ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్యూబాపై అమెరికా ఒత్తిడిని ఖండించిన అధ్యక్షుడు డియాజ్-కానెల్

1 గంట క్రితం

Miguel Díaz-Canel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 03:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హవానా : అమెరికా తమపై అమలు చేస్తున్న "గరిష్ఠ ఒత్తిడి" (మ్యాక్సిమమ్ ప్రెషర్) విధానాన్ని క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ తీవ్రంగా ఖండించారు. ఇది క్యూబా ప్రజలపై ఉద్దేశపూర్వకంగా అమలు చేస్తున్న "క్రూరమైన సామూహిక శిక్ష" అని ఆయన విమర్శించారు. జూలై 26 జాతీయ స్మారక దినోత్సవానికి ముందు శనివారం విదేశీ సంఘీభావ ప్రతినిధులతో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గత ఏడు నెలలుగా క్యూబాలో సామాజిక అశాంతిని రెచ్చగొట్టే లక్ష్యంతో అమెరికా "గరిష్ఠ ఒత్తిడి" విధానాన్ని అమలు చేస్తూ, ప్రజలపై సామూహిక శిక్ష విధిస్తుందని ఆరోపించారు. ఇటీవల అమెరికా విధించిన చమురు దిగ్బంధనం కూడా దురుద్దేశపూర్వకమేనని ఆయన మండిపడ్డారు. ఆర్థికంగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి, ప్రజల్లో అసంతృప్తి, సామాజిక అశాంతిని రేకెత్తించడమే ఈ చర్యల ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సామూహిక శిక్షతో సమానమని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవి నేరంగా పరిగణించాల్సిందేనని అన్నారు. క్యూబాకు అంతర్జాతీయ సమాజం సంఘీభావం ప్రకటించాలని డియాజ్-కానెల్ పిలుపునిచ్చారు. అమెరికా ఇదే తరహా ఒత్తిడి విధానాన్ని ఇతర దేశాలపైనా అమలు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. "ఇలా కొనసాగితే రేపు ఏ దేశమైనా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు" అని అన్నారు. క్యూబాకు మద్దతు ఇవ్వడం అంటే ప్రజల స్వీయ నిర్ణయాధికారం, సార్వభౌమాధికారం, స్వాతంత్ర్య హక్కులను కాపాడటమేనని ఆయన పేర్కొన్నారు. అలాగే, క్యూబా పక్షాన నిలబడటం అంటే ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే అమెరికా పెత్తందారీ ధోరణికి వ్యతిరేకంగా నిలబడటమేనని స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షల ప్రభావంతో నేటి క్యూబా పూర్తిగా భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని డియాజ్-కానెల్ అంగీకరించారు. చమురు దిగ్బంధనం కారణంగా దేశంలో విద్యుత్ కోతలు గణనీయంగా పెరిగాయని, విప్లవానికి ప్రధాన ఆధార స్తంభంగా భావించే జాతీయ ఆరోగ్య వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా క్యూబాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఈ ఆంక్షలు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే పలుమార్లు పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్