- లేఅవుట్లు, భవన నిర్మాణ ప్రణాళికలకు అనుమతులకు అధికారాలు
- కొత్త భూముల గుర్తింపునకూ కసరత్తు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : భారత్ ఔద్యోగిక వికాస్ యోజన (భవ్య) రెండో విడత కింద రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 11 పారిశ్రామిక పార్కులకు లేఅవుట్లు, భవన నిర్మాణ ప్రణాళికలకు అనుమతులు మంజూరు చేసే అధికారాలను ఎపిఐఐసికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్కులను సుమారు 6,244.38 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పార్కుకు కావాల్సిన భూమిని ఇప్పటికే గుర్తించగా మరికొంత భూమిని కూడా సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎపిఐఐసి ప్రతిపాదించిన రెండో రౌండ్ భవ్య పార్కులు శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు, కడప, సత్యసాయి, తిరుపతి, అన్నపయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి.ఇప్పటికే సేకరించిన భూములు కాకుండా సత్యసాయి జిల్లాలోని తిమ్మసముద్రం, కాకినాడ జిల్లాలోని గోల్ సాల్ట్ ల్యాండ్స్ తదితర ప్రాంతాల్లో అదనపు భూములను ఎపిఐఐసి గుర్తిస్తోంది. ప్రస్తుతం 500 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూములను సాధ్యమైన చోట్ల 500 లేదా 1,000 ఎకరాలకు పెంచేందుకు కూడా చర్యలు చేపడుతోంది. భూముల ఏకీకరణ పూర్తయ్యే పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగిస్తే అందుబాటులో ఉండే అదనపు సమయం ఆధారంగా మరిన్ని భూములను ప్రతిపాదించే అవకాశం ఉంది.
సింగిల్ విండో విధానంలో అనుమతులు
భవ్య పార్కుల స్థాయిలోనే లేఅవుట్లు, బిల్డింగ్ ప్లాన్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా సింగిల్ విండో విధానంలో చట్టబద్ధమైన క్లియరెన్స్‌లు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం ఆయా ప్రాంతాలకు చెందిన ఏపిఐఐసి జోనల్ మేనేజర్లకు స్థానిక సంస్థలకు ఉన్న అధికారాలను అప్పగించనున్నట్టు పేర్కొంది.
ప్రభుత్వం ఆమోదించిన నిర్ణయం ప్రకారం, ఈ 11 భవ్య పార్కుల్లో లేఅవుట్లు, బిల్డింగ్ ప్లాన్ల ఆమోదానికి ఎపిఐఐసికి ఐలా చట్టం అధికారాలు ఉంటాయని పేర్కొంది. గుర్తించిన భవ్య పార్కులను ఐలాల్లో నోటిఫై చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం ఆదేశించినట్టు వివరించింది. భవ్య పథకం కింద రేర్ ఎర్త్ మినరల్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్-డిఫెన్స్, పెట్రోకెమికల్స్, స్టీల్, ఆటోమొబైల్ కాంపోనెంట్లు, రోబోటిక్స్, కోకో ప్రాసెసింగ్ వంటి విభిన్న రంగాలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో మరో ఏడు పార్కులకు కూడా భూములను కేటాయించాలని నిర్ణయించారు. అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, కడప, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 4,757 ఎకరాలను సమకూర్చనున్నారు.
ఇవే 11 పార్కుల వివరాలు భూమి ప్రాజెక్ట్ ఎకరాలు
• నౌపడ సాల్ట్ ల్యాండ్స్, శ్రీకాకుళం అల్యూమినియం డౌన్ స్ట్రీమ్ పార్క్ 482.28
• పైడిపాల, అనకాపల్లి రేర్ ఎర్త్ మినరల్ ప్రాసెసింగ్ పార్క్ 399.82
• వరపల్లి, తూర్పుగోదావరి కోకో ప్రాసెసింగ్ పార్క్ 202
• అనమడుగు, నెల్లూరు పెట్రోకెమికల్ పార్క్ 906.64
• లోడ్డిపల్లి, కర్నూలు స్టీల్ డౌన్‌స్ట్రీమ్, సోలార్ సెల్ తయారీ పార్క్ 490
• జమ్మలమడుగు, కడప డౌన్‌స్ట్రీమ్ స్టీల్ ఇండస్ట్రియల్ పార్క్ 1,000
• గుడిపల్లి, శ్రీ సత్యసాయి రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పార్క్ 303
• సోమందేపల్లి, శ్రీ సత్యసాయి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం 985.64
• రెడ్డిపల్లి, తిరుపతి సెమీకండక్టర్ తయారీ 495
• తాటిగుంటపల్లి, అన్నమయ్య ఉపాధి ఆధారిత తయారీ పార్క్ 480
• కోసలనగరం, చిత్తూరు ఆటోమొబైల్ కాంపోనెంట్ తయారీ 500







కామెంట్‌లు (0)