ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం

11 నిమిషాల క్రితం

train
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 10:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నలుగురు మృతి, 88 మందికి గాయాలు

కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని కైరోకు దక్షిణంగా గిజా ప్రాంతంలో ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలు బోగీలు పట్టాలు తప్పడంతో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 88 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వివరాలను ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈజిప్టు రైల్వే అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. గిజా నుంచి ఫయూమ్‌కు వెళ్తున్న రైలు, కైరో నుంచి దక్షిణాన ఉన్న అస్వాన్ నగరానికి వెళ్తున్న మరో రైలు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు మృతి చెందగా, 88 మంది గాయాలతో గిజా ప్రాంతంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత ప్రభుత్వ మీడియా 120 మంది గాయపడినట్లు ప్రకటించినప్పటికీ, అనంతరం ఆరోగ్య శాఖ అధికారికంగా 88 మంది గాయపడినట్లు వెల్లడించింది.

ఈ ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలను గుర్తించేందుకు తక్షణ దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన గిజాలోని అల్-అయ్యత్ ప్రాంతంలో అధికారులు విచారణ ప్రారంభించారు. ఈజిప్టు రైల్వే వ్యవస్థలో ప్రమాదాలు కొత్తేమీ కాదు. 2002లో కైరోకు దక్షిణంగా ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగడంతో 370 మందికి పైగా మరణించారు. 2009లోనూ ఇదే ప్రాంతంలో జరిగిన పలు రైలు ప్రమాదాల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

సుమారు 11 కోట్ల జనాభా ఉన్న ఈజిప్టులో ప్రజా రవాణాకు రైలు వ్యవస్థ అత్యంత కీలకం. ఆఫ్రికాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన ఈ వ్యవస్థ తరచూ ప్రమాదాలకు గురవుతోంది. గత దశాబ్ద కాలంగా కొత్త రహదారులు, హైస్పీడ్ రైలు మార్గాలు సహా రవాణా మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు ప్రభుత్వం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ పాతబడిన రైల్వే నెట్‌వర్క్‌లోని అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. తాజా ప్రమాదం నేపథ్యంలో రైల్వే భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్