శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొండంత విపత్తు..గోరంత నిధులు...

3 గంటల క్రితం

ndrf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- శాస్ర్తీయత కొరవడిన ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌ కేటాయింపులు

- వైపరీత్యాల ఆంధ్రప్రదేశ్‌‌కు ఐదేళ్లకు 6,533 కోట్లు

- ఆర్థికసంఘం వద్ద సరైన వాదనలు చేయని ఎపి ప్రభుత్వాలు

- కరువు నష్టాలకు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ప్రత్యేక ప్యాకేజి ఇస్తేనే ఆపన్నులకు కాస్తంత ఉపశమనం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : భౌగోళిక పరిస్థితుల రీత్యా ఆంధ్రప్రదేశ్‌ ‌వరుస విపత్తుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. కరువులు, లేదంటే తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు సంభవిస్తుంటాయి. ఒక్కోసారి అతివృష్టి, అనావృష్టి రెండూ ఒకే ఏడాదిలో, ఒకే వ్యవసాయ సీజన్‌‌లో చోటు చేసుకోవడం అనుభవమే. ఇటువంటి హై రిస్క్‌ రాష్ట్రానికి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌) కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి. విభజనతో ఆర్థిక కష్టాలతో సహా అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం అందించాల్సిన స్థాయిలో ఎస్‌డిఆర్‌ఎఫ్‌ కేటాయింపులు లేవు. ఈ పన్నెండేళ్ల కాలం కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉండగా, బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చిన ప్రభుత్వాలే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం తమది ‘డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్‌’ అని ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఎల్‌‌నినో ప్రభావంతో ఎపిలో ఎన్నడూ చూడని తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌ ‌చివరిలో ఇప్పుడు తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఖరీఫ్‌ ‌సాగును ఉద్ధరించేవి కావు. కాస్తో కూస్తో సాగు చేసిన పంటలను ఆసాంతం తుడిచిపెడతాయన్న ఆందోళనలు రైతుల్లో నెలకొన్నాయి. కరువు మండలాలు ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న డిమాండ్‌ ‌ముందుకొస్తోంది. అధిక వర్షాల నష్టాలకూ పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.

విపత్తు బాధితులకు ఉపశమనం కల్పించేందు కు నిధుల కేటాయింపులను పరిశీలిస్తే మరింత ఆందోళన కలుగుతుంది. విపత్తుల సహాయార్ధం కేంద్రం రాష్ట్రాలకు ఐదేళ్లకోమారు ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌ ‌నిధులను కేటాయిస్తుంది. ఆర్థిక సంఘం సిఫారసులకనుగుణంగా ఈ కేటాయింపులు జరుగుతాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం సిఫారసులకనుగుణంగా 2026-27 నుంచి 2030-31 ఐదేళ్లకు సంవత్సరానికి ఇంతని నిధులు కేటాయించింది. ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌లో 75 శాతం కేంద్రం ఇస్తే, రాష్ట్రం 25 శాతం భరించాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ నిష్పత్తి 90ః10 గా ఉంటుంది. ఎపికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనం దున 25 శాతం పెట్టుకోవాలి. ఐదేళ్లకూ కలిపి మన రాష్ట్రానికి రూ.6,533 కోట్లు కేటా యించింది. వీటిలో 75 శాతం అంటే కేంద్రం ఇచ్చేది 4,897.75 కోట్లు కాగా ఎపి 1,633.25 కోట్లు తన వాటాగా భరించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27కు పేర్కొన్నది 1,182 కోట్లు కాగా కేంద్రం వాటా 886.50 కోట్లు, రాష్ట్రానిది 295.50 కోట్లు. ఈ నిధులతో సూపర్‌ ఎల్‌‌నినోను ఖరీఫ్‌, రబీలో ఎదుర్కోవాలి. మరోవైపు వాయు గుండం నష్టాలు సరేసరి. తుపాన్ల కాలం ముందుంది.

