతావరణ అనుసరణకు నిధులు పెంచడం, శాస్త్రీయ సమాచారాన్ని మెరుగుపరచడం, ప్రమాదంలో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. అయితే సముద్ర మట్టం పెరుగుదల ఒక్కరోజులో వచ్చిపడే విపత్తు కాదు. అది నెమ్మదిగా ముందుకు సాగే సంక్షోభం.
ఈరోజు కొన్ని మిల్లీమీటర్లు...
రేపు తరచూ వచ్చే వరదలు...
ఆ తర్వాత ఉప్పునీటిగా మారే భూగర్భ జలాలు...
తరువాత వ్యవసాయ భూములపై ప్రభావం...
చివరికి నివాస ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు.
సముద్రం ఒక్కసారిగా నగరాలను మింగేయదు. కానీ మనం నిర్లక్ష్యం చేస్తే... కొద్దికొద్దిగా తన పరిధిని పెంచుకుంటూ నగరాల జీవితాన్ని మార్చేస్తుంది. ముంబయి, కోల్‌కతా తీరాలపై పడుతున్న వరదనీటి నీడ కేవలం ఆ రెండు నగరాలకే హెచ్చరిక కాదు. దేశంలోని ప్రతి తీర నగరానికీ ఇది ఒక ‘వార్నింగ్ బెల్’. రేపటి తరాలు సముద్రాన్ని చూసి భయపడకుండా... సముద్రం పక్కనే సురక్షితంగా జీవించాలంటే, నిర్ణయం తీసుకోకతప్పదు..!







కామెంట్‌లు (0)