శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో సడలింపులు..

1 గంట క్రితం

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో సడలింపులు
- ఇంటికే వచ్చి పత్రాలు తీసుకోనున్న బిఎల్ఒలు
- ఢిల్లీ, మహారాష్ట్రలో గడువు పొడిగింపు
- ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల స‌మావేశం
- వివాదాల నేప‌థ్యంలో ఇసి భేటీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 12:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​- ఇంటికే వచ్చి పత్రాలు తీసుకోనున్న బిఎల్ఒలు

- ఢిల్లీ, మహారాష్ట్రలో గడువు పొడిగింపు

- ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల స‌మావేశం

- వివాదాల నేప‌థ్యంలో ఇసి భేటీ

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఎన్నికల సంఘం పలు సడలింపులు ప్రకటించింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ‘అన్‌మ్యాప్డ్‌’గా గుర్తించిన, వ్యత్యాసాలు ఉన్నాయని నోటీసులు అందుకున్న ఓటర్లు ఇకపై తప్పనిసరిగా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. సంబంధిత ఓటర్ల ఇళ్లకు బూత్‌ స్థాయి అధికారులు (బిఎల్ఒలు) వెళ్లి అవసరమైన పత్రాలను స్వీకరించి, వాటిని ఈసిఐనెట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అత్య‌వ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో త‌ప్ప వ్య‌క్తిగ‌త విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా సిఇసి వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో శ‌నివారం నాడిక్క‌డ ఎన్నికల సంఘం ప్ర‌ధాన కార్యాల‌యం (నిర్వ‌చ‌న్ స‌ద‌న్‌)లో ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు (ఇసి) సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి స‌మావేశం అయ్యారు. ఎస్ఐఆర్‌పై భిన్నాభిప్రాయాల అంశం తీవ్ర దుమారం రేపిన వేళ‌, ఈ స‌మావేశం కీల‌క ప్రాధాన్యం సంత‌రించుకుంది. స‌మావేశం అనంత‌రం ఇసి డిప్యూటీ డైరెక్టర్‌ పి పవన్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప్రత్యేక శిబిరాల ఏర్పాటు..

రాత్రి ఆశ్రయ కేంద్రాల్లో ఉంటున్నవారు, కార్మికులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, నిరాశ్రయులు తదితరులకు ఎన్నికల ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా తగిన సంఖ్యలో హెల్ప్‌డెస్క్‌లు, ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఇసి ఆదేశించింది. బెంగాల్‌, బీహార్ స‌హా ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ పూర్తయిందని తెలిపింది. సవరణ ప్రక్రియలో పేర్లు గల్లంతైనవారు, యువ ఓటర్లు, తొలిసారి ఓటు హక్కు పొందుతున్నవారు నిరంతర నవీకరణ ప్రక్రియతో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకు సిఇఒలు, డిఇఒలు, ఇఆర్ఒలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఆదేశించింది. అలాగే, ఢిల్లీలో ఓటర్ల నుంచి అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ గడువును అక్టోబర్‌ 30 వరకు పొడిగించింది. వాటి పరిష్కార ప్రక్రియను నవంబర్‌ 30 వరకు కొనసాగించవచ్చని తెలిపింది. మహారాష్ట్రలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్‌ 12 వరకు పొడిగించింది. వాటి పరిష్కారానికి నవంబర్‌ 10 వరకు అవకాశం కల్పించింది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఫారం-6తో జత చేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఇసి పేర్కొంది. ఎస్‌ఐఆర్‌ కాని కాలానికి 1960 నాటి రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్టర్స్‌ రూల్స్‌ ప్రకారం వర్తించే ఫారాలను ఉపయోగించనున్నట్లు తెలిపింది.

ఇసిఐనెట్ ప‌నితీరుపై క‌మిటీ

ఇసిఐనెట్‌ పనితీరుపైనా ఎన్నికల సంఘం సమీక్ష చేపట్టనుంది. సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనుంది. ఐఐటి లేదా ఐఐఐటికి చెందిన స్వతంత్ర నిపుణుడిని కూడా ఇందులో చేర్చనుంది. ఇసిఐనెట్‌ సంబంధిత ఎన్నికల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందా? లేదా? అన్న అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీ తన నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పిస్తుంది. ఫీల్డ్‌ అధికారులు తమ చట్టబద్ధ అధికారాలకు అనుగుణంగా ఇసిఐనెట్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని తెలిపింది.

సమావేశాల మినిట్స్‌ తప్పనిసరి

ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియలోనూ మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇక‌పై కమిషన్‌ సమావేశాల అజెండాలను ముందుగానే సభ్యులకు అందించడంతోపాటు, సమావేశాల మినిట్స్‌ను జారీ చేయాలని నిర్ణయించింది. అధికారుల వార్షిక పనితీరు నివేదికలు (ఎపిఎఆర్‌) ప్రతి ఏడాది డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని నిర్ణ‌యించింది. అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల‌ని,కమిషనర్లు అధికారులకు జారీ చేసే ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల‌ని నిర్ణ‌యించింది. అలాగే, కేబినెట్‌ సెక్రటరీకి పంపిన లేఖ ఎన్నికల సంఘం విధానపరమైన నిర్ణయాలకు లేదా ఐటి విభాగానికి సంబంధించినది కాదని ఇసి స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని తెలిపింది.అయితే, గోవాలో ఓటర్ల జాబితాలో చోటు దక్కని వారిని గుర్తించి వారి నుంచి ఫారాలు స్వీకరించేందుకు బిఎల్ఒలు ఇంటింటికీ వెళ్లాలని సిఇఒ ఆదేశించారు. మొత్తం 97 మంది మినహాయించబడిన ఓటర్లలో ఇప్పటికే 81 మంది ఫారం-6 ద్వారా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్