బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిస్ని ల్యాండ్ ను పేదలకు రెండు సెంట్లు చొప్పున పంచాలి

1 గంట క్రితం

chbr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 01:03 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- సిపిఎం బృందం డిమాండ్

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : డిస్ని ల్యాండ్ ను పేదలకు రెండు సెంట్లు చొప్పున పంపిణి చెయ్యాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని డిస్ని ల్యాండ్ ను బుధవారం సిపిఎం నాయకుల బృందం పరిలించింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ''ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి అయ్యింది. మాట ఇచ్చిన విధంగా విజయవాడలో గానీ, రాష్ట్రంలో గానీ పేదలకి రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ​ఖాళీ స్థలాలు లేవని ప్రభుత్వం చెప్తోంది. ఇది పచ్చి అబద్ధం. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోనే 57 ఎకరాల డిస్నీల్యాండ్ స్థలం పడావుగా పడి ఉంది. ఇది అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ప్రజా ఆరోగ్యానికి ఆటంకం కలిగేటువంటి అనారోగ్యకర పరిస్థితులు ఇక్కడ ఏర్పడి ఉన్నాయి.​ ఇది ఇళ్ల స్థలాలుగా ఇస్తే, 100 గజాల చొప్పున సుమారుగా 2,000 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు. అయినా ప్రభుత్వానికి కళ్లు మూసుకుని కూర్చుంది. పైపెచ్చు డిస్నీల్యాండ్ ని పర్యాటక రంగం పేరుతో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి, కాసులు దండుకుందామని కూటమి నేతలు కుట్ర పన్నుతా ఉన్నారు. ఇప్పటికే ​ భవానీ ఐలాండ్ ను నడపలేమని చేతులెత్తేసి, లీజు పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు. పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లులు కంపెనీకి కట్టబెట్టేశారు. కాలువ గట్ల మీద ఉన్న స్థలాలు మార్కెట్ల పేరుతో బేరమాడుకుని మరి కొంతమందికి కట్టబెట్టేస్తా ఉన్నారు. ​అంటే దీన్ని కూడా పేదలకు ఇవ్వకుండా టూరిజం పేరుతో బడా కంపెనీలకు కట్టబెట్టడానికి మరి వాళ్ళు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి ఇక్కడ నిజంగా టూరిజం ఏర్పాటు చేయాలంటే విజయవాడలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నగరానికి వెలుపల చాలా స్థలాలు ఉన్నాయి. వాటిని వారికి కేటాయించి టూరిజాన్ని అభివృద్ధి చెయ్యొచ్చు. నగరం నుండి పేదవాళ్ళని బయటికి దూరంగా తరిమేస్తారా? నగరంలో ఉన్న విలువైన స్థలాల్ని బడా కంపెనీలకి కట్టబెడతారా? ​ఇదొక్కటే కాదు, అజిత్ సింగ్ నగర్లోనే డిస్నీల్యాండ్ 57 ఎకరాలే కాదు... రైల్వే వాళ్లకి గత 25 సంవత్సరాల క్రితం ఇచ్చిన 20 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. అది కూడా వర్షం వస్తే నీళ్లు ఉండిపోయి దోమలకి కేంద్రంగా మారుతా ఉంది. చెత్త ఫ్యాక్టరీ పేరుతో ఏర్పాటు చేసిన ఇంకొక పాతిక ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో 100 ఎకరాలు భూములు ఉన్నాయి.

​జనం ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇంకొక 1,000 ఇళ్లు కట్టి ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇళ్లు ఇవ్వరు, ఖాళీ స్థలాలు పేదలకి ఇవ్వరు. ఏమంటే మాకు స్థలాలు దొరకలేదని కుంటిసాకులు చెప్తా ఉన్నారు.

​మరి గతంలో కూడా నగరానికి వెలుపల దూరంగా 25 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. అమరావతిలో ఇళ్లు రద్దు చేశాం అన్నారు. ఇక్కడ స్థలాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయం ఇవ్వండి. అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్లు తెరవాలి, ఈ భూములు ఇవ్వాలి, ఖాళీగా ఉన్న ఇళ్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రభుత్వం మీద కార్పొరేషన్ ఎన్నికలు మరి రేపో మాపో జరగబోతున్నాయి అంటున్నారు... ఎన్నికలకు ముందే దీన్ని లేఅవుట్లుగా వేసి, విడగొట్టి పేదవాళ్లకి దీనికి అప్పజెప్పాల్సిన బాధ్యత ఉంది.

​లేకపోతే ఇక్కడ జండాలు ప్రజలే పాతుతారు, పేదవాళ్లే ఇళ్ల స్థలాలు మీరు ఇస్తారా? మమ్మల్ని స్వాధీనం చేసుకోమంటారా? తేల్చాల్సిన అవసరం ఉంది. ఆందోళన చేశాం, కలెక్టర్ కార్యాలయం దగ్గర వినతిపత్రాలు ఇచ్చాం. ఎమ్మెల్యే గారి ఆఫీస్ కూతవేటు దూరంలో ఉంది. ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో కబ్జా చేద్దామని అధికార పార్టీ నేతలు చూస్తున్నారు తప్ప, పేదవాళ్లకి ఎక్కడ ఇళ్లు స్థలాలు ఉన్నాయి, ఇద్దామనేటువంటి చిత్తశుద్ధి మాత్రం కనపడట్లా. ​రాష్ట్రంలో ఇప్పటికే లక్షల ఎకరాల భూముల్ని బడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టారు. కొనాల్సిన అవసరం కూడా లేకుండా కళ్లముందు కనపడతా ఉన్నాయి ఇవన్నీ, డబ్బులు లేదనడానికి. ప్రభుత్వ భూములు, కార్పొరేషన్ భూములు ఇవన్నీ కూడా... ముందు వీటికి ఇవ్వండి. ఇవి చాలకపోతే మిగతా భూములు సేకరించండి. ​అందుకే దీనిమీద సిపిఎం ఈ రాబోయే 10 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే, తప్పనిసరిగా మరో భూ పోరాటాన్ని ప్రారంభిస్తాం. ఇది ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి వీల్లేదు, పేదలకి ఇళ్ల స్థలాలకి ఇవ్వాలనే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ప్రజలు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నిలదీయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం'' అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్