మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుఎఇలో ప్రారంభంకానున్న రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు

44 నిమిషాల క్రితం

Ukraine-Russia peace deal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 03:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అబుదాబి : అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా, ఉక్రెయిల మధ్య శాంతి చర్చలు మంగళవారం యుఎఇలో ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది పలు మార్లు జరిగిన చర్చల తర్వాత, మరోసారి శాంతి కోసం చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. అబుదాబిలో జరగనున్న రెండు రోజుల సమావేశం భద్రతా హామీలపై దృష్టి సారించనుంది. యూరోపియన్‌ భద్రతా వాతావరణంలో తాను , తన తోటి రాయబారి స్టీవ్‌ విట్కాలతో కలిసి ఉక్రెయిన్‌లో సార్వభౌమ, సురక్ష‍ిత, సంపన్న పరిస్థితులను సృష్టించి, శాశ్వత శాంతిని అందించగల ఒక పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అమెరికా అధ్యక్ష‍ుడు ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్కర్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. మొట్టమొదట ఈ ఏడాది ఫిబ్రవరిలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.


రష్యా, ఉక్రెయిన్‌ల డిమాండ్లు

సుమారు ఐదేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందంలోని కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.

డొనెట్క్స్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌ నాలుగు ప్రాంతాల నుండి ఉక్రెయిన్‌ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యా అధ్యక్ష‍ుడు పుతిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఉక్రెయిన్‌ నాటోలో చేరాలనే యత్నాన్ని విరమించుకోవాలని, సైన్యం పరిమితులను అంగీకరించాలని, అలాగే ఉక్రెయిన్‌ రష్యన్‌ భాష, మాస్కో అనుబంధ అర్థోడాక్స్‌ చర్చిపై ఉన్న ఆంక్ష‍లను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాను విధించిన షరతుల మేరకే సమగ్రమైన శాంతి ఒప్పందం కుదరాలని పుతిన్ పట్టుబడుతున్నారు. కేవలం కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అలా చేస్తే ఉక్రెయిన్ సైనికులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, తమ ఆయుధ నిల్వలను తిరిగి సమకూర్చుకునేందుకు అవకాశం కలుగుతుందని వాదిస్తున్నారు. శాంతి ఒప్పందానికి సంబంధించి రష్యా షరతులను ఉక్రెయిన్‌ అంగీకరించకపోతే, సైన్యం ద్వారానైనా తమ లక్ష్యాలను సాధిస్తామని పుతిన్ హెచ్చరించారు.

అయితే ఉక్రెయిన్ భూభాగాలను స్వచ్ఛందంగా అప్పగించాలన్న పుతిన్ డిమాండ్‌ను అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరిస్తున్నారు. ఉక్రెయిన్ సైనిక సామర్థ్యంపై పరిమితులు విధించడంతో పాటు, పాశ్చాత్య దేశాలతో ఆ దేశం కొనసాగిస్తున్న రక్షణపరమైన సహకారానికి అడ్డంకులు సృష్టించడాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో రష్యా మరోసారి దాడికి దిగకుండా నిరోధించేందుకు ఈ రక్షణపరమైన హామీలు ఎంతో అవసరమని ఆయన భావిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్న సమయంలో తక్ష‍ణ కాల్పుల విరమణ అవసరమైన మొదటి అడుగు అని ఉక్రెయిన్‌ వాదిస్తోంది. అలాగే పుతిన్‌, జెలెన్‌స్కీల మధ్య ప్రత్యక్ష‍ సమావేశంతోనే ప్రాదేశిక సమస్యలుపరిష్కారమవుతాయని వాదిస్తోంది.


చర్చల కోసం ఇరు దేశాల ప్రతినిధులు

పుతిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ రష్యా తరపున ప్రతినిధిగా వెళ్లనున్నారు. ఈయన 2022 మార్చిలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉక్రెయిన్‌తో జరిగిన మొదటి ప్రత్యక్ష శాంతి చర్చల నుండి రష్యా బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు ఉప విదేశాంగ మంత్రులు సెర్గీ ర్యాబ్కోవ్, మిఖాయిల్ గలుజిన్, సైనిక నిఘా అధ్యక్ష‍ుడు ఇగోర్ కోస్తియుకోవ్, జనరల్ స్టాఫ్ ఆపరేషనల్ విభాగపు డిప్యూటీ చీఫ్ యూరి జిగార్లోవ్‌స్కీ కూడా ఉన్నారు. ఉక్రెయిన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ విదేశీ నిఘా సేవల విభాగాధిపతి రుస్తెం ఉమెరోవ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో జరిగిన చర్చలలో కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ బృందంలో జెలెన్స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కిరిలో బుడానోవ్, ఆయన డిప్యూటీ సెర్గీ కిస్లిట్స్యా, జెలెన్స్కీకి చెందిన 'సర్వెంట్ ఆఫ్ ది పీపుల్' పార్టీ పార్లమెంటరీ వర్గం నేత డేవిడ్ అరాఖమియా కూడా ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్