రాష్ట్రానికి అన్యాయం

రాష్ట్ర విభజన 2014లో జరగ్గా 14వ ఆర్థిక సంఘం కాలం 2015-20 ఐదేళ్లకూ కేంద్రం ఎపికి ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌ రూ.2,429.50 కోట్లు కేటాయిం చింది. వాటిలో కేంద్రం వాటా 1,822 కోట్లు కాగా రాష్ట్రం వాటా 607.50 కోట్లు. 15వ ఆర్థిక సంఘం కాలం 2021-26 ఐదేళ్లకు 6,300 కోట్లు కేటాయించగా కేంద్రం వాటా 4,,700 కోట్లు, రాష్ట్రం వాటా 1,600 కోట్లు. ప్రస్తుత 16వ ఫైనాన్స్‌ ‌కమిషన్‌ ‌కాలం 2026-31 ఐదేళ్లకూ కేటాయించింది 6,533 కోట్లు కాగా కేంద్రం వాటా 4,897.75 కోట్లు, రాష్ట్రం భరించాల్సింది 1,633.25 కోట్లు. 15వ ఆర్థిక సంఘం కంటే 16వ ఆర్థిక సంఘం పీరియడ్‌‌లో పెరిగింది కేవలం 233 కోట్లు. కేటాయించిన నిధులను ఏ కాంపొనెంట్‌‌కు వినియోగించాలో కేంద్రం నిర్దేశించింది. ప్రతిస్పందన/సహాయం కోసం 40 శాతం,, పునరుద్ధరణ/పునర్నిర్మాణం 30 శాతం, సంసిద్ధత/సామర్థ్యం పెంపునకు10 శాతంగా విభజించింది. తతిమ్మా 20 శాతం ముందస్తు చర్యల నిమిత్తం (స్టేట్‌ ‌డిజాస్టర్‌‌ మిటిగేషన్‌ ‌ఫండ్‌-ఎస్‌‌డిఎంఎఫ్‌)కు కేటాయించారు.

బిజెపి రాష్ట్రాలకు అత్యధికం

ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌ ‌నిధుల కేటాయింపులకు రిస్క్‌ ఇండెక్స్‌, జనాభా, వైశాల్యం, గతంలో నిధుల వ్యయం సామర్ధ్యం... ఈ పరిశీలనాంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పరిశీలనాంశాలలో ఏ విషయంలోనూ ఎపి ఏ ఇతర రాష్ట్రాని కంటే తీసిపోదు. అయినా కేంద్రం బిజెపి రాష్ట్రాలకు అధిక నిదులు కేటాయిస్తోంది. నెపాన్ని ఆర్థిక సంఘంపై నెట్టేస్తోంది. ప్రస్తుత 2026-31 ఐదేళ్లకూ అన్ని రాష్ట్రాలకు రూ.1.63 లక్షల కోట్లు కేటాయించగా అత్యధికంగా మహారాష్ట్రకు 31,597 కోట్లు కేటాయించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌ 16,342 కోట్లు, మధ్యప్రదేశ్‌‌కు 12,477 కోట్లు, రాజస్థాన్‌ 9,825 కోట్లు, గుజరాత్‌ 9,022 కోట్లు, పశ్చిమబెంగాల్‌ 7,326 కోట్లు కేటాయించింది. ఇవన్నీ బిజెపి రాష్ట్రాలే. తమిళనాడు 9,051 కోట్లు, కర్ణాటకకు 6,847 కోట్లు కేటాయించారు. బిజెపియేతర తమిళనాడు, కర్ణాటక సైతం ‘డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్‌’ ఉన్న ఎపి కంటే ఎక్కువ నిధులే సాధించాయి. తీవ్రమైన విపత్తుల అంచనా ఆధారంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌) ద్వారా రాష్ట్రాలకు అదనపు సహాయం అందుతుంది. కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన కమిటీ ఈ సహాయాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడా బిజెపి రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యత లభిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్