- మూడో వంతు భాగం కరువే
- ప్రకటించిన ప్రభుత్వం
ముంబయి : మహారాష్ట్రలోని 358 తాలుకాల్లో 265 తాలుకాలు కరువు బారిన పడ్డాయని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అంటే దాదాపుగా రాష్ట్రంలో మూడో వంతు భాగం కరువు కాటకాలతో సతమతమవుతోంది. సుదీర్ఘంగా వర్షాభావ పరిస్థితులు కొనసాగడంతో రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా ప్రభుత్వం కరువు బారిన పడిన ప్రాంతాలుగా ప్రకటించడం వల్ల తక్షణమే పంటల నష్టాలను అంచనా వేయడానికి అవకాశం కలుగుతుంది. అలాగే రెవిన్యూ శిస్తులు రద్దు చేయడం, పంటరుణాలను పునర్వ్యవస్థీకరించడం, వ్యవసాయ రుణాల వసూళ్ళపై స్టే వంటి చర్యలతో సహా రైతులకు ఉపశమనం కలిగించేలా పలు చర్యలు చేపట్టడానికి కూడా వెసులుబాటు వుంటుంది. నష్టం మదింపు పూర్తయిన తర్వాత పంటలకు అందించే ఆర్థిక సాయం విడిగా ప్రకటిస్తారు.
వర్షాభావ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పర్యటించిన రెండు రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. త్వరలోనే ప్రభుత్వం కరువు ప్రాంతాల ప్రకటనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. డిక్లరేషన్ వెలువడిన వెంటనే జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగి పంచనామాల ద్వారా పంట నష్టాలను అంచనా వేయాల్సి వుంటుంది. అధికారులు పంటల పరిస్థితుల వివరాలతో, ఫోటోలతో నివేదికలు రూపొందించి వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందచేయాల్సి వుంటుంది.







కామెంట్‌లు (0)