ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దక్షిణ కొరియా విద్యాశాఖ మంత్రి రాజీనామా

20 నిమిషాల క్రితం

South Korea .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 01:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సియోల్‌ : దక్షిణ కొరియాలో కీలకమైన కళాశాల ప్రవేశ పరీక్షకు ముందు ఏఐ సాయంతో మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ మంత్రి చోయ్ క్యో-జిన్ ఆదివారం రాజీనామా చేశారు. పరీక్షల నిర్వహణలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యామన్న విమర్శలకు బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ ఆయన రాజీనామాను ఆమోదించినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.


‘సునెంగ్‌’గా పిలిచే దక్షిణ కొరియా జాతీయ కళాశాల ప్రవేశ పరీక్షకు నాలుగు రోజుల ముందు, జాతీయ ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ఓ విద్యార్థి చిన్న కెమెరా, స్మార్ట్‌ఫోన్‌ సాయంతో పూర్తి మార్కులు పొందినట్లు అంగీకరించాడు. ఈ ఘటనతో పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు పలు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో పబ్లిక్ వైఫైని నిలిపివేయడంతో పాటు దుస్తుల బటన్లపై స్టిక్కర్లు అతికించి తనిఖీలు నిర్వహించారు. అయితే, పరీక్షకు మూడు రోజుల ముందు మోసాలను అరికట్టడంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. పార్లమెంటరీ విచారణలో పరీక్ష రోజు అక్రమాలకు పాల్పడే వారిని పట్టుకోగలరా అని ప్రశ్నించగా, తన వయసు దృష్ట్యా నమ్మకంగా చెప్పలేనని ఆయన సమాధానమిచ్చారు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పరీక్షకు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశాలకు మంత్రి హాజరుకాకుండా, ఆయన స్థానంలో ఉప మంత్రి నివారణ చర్యలను ప్రకటించారు.


తొమ్మిది గంటల పాటు జరిగే సునెంగ్ పరీక్ష దక్షిణ కొరియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం, అధిక వేతన ఉద్యోగాలు, మెరుగైన వివాహ అవకాశాలకు ఈ పరీక్ష కీలకంగా భావిస్తారు. గురువారం జరిగిన పరీక్షలో ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన 111 అక్రమ ఘటనలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో సుమారు సగం, పరీక్ష రాసేవారు అప్పగించని స్మార్ట్‌ఫోన్లను గుర్తించేందుకు ప్రభుత్వం పంపిన మూడు అత్యవసర హెచ్చరికల ద్వారా వెలుగులోకి వచ్చాయి. పరీక్ష ఎలాంటి పెద్ద ఘటనలు లేకుండా ముగిసినప్పటికీ, ముందస్తు సన్నద్ధతలో లోపాలపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోలేనని మంత్రి చోయ్ క్యో-జిన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. పరీక్ష ముగిసిన నేపథ్యంలో పూర్తి బాధ్యత తీసుకుంటూ రాజీనామా సమర్పిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్