ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు...

1 గంట క్రితం

నేడు విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 10:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ నూతన మేయర్‌, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో సోమవారం (23వ తేదీ) ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు అంబేద్కర్‌ కళావేదిక, పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు, ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విజయవాడలోని అంబేద్కర్‌ కళావేదికను కౌన్సిల్‌ హాల్‌గా నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ నూతనంగా ఎన్నికైన మేయర్‌, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ప్రత్యేక ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం సజావుగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఆదివారం జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌ బేగం తదితర అధికారులు అంబేద్కర్‌ కళావేదికను, పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కోర్టుల జంక్షన్‌, ఆర్‌ఐఓ జంక్షన్‌, డీసీపీ బంగ్లా, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, రాఘవయ్య పార్క్‌, పాత రైతు బజార్‌ రోడ్డు, రెడ్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో కటాఫ్‌ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్‌ తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యే వరకు అంబేద్కర్‌ కళావేదికకు వెళ్లే కోర్టుల జంక్షన్‌, పాత రైతు బజార్‌ రోడ్డు, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ ప్రాంతాల్లో సాధారణ ప్రజలు, వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మేయర్‌, కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల వాహనాలను ప్రధాన ద్వారం (గేట్‌-5) వరకు అనుమతించి, సెల్లార్‌లో పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం చేసే సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు గేట్‌ నంబర్‌-2 వద్ద దిగి, అధికారిక పాసులు చూపించి హాల్‌లో కేటాయించిన గ్యాలరీల్లో మాత్రమే కూర్చోవాలని సూచించారు. ఆహ్వానితుల వాహనాలను కళావేదిక వెనుకవైపు ఉన్న ఓపెన్‌ పార్కింగ్‌ (క్యాంటీన్‌ పార్కింగ్‌) ప్రదేశంలో మాత్రమే నిలపాలని తెలిపారు. మేయర్‌, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే హాల్‌లో ఉన్న కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు బయటకు వెళ్లిపోవాలని పోలీసు కమిషనర్‌ కోరారు. అనంతరం నిబంధనల ప్రకారం సభ్యుల సమక్షంలోనే డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం జరిగే సమయంలో అంబేద్కర్‌ కళావేదిక, పరిసర ప్రాంతాల్లోకి సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. నగర ప్రజలు, వాహనదారులు ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్