మిసిసిపీ: అమెరికాలోని మిసిసిపీ తీరంలో మంగళవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాదానికి గురైన 'సెస్నా 210' (Cessna 210) విమానంలోని వారందరూ మరణించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ అధికారులు ధ్రువీకరించారు.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'ఫ్లైట్ అవేర్' సమాచారం ప్రకారం.. ఈ విమానం న్యూ ఓర్లీన్స్ నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయర్స్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో మిసిసిపీలోని పాస్కగౌలా, హార్న్ ఐలాండ్ మధ్య గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో నలుగురు పెద్దలతో పాటు 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఉన్నట్లు కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి జువాన్ రోస్ వెల్లడించారు.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు సముద్రంలో గంటల తరబడి గాలింపు చర్యలు చేపట్టాయి. తొలుత నీటిపై తేలియాడుతున్న మూడు లైఫ్ జాకెట్లు, ఒక లైఫ్ రాఫ్ట్, విమానం క్యాబిన్ శకలాలను గుర్తించారు. అనంతరం గజ ఈతగాళ్లు సముద్ర గర్భంలో గాలించి ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.







కామెంట్‌లు (0)