నేటి కాలంలో చాలామంది పని ఒత్తిడి వల్ల సరిగా నిద్రపోలేక పోతున్నారు. దీనివల్ల అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుందని చెబుతున్నారు. అలాగే పడుకునే ముందు ఐదు అలవాట్లు పాటిస్తే ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.
సమయానికి నిద్రపోవాలి : ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకొని, ఉదయం కూడా ఒకే సమయానికి నిద్రలేవాలి. ఇలా చేస్తే శరీరంలోని జీవగడియారం క్రమబద్ధంగా పనిచేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత తగ్గి, ఒత్తిడిని నియంత్రించుకోవడం సులభమవుతుంది.
సరైన నిద్ర : ఎన్ని గంటలు నిద్రపోయామన్నది కాదు.. ఎంత ప్రశాంతంగా నిద్రపోయామన్నదే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. గంటలు లెక్కపెట్టడం కంటే మధ్యలో మెలకువలు లేకుండా సంతృప్తికరంగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. రాత్రిపూట తరచూ మేల్కొనడం లేదా మధ్య మధ్యలో కునుకు తీసి మళ్లీ లేవడం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి గుండె ఆరోగ్యాన్నీ దెబ్బతీయొచ్చు.
స్క్రీన్ వినియోగం తగ్గించాలి : పడుకునే ముందు ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలి. వాటి నుంచి వచ్చే కాంతి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర ఆలస్యమవడం లేదా నాణ్యత తగ్గడం జరుగుతుంది.
ఆల్కహాల్, కాఫీ వద్దు : నిద్రకు ముందు ఆల్కహాల్, కాఫీ వంటి పానీయాలు తీసుకోకూడదు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకుండా, వీలైనంత ముందుగానే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల అరుగుదల మెరుగుపడి, నిద్రకు అంతరాయం ఉండదు.
నిద్ర ఎలా ఉంది? : గురక పెడుతున్నారా? నిద్రలో శ్వాస సరిగా తీసుకుంటున్నారా? ఊపిరి ఆడక మెలకువ వస్తోందా? వంటి అంశాలను గమనించాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. నిద్రించే గది ప్రశాంతంగా, అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే మంచి నిద్రపడుతుంది. దీంతో అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.








కామెంట్‌లు (0)