తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ తరఫున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి దూకిన దానం నాగేందర్‌ను తెలంగాణ హైకోర్టు పదవ షెడ్యూలు కింద అనర్హుడిగా ప్రకటిస్తే, ఆ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించడం, అక్కడ వెంటనే ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం హర్షణీయం. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాచి ప్రత్యర్థి పార్టీలో చేరిపోవడం అనేది ప్రజాస్వామ్యానికి ద్రోహం. చెంపపెట్టు లాంటి తీర్పు అనంతరం కూడా ఆ పెద్ద మనిషి ఎలాంటి వెరపూ లేకుండా ప్రజల తీర్పు కోరుతానని చెప్పడం తగదు. నిజంగానే ప్రజాతీర్పు పట్ల అంత నిబద్ధత వుంటే ఫిరాయించిన వెంటనే పదవికి రాజీనామా చేసి ఎన్నికకు వెళ్లి వుండాల్సింది. కానీ ఇది ఒక్క తెలంగాణకో, ఒక్క ఎమ్మెల్యేకో పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని పార్టీలనే హోల్‌సేల్‌గా కొనేసే ధోరణి కొనసాగుతోంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు గుంపులు గుంపులుగా పార్టీలు మారడం, అధికార పార్టీలు తమ బలం పెంచుకునేందుకు ప్రతిపక్ష శాసనసభ్యులను భారీ మొత్తాలు, పదవుల ఆశ చూపి కొనుగోలు చేయడం షరా మామూలుగా మారింది. ఇటీవల అస్సాం, కేరళం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రూ.529.38 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.248.55 కోట్లు వెచ్చించినట్టు ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కలు వెల్లడించాయి. బెంగాల్‌లో ప్రచార వాహనాలు, మీడియా ప్రకటనలపైనే రూ.వందల కోట్లు కుమ్మరించడం ధనబలం ఎన్నికలను ఎంతగా శాసిస్తున్నదో చెబుతోంది. అంతేకాకుండా, ఎన్నికల తరువాత లోక్‌సభలో ఎన్‌డిఎ బలం పార్లమెంట్‌లో పెరిగిపోయింది. అలాగే, రాజ్యసభలో బిజెపికి కేవలం 83 స్థానాలుంటే అవి 111కు పెరిగిపోయాయి. ఇదంతా ఎలా సాధ్యపడింది? ప్రజాస్వామ్యాన్ని ధనస్వామంగా మలచడంలో ఆరితేరిన నాయకద్వయం వల్లే కదా సాధ్యమైంది. ప్రజలు ఓటు వేసేది ఒక సిద్ధాంతానికి, ఒక పార్టీ ప్రణాళికకు అయితే, ఆ తీర్పును కాలరాచి డబ్బు, అధికార బలంతో శాసనసభలను తారుమారు చేయడం ప్రజాస్వామ్య మూల సూత్రాలకే విరుద్ధం.
ఎన్నికల సంఘం స్వతంత్రత, నిష్పాక్షికత ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటివి. ఆ సంస్థపై నీలినీడలు కమ్ముకుంటే, యావత్ ఎన్నికల ప్రక్రియ మీదే అనుమానాలు తలెత్తుతాయి. కమిషనర్ల నియామక ప్రక్రియను బిజెపికి అనుకూలంగా మార్చడానికి చట్టంలో అప్పటివరకూ నియామక కమిటీలో వున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి కేంద్ర కేబినెట్‌లో ఒక సీనియర్ మంత్రిని చేర్చడంలోనే కుట్ర దాగివుంది. ఇక ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో సాగుతున్న తతంగం మరో ఆందోళనకర అంశం. ఓటర్ల జాబితాలను ‘‘శుద్ధి’’ చేస్తామనే సాకుతో, ఎన్‌డిఎ పక్షాలు తమకు అననుకూలమైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించే ఎత్తుగడలు వేస్తున్నాయి. నిరుపేదలు, వలస కార్మికులు, మైనారిటీలు, అట్టడుగు వర్గాల ఓటర్లే ఎక్కువగా ఈ తతంగంలో జాబితాల నుంచి మాయమవుతున్నారన్న వాదనలు తీవ్రతను సూచిస్తున్నాయి. ఇది సాంకేతిక ప్రక్రియ ముసుగులో సాగుతున్న దొడ్డిదారి విజయ వ్యూహంగా కనిపిస్తోంది. ఇలాంటి ఎస్ఐఆర్ ప్రక్రియలను తక్షణమే నిలిపివేయాలి. బదులుగా, పారదర్శకమైన, అన్ని పార్టీల భాగస్వామ్యంతో కూడిన ఓటర్ల జాబితాల సవరణ విధానాన్ని రూపొందించాలి.
భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెబుతారు. కానీ నేర చరితుల రాజకీయ ప్రవేశం, ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, పాలకవర్గ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం వంటి సవాళ్లు వ్యవస్థను లోలోపల కుళ్లబెడుతున్నాయి. తార్కుండే కమిటీ మొదలుకొని దినేష్ గోస్వామి కమిటీ దాకా అనేక కమిటీలు సూచించిన సంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్నికల ఖర్చుల్లో పారదర్శకత, రాజకీయ విరాళాల వెల్లడి, నేర చరితులపై కఠిన అనర్హత నిబంధనలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వీటన్నింటినీ వెంటనే అమలు చేయాలి.
దానం నాగేందర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక ఆశాకిరణం మాత్రమే. అది సంపూర్ణ పరిష్కారం కాదు. ఫిరాయింపుల మార్కెట్‌ను శాశ్వతంగా మూసివేయాలంటే, ఎన్నికల సంఘాన్ని నిజమైన స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దాలంటే, ఎస్ఐఆర్ వంటి అనుమానాస్పద ఎత్తుగడలకు తెర దించాలంటే. సమూలమైన ఎన్నికల సంస్కరణలు రావాలి. దామాషా ఓటుతో ప్రాతినిధ్యం, పార్టీల ఎన్నికల ఖర్చును ప్రభుత్వం సమకూర్చడం, ఎన్నికల్లో ధన బలం, కండ బలం పని చేయని విధంగా వివిధ అంశాల్లో సంస్కరణలు తీసుకురావాలి. అప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయినా మనగలుగుతుంది.







కామెంట్‌లు (0)