- కేరళం మాజీ ప్రధాన కార్యదర్శి వెల్లడి
- ఒక ఆత్మహత్య కేసులో జ్ఞానేష్ పేరు
- సిపిఎం సీనియర్ నాయకులు థామస్ ఐజాక్ విమర్శ
తిరువనంతపురం: ఎన్నికల సంఘం (ఇసి)లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ, కేరళం మాజీ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. జ్ఞానేష్ కుమార్ ప్రభుత్వ సర్వీసులో ఉన్న సమయంలోనే, అంటే 2016లో, తనను బిజెపి తరఫున ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా ఒప్పించే ప్రయత్నం చేశారని ఆయన ఒక మలయాళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్తున్న విమా నంలో 2016లో ఈ సంభాషణ జరిగిందని, ఆ సమయంలో తాను కేరళం ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నా నని జిజి థామ్సన్ తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.
థామ్సన్ ఏమన్నారంటే?
జిజి థామ్సన్ 1980 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. కేరళం కేడర్‌కు చెందిన ఈయన, ఊమెన్ చాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2015-16లో కేరళం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ మధ్య మంచి స్నేహం ఉండేదని, పదవీ విరమణ తర్వాత తన ప్రణాళిక ఏమిటని జ్ఞానేష్ కుమార్ అడిగినప్పుడు, తనకు పెద్దగా ప్రణాళికలేమీ లేవని చెప్పానని జిజి థామ్సన్ వివరించారు. అప్పుడు 2019 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి, ఎంపిగా, ఆపై కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకోవడమే ఉత్తమ మార్గమని జ్ఞానేష్ కుమార్ సూచించారని ఆయన తెలిపారు. జ్ఞానేష్ కుమార్ చాలా ఒప్పించే విధంగా మాట్లాడారని, అయితే తాను వెంటనే ఆ ప్రతిపాదనను తిరస్కరించానని జిజి థామ్సన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి కేరళంలో పెరుగుతున్న ఆదరణపై జ్ఞానేష్ కుమార్ బహిరంగంగా, గట్టిగా మద్దతు వ్యక్తం చేసేవారని కూడా ఆయన పేర్కొన్నారు. తాను బిజెపి టికెట్‌ను తిరస్కరించిన తర్వాత కూడా, రాజకీయాల్లోకి రావాలని జ్ఞానేష్ కుమార్ తనను ఒప్పించే ప్రయత్నం చేశారని జిజి థామ్సన్ వెల్లడించారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నిర్వహించిన పరిశోధనాత్మక కథనం నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ తీవ్ర రాజకీయ విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వెల్లడి వెలుగులోకి వచ్చింది. శుక్రవారం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విపక్ష పార్టీలు, యువజన సంఘాలు జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు నిర్వహించాయి. అయితే, జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్‌కు చెందిన కేరళం కేడర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 19న రాజీవ్ కుమార్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఆత్మహత్య లేఖలో నిందితుడిగా జ్ఞానేష్ కుమార్ పేరు
ఈ వివాదాలతో పాటు, దాదాపు రెండు దశాబ్దాల క్రితం కేరళంలో చోటుచేసుకున్న ఒక ఆత్మహత్య కేసు కూడా తాజాగా చర్చనీయాంశమైంది. మలేషియా ప్రాజెక్ట్ అధికారి ఆత్మహత్య లేఖలో జ్ఞానేష్ కుమార్ పేరు ప్రస్తావన కలకలం రేపుతోంది. కేరళంలో ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యూడి) కార్యదర్శిగా ఆయన పనిచేసిన కాలంలో జరిగిన ఈ ఉదంతాన్ని సిపిఎం సీనియర్ నేత టిఎం థామస్ ఐజాక్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా గుర్తు చేశారు.
అసలేం జరిగిందంటే?
2006-11 మధ్య కాలంలో కేరళం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఐజాక్, అప్పటి పిడబ్ల్యూడి కార్యదర్శిగా ఉన్న జ్ఞానేష్ కుమార్ పేరు, మలేషియా అధికారి లీ బీన్ సీన్ ఆత్మహత్య లేఖలో ఉందని గుర్తుచేసుకున్నారు. కేరళంలో ఒక రహదారి ప్రాజెక్టు కోసం మలేషియా సంస్థ ‘పాటి’, భగీరథ కన్‌స్ట్రక్షన్స్ కలిసి ఏర్పాటు చేసిన ‘పాటి-బెల్’ జాయింట్ వెంచర్‌కు కేరళ కార్యకలాపాల బాధ్యుడిగా లీ వ్యవహరించారు. రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లిన అనంతరం, 2006 నవంబర్‌లో కౌలాలంపూర్‌లో లీ ఆత్మహత్య చేసుకున్నారు. ఐజాక్ తెలిపిన వివరాల ప్రకారం, పిడబ్ల్యూడి అధికారుల వేధింపులు, అవినీతి, అవకతవకల గురించి లీ తన ఆత్మహత్య లేఖలో వివరించారని, అందులో జ్ఞానేష్ కుమార్ పేరు ప్రముఖంగా ప్రస్తావించారని తెలిపారు. అధికారులు లంచాలు డిమాండ్ చేశారని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టగా, 2006 ముగియకముందే జ్ఞానేష్ కుమార్‌ను పిడబ్ల్యూడి నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర రక్షణ శాఖకు వెళ్లారు. అక్కడి పదవీకాలమే బిజెపి ప్రభుత్వ దృష్టిలో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఐజాక్ అభిప్రాయపడ్డారు. మొదట రూ. 216 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు, పూర్తి కావడానికి కనీసం రూ. 330 కోట్లు అవసరమయ్యాయని ఐజాక్ పేర్కొన్నారు. చెల్లింపుల్లో జాప్యం, కాంట్రాక్టర్‌ను వేధించడం వంటి అంశాలను లీ ఆత్మహత్యతో ఆయన ముడిపెడుతూ, ప్రభుత్వ అధికారుల వ్యవహారశైలి వల్లే ఆయన మరణించారన్నారు. భూసేకరణలో ఎదురైన సమస్యల వల్లే ప్రధానంగా ప్రాజెక్టు ఆలస్యమైందని, జాప్యానికి బాధ్యత ఎవరిదన్న విషయమై కాంట్రాక్టర్, పిడబ్ల్యూడి పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయని ఐజాక్ తెలిపారు.
‘‘శాఖ నిర్లక్ష్యం మొత్తం నిందను కేరళం ప్రభుత్వంపైనే మోపింది. పాత ఫైళ్లను సాధారణంగా నాశనం చేస్తారు కాబట్టి, ఆ విచారణకు సంబంధించిన రికార్డులు విజిలెన్స్ శాఖ వద్ద ఇప్పటికీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇది 20 ఏళ్ల క్రితం జరిగింది. బహుశా ఆ మలేషియా సంస్థ కూడా ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదేమో,’’ అని ఐజాక్ మీడియాతో అన్నారు.
ఆ మరణం తర్వాత రాష్ట్ర విజిలెన్స్ శాఖ దర్యాప్తు చేపట్టినప్పటికీ, న్యాయపరిధి సమస్యలు, అధికారుల ఆసక్తి లోపం కారణంగా అది ఎటూ తేలలేదు. ఆ సమయంలో ఈ వివాదం కేరళం మౌలిక సదుపాయాల రంగాన్ని కుదిపేసింది. అవకతవకల ఆరోపణలు, కాంట్రాక్టర్‌కు చెల్లింపుల విషయంలో లీ ఆత్మహత్య పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది.







కామెంట్‌లు (0)