మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition80 వేల కేసులు... ఒక లేడీ డిటెక్టివ్!

5 రోజుల క్రితం

RajaniPandit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 06:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

చాలా మంది డిటెక్టివ్ కథలు, నవలలు చదివే ఉంటారు. డిటెక్టివ్ అనగానే పెద్ద కోటు, టోపీ ధరించి ఆధారాల కోసం వెతుకుతూ నేరస్తులను పట్టుకునే వ్యక్తే గుర్తుకొస్తాడు. కానీ నిజ జీవితంలో మహిళా డిటెక్టివ్‌లు చాలా అరుదు. ఆ అరుదైన వృత్తిలోనే నాలుగు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన రజనీ పండిట్. భారతదేశపు తొలి ప్రైవేట్ లేడీ డిటెక్టివ్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పటివరకు 80 వేలకు పైగా కేసులను ఛేదించి కార్పొరేట్ మోసాల నుంచి హత్య కేసుల వరకు ఎన్నో క్లిష్టమైన నేరాల గుట్టు విప్పారు.

​రజనీ పండిట్ థానే జిల్లాలోని పాల్ఘర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. తండ్రి శాంతారామ్ పండిట్ పోలీసు శాఖలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. చిన్నతనం నుంచే రజనీలో కుతూహలం ఎక్కువ. ముంబైలోని రూపరేల్ కళాశాలలో మరాఠీ సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. ఒకరోజు తన స్నేహితురాలు ఇంట్లో వస్తువులు మాయమవుతున్నాయని, దొంగను కనిపెట్టాలని కోరడంతో కుటుంబ సభ్యుల దినచర్యలను ఓపికగా గమనించి ఇంటి దొంగను గుర్తించారు. అదే ఆమె తొలి కేసు. ఆ ఒక్క సంఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది. తరువాత బంధువుల అదృశ్యం, వ్యక్తిగత వివాదాలు వంటి కేసులు ఆమె వద్దకు వరుసగా రావడంతో ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. 1986లో కేవలం 24 ఏళ్ల వయసులో 'రజనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ'ని ప్రారంభించారు. తర్వాత దానికి 'రజనీ పండిట్ డిటెక్టివ్ సర్వీసెస్'గా పేరు మార్చారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వేలాది కేసులను దర్యాప్తు చేశారు. తండ్రికి తొలుత సందేహాలున్నప్పటికీ, తల్లి మాత్రం ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు.

​నేరస్తులను పట్టుకునేందుకు రజనీ ఎలాంటి సాహసానికైనా సిద్ధపడతారు. కేసు వివరాలు తెలుసుకునేందుకు అవసరమైతే పనిమనిషిగా, అంధురాలిగా, వీధిలో కూరగాయలు అమ్మేవారిగా, చివరికి పిచ్చిదానిలా కూడా వేషాలు వేశారు. 'ఈ వృత్తిలో ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఇందులోకి అడుగుపెట్టినప్పటి నుంచి మృత్యువు నా వెంటే ఉంటుందని నాకు తెలుసు. అయినా నేను దానికి భయపడను' అని నటి, రచయిత్రి ఛవి మిట్టల్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. పెళ్లి గురించి అడిగితే రజనీ ‘ఇప్పటికీ అవివాహితనే. 'కాలేజీ రోజుల నుంచే ఈ రంగంలో పని చేస్తున్నాను. ఈ పని వల్ల వ్యక్తిగత జీవితం గురించి, జీవిత భాగస్వామి గురించి ఆలోచించే సమయమే దొరకలేదు. ఇప్పుడు కనీసం కూర్చొని టీవీ చూసే తీరిక కూడా ఉండదు. ఎప్పుడూ ఫోన్ మోగుతూనే ఉంటుంది' అని ఆమె తెలిపారు.

​ఒక జంట హత్యల కేసులో అనుమానితురాలి ఇంట్లో పనిమనిషిగా వేషం మార్చుకుని ఆరు నెలలు గడిపిన ఘటనను ఆమె అత్యంత ప్రమాదకరమైన దర్యాప్తుగా చెబుతారు. ఆ ఇంట్లో ఉంటూనే రహస్యంగా సంభాషణలను రికార్డు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఒకరోజు రికార్డింగ్ పరికరం నుంచి వచ్చిన శబ్దంతో అనుమానం వచ్చినా, ప్రమాదాన్ని లెక్కచేయకుండా దర్యాప్తు కొనసాగించారు. చివరకు ఆమె సేకరించిన ఆధారాల ఆధారంగా హత్యకు కుట్ర పన్నిన కుటుంబ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

​డిటెక్టివ్‌గా మాత్రమే కాకుండా కౌన్సిలర్‌గా కూడా రజనీ సేవలందిస్తున్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, వ్యసనాలకు బానిసైనవారు, మాట వినని పిల్లలు వంటి సమస్యల్లో కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఒకసారి ఇంజినీరింగ్ చదవడానికి ఇష్టపడని విద్యార్థి విషయంలో తల్లిదండ్రులతో మాట్లాడి, అబ్బాయి ఆసక్తిని గుర్తించి, ఇరువురికీ నచ్చజెప్పి కుటుంబంలో సయోధ్య తీసుకొచ్చారు. 'కేసుల విచారణ మాత్రమే కాదు, కుటుంబాలు నిలబడేలా చేయడం కూడా నా బాధ్యత' అని ఆమె చెబుతారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం దర్యాప్తు విధానాన్నే మార్చేసిందని రజనీ అంటారు. 'సగం దర్యాప్తు ఇప్పుడు సోషల్ మీడియాలోనే జరుగుతోంది. స్పై కెమెరాలు, పెన్ కెమెరాలు, రహస్య మైక్రోఫోన్లు వంటి పరికరాలు దర్యాప్తులో కీలకంగా మారాయి' అని ఆమె తెలిపారు.

​డిటెక్టివ్ వృత్తి గురించి ఆమె అభిప్రాయం స్పష్టంగా ఉంటుంది. 'ఇది చాలా బాధ్యతాయుతమైన పని. ఈ ఉద్యోగం కేవలం ఇతరుల తప్పులను పట్టుకోవడం కాదు. మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడం. తెలుసుకున్న ప్రతి నిజాన్నీ బయటపెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని నిజాలను గోప్యంగా ఉంచడం వల్ల కుటుంబాలు, సంబంధాలు నిలబడతాయి. బాధ్యతతో వ్యవహరించడమే అసలు డిటెక్టివ్ లక్షణం' అని ఆమె చెబుతారు. వెండితెరపై నటిస్తారా? అని అడిగితే నవ్వుతూ, 'నటించడం సులభమే కావచ్చు. కానీ నిజ జీవితంలో డిటెక్టివ్‌గా ఉండటం చాలా కష్టం. నకిలీ గుర్తింపులతో జీవించడం, ప్రాణాలను పణంగా పెట్టడం, ప్రమాదకర నేరస్థులను ఎదుర్కోవడం, వేలాది కేసుల మానసిక భారాన్ని మోయడం పుస్తకాలు చదివి, సినిమాలు చూసి నేర్చుకునే విషయాలు కావు. డిటెక్టివ్‌గా రాణించాలంటే ధైర్యం, సహనం, సత్యాన్ని కనుగొనే వరకు వదలని పట్టుదల అవసరం' అని ఛవి మిట్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ పండిట్ చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్