- ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం
వాషింగ్టన్ : ఇజ్రాయిల్‌కు భారీ ఆయుధాల సరఫరాకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుమారు 2.8 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీలో 40,000 భారీ బాంబులు ఉండనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం ఇంకా తుది దశకు రాలేదని సమాచారం. ఈ ప్యాకేజీలో 20,000 Mk84 బాంబులు, 20,000 BLU-117 బాంబులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత ఆయుధ విక్రయం గురించి అమెరికా కాంగ్రెస్‌కు అనధికారికంగా సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్యాకేజీలో ఎక్కువ భాగానికి అమెరికా విదేశీ సైనిక నిధులు ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. అంటే, అమెరికా పన్ను చెల్లింపుదారుల డాలర్లను ఇజ్రాయిల్‌కు ఇచ్చి, వారు తిరిగి అమెరికా నుండి ఆయుధాలను కొనుగోలు చేసేలా చేయడం.
గాజాలో భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందనే ఆందోళనలతో, ఇలాంటి 2,000 పౌండ్ల బాంబుల సరఫరాలో ఒక భాగాన్ని బైడెన్ ప్రభుత్వం 2024లో నిలిపివేసింది. అయితే, ఇజ్రాయిల్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం వరుసగా కొత్త ఆయుధ ఒప్పందాలను ముందుకు తీసుకువస్తోంది. 2,000 పౌండ్ల బరువున్న ఈ బాంబుల్లో కొన్ని భూగర్భంలోని లక్ష్యాలను ఛేదించేందుకు, మరికొన్ని భూమిపై భారీ పేలుళ్లు, విధ్వంసం కలిగించేందుకు రూపొందించబడ్డాయి. గాజాలో ఇజ్రాయిల్ సైన్యం అమెరికా తయారీ బాంబులను ఉపయోగిస్తోందని దాడుల దృశ్యాలు, పేలుడు శకలాలను పరిశీలించిన నిపుణులు పేర్కొన్నారు.
2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన ఘోరమైన దాడులకు ప్రతిస్పందనగా గాజాలో ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యల్లో భారీ ప్రాణనష్టం, విస్తృత విధ్వంసం జరిగాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కాల్పుల విరమణ తర్వాత మరణించిన వారితో కలిపి 73,264 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
ఈ నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన భారీ ఆయుధ ప్యాకేజీపై గాజాలో మానవతా పరిస్థితులు, పౌరుల భద్రతకు సంబంధించిన ఆందోళనలు కొనసాగుతున్నాయి.






కామెంట్‌లు (0)