శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్యాన్సర్‌.. ముందస్తు గుర్తింపు ముఖ్యం

7 గంటల క్రితం

క్యాన్సర్‌.. ముందస్తు గుర్తింపు ముఖ్యం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 06:06 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​క్యాన్సర్‌ వ్యాధికి అధునాతన చికిత్సలు ఎన్ని వచ్చినా వ్యాధి ముదిరితే అవేమీ చేయలేవు. అలా అని వ్యాధి ప్రారంభంలో తెలుసుకోవడం చాలా మందికి అసాధ్యంగా ఉంటోంది. తరచూ వైద్య చికిత్సలు చేయించుకునేవారికి ఏదేని పరీక్షల్లో అనుమానంగా ఉన్నప్పుడు క్యాన్సర్‌ ‌పరీక్షను చేస్తుంటారు. సాధారణ జనాలకు మాత్రం ఈ వ్యాధి చుట్టూ ఎన్నో భయాలు వెంటాడుతూనే ఉంటాయి. చికిత్స ఎంతకాలం చేయించుకోవాలి? కోలుకునే అవకాశాలు ఎలా ఉంటాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నిత్యం వేధిస్తుంటాయి. అయితే ప్రముఖ బాలీవుడ్‌ నటి షర్మిలా ఠాగూర్‌కు ‌కోవిడ్‌ ‌కు ముందు బయటపడిన ‘శూన్య దశ ఊపిరితిత్తుల క్యాన్సర్‌’ గురించి ఆమె కూతురు సోహా అలీ ఖాన్‌ ఇటీవల కొన్ని విషయాలను వెల్లడించారు. అయితే అసలు శూన్య దశ క్యాన్సర్‌ అంటే ఏమిటి? ఈ దశలో వ్యాధిని ఎలా గుర్తిస్తారు? ఎలాంటి చికిత్స అవసరమవుతుంది? వైద్యులు ఏమంటున్నారు?


​ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ‌ప్రారంభ దశలో ఉన్నట్లు షర్మిలా ఠాగూర్‌కు నిర్ధారణ కాగానే, ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ శస్త్రచికిత్సలో క్యాన్సర్‌ కణజాలాన్ని తొలగించారని, ఆ తర్వాత ఆమెకు కీమోథెరపీ అవసరం రాలేదని సోహా వివరించారు. ఈ అనుభవం క్యాన్సర్‌ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మరోసారి చర్చకు తీసుకొచ్చింది. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడం ఒక అంశమైతే, అది ఏ దశలో ఉంది? ఎలాంటి కణజాలంలో మార్పులు వచ్చాయి? అవి ఎంతవరకు వ్యాపించాయి? అనేవి చికిత్సను నిర్ణయించడంలో కీలకంగా ఉంటాయనేది స్పష్టమైంది. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ ఆంకాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సచిన్‌ మార్దా ఈ అంశాలను ఇలా వివరించారు.

​శూన్య దశ అంటే ఏమిటి?

క్యాన్సర్‌ కణాలు అవి ఏర్పడిన ప్రాంతాన్ని దాటి చుట్టుపక్కల కణజాలాల్లోకి చొచ్చుకుపోని అత్యంత ప్రారంభ పరిస్థితిని కొన్ని రకాల క్యాన్సర్లలో ‘శూన్య దశ’గా పరిగణిస్తారు. వైద్య పరిభాషలో దీనిని ‘కార్సినోమా ఇన్‌ సిటు’ అంటారు. అంటే అసాధారణ కణాలు ఏర్పడిన చోటే కొంతకాలం పరిమితంగా ఉంటాయి. ఊపిరితిత్తుల్లో కనిపించే ‘అడెనోకార్సినోమా ఇన్‌ సిటు’ దీనికి ఒక ఉదాహరణ. ఈ పరిస్థితిలో అసాధారణ కణాలు ఊపిరితిత్తుల లోపలి పొరలోనే ఉంటాయి. చుట్టుపక్కల కణజాలంలోకి చొచ్చుకుపోవు. అయితే, ఊపిరితిత్తుల్లో కనిపించే ప్రతి గడ్డను ‘శూన్య దశ క్యాన్సర్‌’గా భావించకూడదు. కణజాల పరీక్షల ఆధారంగానే వ్యాధి స్వభావాన్ని నిర్ధారించాలి. అలాగే అన్ని క్యాన్సర్లలోనూ శూన్య దశకు ఒకే విధమైన అర్థం ఉండదు. క్యాన్సర్‌ రకాన్ని బట్టి దాని లక్షణాలు, వ్యాప్తి, చికిత్స మారుతుంటాయి.

