- కృత్రిమ మేథపై చర్చలకు నిర్ణయం
బీజింగ్ : 3000కోట్ల డాలర్ల మేరకు పరస్పరం టారిఫ్‌లు తగ్గించుకునే ఏర్పాటుకు అమెరికాతో అంగీకారం కుదిరిందని చైనా శనివారం తెలిపింది. అలాగే కృత్రిమ మేథ (ఎఐ)పై చర్చలను ప్రారంభించేందుకు కూడా అంగీకారం కుదిరింది. ఇటీవల చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించిన సందర్భంగా కుదిరిన ఎనిమిది పాయింట్ల ఏకాభిప్రాయంలో భాగంగా ఈ నిర్ణయాలు జరిగాయి. వాణిజ్య మండలి (ట్రేడ్ కౌన్సిల్)ను ఏర్పాటు చేసేందుకు, కౌలాలంపూర్‌లో ఇంతకుముందు జరిగిన చర్చల ఫలితాలను విస్తరించేందుకు కూడా ఉభయ పక్షాలు అంగీకరించాయి. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబరు 10తో వాణిజ్య ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో మరో రెండు మాసాలు పొడిగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ పొడిగింపు వల్ల మరింత విస్తృతమైనవాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మరింత సమయం వుంటుందని భావించినట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. మూడు రోజుల పాటు జిన్‌పింగ్, ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో బహిరంగ పురోగతుల కంటే వ్యక్తిగత దౌత్యానికే ప్రాధాన్యతనిచ్చారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా శనివారం వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మకమైన, సుస్థిరమైన సంబంధాలు పరిపుష్టం కావడానికి ఈ చారిత్రక పర్యటన దోహదపడిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తద్వారా సదూర కాలంలో ప్రపంచ శాంతి, అభివృద్ధిలపై ప్రభావం వుంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎఐపై నవంబరులో తదుపరి దఫా చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో సాంకేతిక ముప్పులు, ప్రయోజనాలపై వివరంగా చర్చించడానికి ఉభయపక్షాలు అంగీకరించాయని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.







కామెంట్‌లు (0)