సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డేటా సెంటర్లపై ప్రజాగ్రహం

6 గంటల క్రితం

డేటా సెంటర్లపై ప్రజాగ్రహం
- ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు వ్యతిరేకం
- నీరు, విద్యుత్, శబ్ద కాలుష్యంపై స్థానికుల ఆందోళన
- మధ్యంతర ఎన్నికల్లో కీలకాంశంగా మారిన డేటా సెంటర్లు
- భారత్‌‌కు నిపుణుల హెచ్చరిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 11:20 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు వ్యతిరేకం

- నీరు, విద్యుత్, శబ్ద కాలుష్యంపై స్థానికుల ఆందోళన

- మధ్యంతర ఎన్నికల్లో కీలకాంశంగా మారిన డేటా సెంటర్లు

- భారత్‌‌కు నిపుణుల హెచ్చరిక

వాషింగ్టన్‌ : కృత్రిమ మేధ (ఎఐ) విస్తరణతో అమెరికా అంతటా డేటా సెంటర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే డేటా సెంటర్లు ప్రజా జీవితాలను, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని అమెరికన్లు ఆగ్రహిస్తున్నారు. ఇటీవల హీట్‌మ్యాప్ ప్రో కోసం ఎంబోల్డ్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు ( 70శాతం) తమ ప్రాంతంలో కొత్త డేటా సెంటర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. నీటి కొరత, విద్యుత్, శబ్ద కాలుష్యం, ఆర్థిక ప్రయోజనాలపై వారు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో మూడవ పెద్ద నగరమైన డల్లాస్‌‌లో సుమారు 180 డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 25 నిర్మాణమవుతున్నాయి. డల్లాస్ దక్షిణ భాగంలో గూగుల్, ఫోర్ట్ వర్త్‌లో మెటా భారీ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. అయితే, వీటి కారణంగా నగరంలో తాగు నీరు కొరత ఏర్పడింది. అలాగే, కరెంట్ వినియోగమూ పెరిగిపోయి అధికంగా బిల్లులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా, సాయంత్రం ఇంటి తలుపులు తెరిస్తే భరించలేని శబ్దం వస్తుందని, ఇంట్లో ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేకుండా పోయిందని టెక్సాస్‌ ‌ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎవరు కోరుకోలేదని, ఏకాభిప్రాయం లేకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేస్తున్నారని వాపోతున్నారు.

​ గతంలో డేటా సెంటర్లు ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, సెర్చ్, స్ట్రీమింగ్, ఈ-కామర్స్ అవసరాలకు ఉపయోగపడేవి. ఇప్పుడు ఎఐ పరిస్థితిని మార్చేసింది. క్లాడ్, చాట్ జిపిటి వంటి జనరేటివ్ మోడళ్లను తీర్చిదిద్దడానికి, నడపడానికి భారీ కంప్యూటింగ్ శక్తి అవసరం. దీనికోసం జిపియు, టిపియు వంటి ప్రత్యేక చిప్‌లతో కూడిన భారీ కేంద్రాలు నిర్మిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సేవల సంస్థ కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ ప్రకారం, ప్రపంచ డేటా సెంటర్ మార్కెట్‌లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 1,500కు పైగా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వర్జీనియా రాష్ట్రంలోనే 2026లో 11 గిగావాట్లకు పైగా డేటా సెంటర్ సామర్థ్యం అందుబాటులో ఉంది.

భారత్‌‌లో డేటా సెంటర్ల ముప్పు..

​ భారత్‌లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారత్‌‌లో డేటా సెంటర్ సామర్థ్యం 2020లో సుమారు 375 మెగావాట్ల నుంచి ఇప్పుడు 1,575 మెగావాట్లకు పెరిగింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఇఎ) అంచనా ప్రకారం, 2031-32 నాటికి డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్ దాదాపు 17 గిగావాట్లకు చేరవచ్చు. విశాఖపట్నంలో గూగుల్ ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది. ఇందులో తొలి దశలో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ఉంటుంది. అమెరికా వెలుపల తమ అతిపెద్ద ఎఐ హబ్ ఇదేనని గూగుల్ క్లౌడ్ సిఇఒ థామస్ కురియన్ పేర్కొన్నారు.

​ గుత్తాధిపత్యానికై పోటీ..

మార్కెట్‌‌పై ఆధిపత్యం కోసం హైపర్‌స్కేలర్లు వీటిని నిర్మిస్తున్నారు. హైపర్‌స్కేలర్ అంటే భారీ స్థాయి క్లౌడ్ సేవల సంస్థ. కంప్యూటింగ్, స్టోరేజీ, నెట్‌వర్కింగ్ వనరులను అందిస్తూ, వేలాది కంపెనీలు, కోట్లాది వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు వనరులను పెంచగలదు, తగ్గించగలదు. ఈ మార్కెట్‌ను అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కొన్ని సంస్థలే శాసిస్తున్నాయి. సాధారణ డేటా సెంటర్‌లో వందల, వేల నల్లటి సర్వర్ ర్యాక్‌లు వరుసల్లో అమర్చి ఉంటాయి. ఒక్కో ర్యాక్ దాదాపు రెండు మీటర్ల ఎత్తు ఉంటుందని నిపుణులు తెలిపారు. అలాగే, ఐర్లాండ్‌లో డేటా సెంటర్లు దేశ మీటర్డ్ విద్యుత్ వినియోగంలో గతంలో 5శాతం ఉండగా, 2025లో అది 23శాతానికి పెరిగిపోయింది. పశ్చిమాసియాలో ఎయిర్ కండిషనింగ్, డీశాలినేషన్ వల్ల పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌‌పై అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) ఆందోళన వ్యక్తం చేసింది.

మధ్యంతర ఎన్నికల్లో ప్రభావం చూపిన డేటా సెంటర్లు..

​ ఇటీవలి మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్‌ ‌పార్టీని తీవ్రంగా దెబ్బతీసాయి. ఈ ఎన్నికలను ప్రభావితం చేసిన కీలకాంశాల్లో డేటా సెంటర్ల వ్యవహారం ఒకటి. ప్రజల్లో వెల్లువెత్తుతున్న అసంతృప్తిని డెమోక్రాట్స్ తమకు అనుకూలకంగా మార్చుకుని, కొత్త డేటా సెంటర్ అనుమతులను నిలిపివేయాలంటూ ప్రచారం చేశారు. దీంతో వారు టెక్సాస్, ఒహాయో, జార్జియా వంటి రాష్ట్రాల్లో కీలక స్థానాలు గెలిచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లోనూ డేటా సెంటర్ల ఎజెండానే కీలకం కానుందని, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డేటా సెంటర్లను వేగంగా ప్రారంభిస్తున్న భారత్ ఈ అంశాలను గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్