శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరోడ్డు పక్క పిల్లలకు అక్షరదీపం!

1 గంట క్రితం

krishna-kumar.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 05:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆయన ప్రతిరోజూ పార్కుల్లో, ఫుట్‌పాత్‌లపై, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వీధి దీపాల వెలుతురులో చిన్నారులను కూర్చోబెట్టి అక్షరాలు నేర్పుతాడు. సాయంత్రం అవుతుందంటే చాలు.. పిల్లల మధ్యకు చేరుకుని చదువు చెప్పడం ఆయన నిత్యకృత్యం. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణకుమార్‌ ‌కి అదే అసలైన తరగతి గది.

​ఈ ప్రయాణానికి కారణం ఒక చిన్న సంఘటన. దక్షిణ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లో భిక్షాటన చేస్తున్న ఓ చిన్నారి తన తండ్రికి అన్నం పెట్టమని ఆయనను అడిగింది. ఆమెకు భోజనం పెట్టిన కృష్ణకుమార్, ఒక పుస్తకం కూడా ఇచ్చి చదువు నేర్పుతానన్నాడు. చుట్టుపక్కల అలాంటి పిల్లలు ఇంకా ఎందరో కనిపించడంతో, వారి జీవితాన్ని మార్చగలిగేది విద్య మాత్రమేనని నిర్ణయించుకున్నాడు. మొదట ప్రతిరోజూ సాయంత్రం పిల్లలను పిలిచినా ఎవరూ రాలేదు. తల్లిదండ్రులు కూడా "మా పిల్లలకు చదువులు వద్దు.. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు" అని తిరస్కరించారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ముందుగా పిల్లలతో స్నేహం చేశాడు. ఆటలతో, కథలతో వారిలో నమ్మకం పెంచాడు. ఒక చిన్నారితో మొదలైన ఆ ప్రయాణం ఇప్పుడు 50–60 మంది పిల్లలకు చేరుకుంది.

​ఈ పట్టుదలకు వెనుక ఆయన స్వంత జీవితమే ఉంది. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాకు చెందిన కృష్ణకుమార్ చిన్నప్పటి నుంచే పేదరికంతో పోరాడాడు. ఇంటర్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపాల్సి వచ్చింది. ఉపాధి కోసం సూరత్, ముంబయి, నాసిక్ నగరాల్లో తిరిగాడు. పని లేక, తిండి లేక, ఫుట్‌పాత్‌లపైనే ఎన్నో రోజులు గడిపాడు. కొంతకాలం తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చి నెలకు ఆరు వందల రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించాడు. బి.ఎ., ఎం.ఎ., బి.ఎడ్ పూర్తి చేసి, నెట్, సీటెట్, ఆర్‌టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. 2013లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. ఫుట్‌పాత్‌లపై జీవిస్తున్న చిన్నారులను చూసినప్పుడల్లా తన బాల్యం గుర్తుకొచ్చేది. అందుకే వారికి చదువు చెప్పాలని సంకల్పించాడు.

​మొదట ఆ పిల్లలు పుస్తకాలు పట్టుకోవడానికే భయపడ్డారు. అంకెలు, ఎక్కాలు, హిందీ అక్షరాలతో మొదలైన పాఠాలు క్రమంగా వారిలో చదువుపై ఆసక్తిని పెంచాయి. రోజంతా భిక్షాటన చేసిన చేతుల్లో ఇప్పుడు పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని చూసి చాలామంది ఎగతాళి చేశారు. "వీళ్లందరినీ పెద్ద ఆఫీసర్లను చేస్తావా?" అని ప్రశ్నించారు. దానికి "ప్రతి బిడ్డ అధికారి కావాల్సిన అవసరం లేదు. కానీ చదువు వాళ్లను మంచి మనుషులుగా మార్చాలి. అదే నాకు కావాలి." అనేది కృష్ణకుమార్‌ ‌సమాధానం.

​ఇప్పటికే ఆయన వద్ద చదువుకున్న 12 మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఒకప్పుడు పాఠశాల అంటే ఏమిటో తెలియని ఆ పిల్లలు ఇప్పుడు యూనిఫాం, స్కూల్ బ్యాగ్ వేసుకుని తరగతులకు వెళుతున్నారు. వారి మాటతీరు, ఆత్మవిశ్వాసం మారడం తనకు కలిగిన అతిపెద్ద సంతోషమని కృష్ణకుమార్ చెబుతారు. కృష్ణకుమార్ చేస్తున్న సేవ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పలువురు పెన్నులు, పుస్తకాలు, స్కూల్ సామగ్రి, రేషన్ కిట్లు, టెంట్లు పంపించి, ఆయన ప్రయత్నానికి అండగా నిలుస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్