ఉక్రెయిన్ : రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా పై ముందెన్నడూ లేని రీతిలో అతి పెద్ద డ్రోన్ దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఈ దాడులు ఏ సమయంలోనైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో రష్యా గగనతలం ప్రస్తుతం పౌర విమానయానానికి ఏమాత్రం సురక్షితం కాదని హెచ్చరించారు. మాస్కోలోని విమానాశ్రయాలు కూడా తమ దాడుల లక్ష్యాల్లో ఉన్నాయని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. పౌరవిమానాలు తమ లక్ష్యం కాదని పేర్కొంటూనే ... ముందుగానే అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేయడానికే ఈ బహిరంగ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు పరిస్థితి తీవ్రతను గుర్తించి రష్యా ప్రాంతంలో విమాన ప్రయాణాలను వెంటనే నిలిపివేయాలని జెలెన్‌స్కీ కోరారు. రష్యా స్వయంగా ప్రారంభించిన యుద్ధం వల్లే నేడు ఆ దేశానికి ఈ దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
జెలెన్‌స్కీ చేసిన ఈ హెచ్చరికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఉక్రెయిన్ వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాదుల చర్యలను తలపిస్తోందని అన్నారు. అంతర్జాతీయంగా తమపై ఎలాంటి ఒత్తిడి వచ్చినా, ఉగ్రవాద తరహా చర్యలకు పాల్పడుతున్నవారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల వేళ ... మంగళవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన విధ్వంసకర దాడుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు ఈ యుద్ధంలో మృతి చెందినట్లు వెలువడిన వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.







కామెంట్‌లు (0)