లక్షణాలు లేకుండానే బయటపచ్చు!

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రారంభ దశలో చాలాసార్లు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవొచ్చు. వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఇతర ఏవేని కారణాలతో చేయించుకున్న వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో అసాధారణ మార్పులు బయటపడే అవకాశం ఉంది. ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌ వంటి పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో చిన్న గడ్డలు, ఇతర అసాధారణ మార్పులు కనిపించవచ్చు. స్కానింగ్‌లో గడ్డ కనిపించగానే అది క్యాన్సర్‌ అని నిర్ధారణకు రాకూడదు. ఇన్ఫెక్షన్లు, వాపు వంటి ఇతర కారణాల వల్ల కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. అనుమానాస్పద మార్పులు గుర్తించినప్పుడు వైద్యులు వ్యక్తి వయసు, వైద్య చరిత్ర, ధూమపాన అలవాట్లు, స్కానింగ్‌ ఫలితాలు వంటి అంశాలను పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి మరిన్ని పరీక్షలు సూచిస్తారు. కొన్నిసార్లు బయాప్సీ ద్వారా కణజాల నమూనాను సేకరించి పరిశీలిస్తారు. దీని ద్వారా కణాల స్వభావం, క్యాన్సర్‌ ఉందా లేదా అనే విషయాలను నిర్ధారిస్తారు.

​చికిత్స ఎలా ఉంటుంది?

శూన్య దశలో ఉన్న కొన్ని క్యాన్సర్లకు శస్త్రచికిత్సతోనే చికిత్స పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఊపిరితిత్తుల్లో ‘అడెనోకార్సినోమా ఇన్‌ సిటు’ ఉన్న కొందరికి ప్రభావితమైన భాగాన్ని తొలగించే శస్త్రచికిత్సను వైద్యులు సూచిస్తారు. వ్యాధి స్వభావం, పరిమాణం, గడ్డ ఉన్న ప్రదేశం, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంత మేరకు శస్త్రచికిత్స చేయాలనే నిర్ణయం వైద్యులు తీసుకుంటారు. ప్రారంభ దశలో ఉన్న ప్రతి క్యాన్సర్‌కూ కీమోథెరపీ లేదా రేడియేషన్‌ అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సతోనే వ్యాధిని నివారించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో వైద్య పర్యవేక్షణ, తదుపరి పరీక్షలు అవసరమవుతాయి. అయితే, క్యాన్సర్‌ రకం, కణజాల పరీక్షల ఫలితాలను బట్టి చికిత్స మారుతుంది.

​ముందస్తు గుర్తింపు ఎందుకు ముఖ్యం?

క్యాన్సర్‌ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదనే మాట తరచూ వింటుంటారు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. వ్యాధి ఇతర కణజాలాలకు లేదా అవయవాలకు వ్యాపించినప్పుడు చికిత్స మరింత కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అయితే, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన పరీక్షలు అవసరం ఉండవు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ముఖ్యంగా వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. వయసు, ధూమపాన చరిత్ర వంటి అంశాల ఆధారంగా వైద్యులు తగిన పరీక్షలను సూచిస్తారు.

​క్యాన్సర్‌ ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేసినప్పటికీ, వైద్యుల సూచనలను పాటించాలి. నిర్ణీత సమయాల్లో పరీక్షలు చేయించుకోవాలి. కొత్త లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక దగ్గు, దగ్గులో రక్తం పడటం, కారణం తెలియకుండా బరువు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇతర అనారోగ్యాల వల్ల కూడా ఇవి కనిపించవచ్చు. అయితే దీర్ఘకాలం ఇలాంటి లక్షణాలు కొనసాగితే మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవాలి. షర్మిలా ఠాగూర్‌ అనుభవం క్యాన్సర్‌ నిర్ధారణలో వ్యాధి దశ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది. వ్యాధిని ముందుగానే గుర్తించడం వల్ల ప్రతిసారీ పూర్తి నివారణ చేయవచ్చని స్పష్టంగా చెప్పలేం. కానీ సరైన చికిత్సకు అది మార్గం సుగమం చేస్తుందని చెప్పవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్