కిన్షాసా: ఆఫ్రికాలోని కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కుప్పకూలడంతో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు సహా మొత్తం 14 మంది మృతి చెందారు. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరుగు ప్రయాణమైన విమానం కేంజ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. విమానంలో ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని కాంగో సైన్యం వెల్లడించింది.
కాంగో సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో సైనిక ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. ప్రయాణ సమయంలో విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కేంజ్ ప్రాంతంలో కుప్పకూలింది. మృతుల్లో కాంగో మిలటరీ కోర్టు చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారు. వీరితో పాటు మరో 12 మంది ప్రతినిధులు, విమాన సిబ్బంది మృతి చెందినట్లు సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంజె తెలిపారు. విమానం కిక్విట్ నుంచి కిన్షాసాకు బయలుదేరిన సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్థానిక అధికారులు తెలిపారు. విమానం ఎందుకు నియంత్రణ కోల్పోయిందనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)