బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగాజా స్ర్టిప్‌‌లో ఇజ్రాయిల్ దురాక్రమణ గోడ!

1 గంట క్రితం

flash
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 06:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 23 కిలోమీటర్ల మేర నిర్మాణం..

  • శాశ్వత తిష్టకు కుట్ర

పాలస్తీనా నగరాలను, పట్టణాలను శిథిలాలుగా మార్చిన ఇజ్రాయిల్ తన ఆధీనంలోని భూభాగాలను శాశ్వతంగా ఆక్రమించేందుకు బరితెగించింది. గాజాలోని సగానికి పైగా భూభాగాన్ని ఆక్రమిస్తూ మట్టిగోడ నిర్మిస్తోంది. అసోసియేటెడ్ ప్రెస్‌కు లభించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం... గాజా మొత్తం 40 కిలోమీటర్ల పొడవులో ఇప్పటికే 23 కిలోమీటర్ల మేర ఈ మట్టి కట్ట నిర్మితమైంది. ఇది కేవలం భద్రతా చర్య అని ఇజ్రాయిల్ చెబుతున్నప్పటికీ, దాని గత చరిత్రను బట్టి ఇది గాజా భూభాగంపై దురాక్రమణ చర్య అని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​ఇదీ చరిత్ర!

1947లో ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను యూదు, అరబ్ దేశాలుగా విభజించే ప్రణాళికను ఆమోదించింది. అయితే అరబ్ దేశాలు దానిని తిరస్కరించాయి. 1948లో తొలి అరబ్–ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమైంది. ఏడు లక్షలకుపైగా పాలస్తీనీయులు తమ ఇళ్లు, భూములు కోల్పోయి శరణార్థులయ్యారు. పాలస్తీనీయులు ఈ ఘటనను "నక్బా" (మహా విపత్తు)గా గుర్తుంచుకుంటారు. అప్పటి నుంచి ఆ ఉద్రిక్తత, దురాక్రమణ పర్వం కొనసాగుతూనే ఉంది. వారి వారసులు నేటికీ గాజా, వెస్ట్‌బ్యాంక్, జోర్డాన్, లెబనాన్, సిరియా శరణార్థి శిబిరాల్లోనే జీవిస్తున్నారు. ​1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ గాజా, వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం సహా పలు ప్రాంతాలను ఆక్రమించింది. ఐరాస భద్రతా మండలి 242, 338 తీర్మానాల ద్వారా ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని కోరినా, ఇజ్రాయిల్ లెక్క చేయలేదు. పైగా వెస్ట్‌బ్యాంక్‌లో యూదు స్థావరాలను నిర్మించి తన సైన్యాన్ని మోహరింపజేసింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఐరాస, అంతర్జాతీయ న్యాయస్థానం, అనేక దేశాలు పేర్కొన్నప్పటికీ, ఇజ్రాయిల్ వినలేదు. 2005 తరువాత గాజా గగనతలం, సముద్ర మార్గం, సరిహద్దులను దిగ్బంధించింది. సరుకుల రాకపోకలు, విద్యుత్, ఇంధన సరఫరాపై తన సైన్యం నిఘా, నియంత్రణ కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 2007లో హమాస్ గాజాపై పూర్తి నియంత్రణ సాధించింది. తర్వాత ఇజ్రాయిల్, ఈజిప్టు కలిసి దిగ్బంధనాన్ని మరింత కఠినతరం చేశాయి. ఆహారం, ఇంధనం, నిర్మాణ సామగ్రి, వైద్య పరికరాల సరఫరా ఆ దేశం కనుసన్నల్లోనే జరుగుతోంది. అందుకే మానవ హక్కుల సంస్థలు గాజాను "ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ కారాగారం"గా అభివర్ణించాయి.

​జాతిహననానికి కుట్ర!

2023 అక్టోబర్ 7న హమాస్ దాడులతో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇజ్రాయిల్ అత్యంత నిరంకుశంగా, దుర్మార్గంగా పాలస్తీనా లోని పౌరులపై, పసిపిల్లలపై విరుచుకుపడి నరమేధం సాగించింది.

73 వేల మందికి పైగా పాలస్తీనీయులను పొట్టన పెట్టుకుంది. ఇందులో సగానికి పైగా మహిళలను, పసిపిల్లలను చంపి, భవిష్యత్తు తరాలు లేకుండా చేయాలన్న భయంకర వ్యూహాన్ని అనుసరించింది. రఫా, ఖాన్ యూనిస్, ఉత్తర గాజాలోని అనేక నగరాలను, పట్టణాలను నేలమట్టం చేసింది. ఒకప్పుడు జనసంచారంతో కళకళలాడిన నగరాలు శిథిలాలుగా మారాయి. ఆ నగరాల మీదుగానే ఇప్పుడు 23 కిలోమీటర్ల మట్టి గోడ నిర్మాణాన్ని ఇజ్రాయిల్ కొనసాగిస్తోంది. దీంతో పాటు కొత్త సైనిక రహదారులు, స్థావరాలు కూడా ఏర్పడుతున్నాయని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. అంటే, ఇది నిరాశ్రయులైన ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకునే అవకాశం ఎప్పటికీ లేకుండా చేయడమేనని ఐరాసకు చెందిన పలువురు నిపుణులు, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

– ప్రజాశక్తి ఫీచర్స్ & పాలిటిక్స్​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్