వాషింగ్టన్ : అవసరానికి మించి పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం ఉందన్న ఆరోపణలతో చైనా, యూరోపియన్ యూనియన్ (ఇయు) సహా పలు దేశాలపై అమెరికా కొత్తగా సుంకాలు విధించనుంది. అమెరికాకు ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్న 16 దేశాల్లో అవసరానికి మించిన పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం ఉందని విచారణలో తేలినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేయనుందని తెలిపాయి. ఇప్పటికే విధించిన సుంకాలకు అదనంగా మరికొన్ని కొత్త సుంకాలను ప్రతిపాదించే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం వెల్లడించింది. ఈ కొత్త సుంకాలు ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన కొన్ని సుంకాలకు ప్రత్యామ్నాయంగా ఉండనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇప్పటికే అమెరికాలో వినియోగ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల అనంతరం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 62 శాతం మంది సుంకాలను రద్దు చేసే ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కొత్తగా ఎలాంటి సుంకాలు విధిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఈ సుంకాలు ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మెక్సికో, నార్వేల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై తక్షణమే సుంకాలు విధించే అవకాశం లేదని తెలిపాయి. 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద అవసరానికి మించిన పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ఆధారాలున్నాయనే ఆరోపణలతో అమెరికా తన ప్రధాన వాణిజ్య భాగస్వాములపై దర్యాప్తు చేపడుతోంది. ఆయా దేశాలతో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా నిర్ణయించిన గరిష్ఠ సుంకాల పరిమితులను కూడా ఈ విచారణలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇయు, జపాన్, దక్షిణ కొరియా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 15 శాతం, మలేషియా నుంచి వచ్చే వస్తువులపై 19 శాతం సుంకాల పరిమితులు ఉన్నాయి. జనవరి 10తో ముగియనున్న వాణిజ్య విరామాన్ని పొడిగిస్తే.. చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ తన రెండో పదవీకాలంలో విధించే సుంకాలు 20 శాతం పరిమితికి లోబడి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఒప్పందం గడువు ముగిస్తే, చైనాలో అదనపు పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించి విధించే సుంకాల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రకటనపై రాయిటర్స్ అడిగిన ప్రశ్నలకు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం, వైట్‌హౌస్ స్పందించలేదు. ఈ విచారణ పరిధిలో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, వియత్నాం, తైవాన్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, స్విట్జర్లాండ్, నార్వే, సింగపూర్, బంగ్లాదేశ్, కంబోడియాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఉన్నాయి.







కామెంట్‌లు (0)