'హర్ ఘర్ త్రివర్ణ', జాతీయ గీతం వందేమాతరం ఆలాపనతో మనం ఎనభయ్యవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం. దేశభక్తులు, దేశద్రోహులపై చర్చలు, విదేశీయులను గుర్తించి వారిని వేరు చేయడం-వెనక్కి పంపడం, ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా - ఇవి స్వాతంత్ర్య దినోత్సవం నాడు చర్చించే కార్యక్రమాలు. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంది. గౌరవనీయ ప్రధాని ప్రసంగంలో యువతను లక్ష్యంగా చేసుకున్న కొన్ని ప్రాజెక్టులకు చోటు లభించింది. వాటిలో, వచ్చే ఏడాది కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు(ఎ.ఐ)లో శిక్షణ ఇవ్వడం మీడియాలో అత్యధికంగా చర్చ జరిగిన ప్రాజెక్ట్. అంతేకాకుండా, డిజిటల్ మాధ్యమం ద్వారా పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు యువతకు కోచింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితమే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి యువత నుంచి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో, ప్రధానమంత్రి యువతను ప్రసన్నం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తారని భావించవచ్చు.
అయితే, రెండు రోజుల క్రితం విద్యావిషయాలకు సంబంధించిన లోక్‌సభ కమిటీ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, మన దేశంలో 73 శాతం మంది బాలురు, బాలికలు ఉన్నత మాధ్యమిక స్థాయికి చేరుకోక ముందే చదువు మానేస్తున్నారు. 10.9 లక్షల ప్రభుత్వ, ప్రభుత్వ-నిర్వహణ పాఠశాలల్లో కేవలం 90,866 పాఠశాలలు మాత్రమే ఉన్నత మాధ్యమిక స్థాయిని చేరుకోగలిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు దాదాపు శిధిలావస్థలో ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలను మాధ్యమిక లేదా ఉన్నత మాధ్యమిక స్థాయిలకు అభివృద్ధి చేయకపోవడంతో... చాలా మంది బాలబాలికల ఇళ్ల సమీపంలో ఉన్నత మాధ్యమిక పాఠశాలలు వుండడంలేదు. వారు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లలేకపోవడం, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే స్థోమత లేకపోవడం వల్ల, పాఠశాలలో తమ విద్యను కొనసాగించాలనే కల నెరవేరకుండానే మిగిలిపోతున్నది.
ఒకవేళ ఎవరైనా ఉన్నత మాధ్యమిక స్థాయిని దాటి ఉన్నత విద్యాసంస్థలో ప్రవేశించినా - అక్కడ చివరి వరకు చదవడం సాధ్యం కాదు. జులై 2026లో ప్రచురించబడిన ఒక నివేదిక (బియాండ్ ఎన్‌రోల్‌మెంట్: ఇండియాస్ హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీషన్ గ్యాప్, కళ్యాణి అయ్యర్) ప్రకారం, ఉన్నత విద్యలో ప్రవేశించిన తర్వాత కూడా 30 నుండి 50 శాతం మంది విద్యార్థులు తమ చదువును పూర్తి చేయడం లేదు. వారు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయక ముందే చదువు మానేస్తున్నారు. లేదా మానేయమని ఒత్తిడి వస్తున్నది. వారి చదువును కొనసాగించడానికి కుటుంబాల దగ్గర శక్తి లేకపోవడం, కుటుంబ అవసరాల కారణంగా వారు ఉద్యోగంలో చేరుతున్నారు. అదే ఆడపిల్లల విషయంలోనైతే చిన్న వయసులోనే వివాహం చేసేయడంతో చదువు మానేయాల్సి వస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రత్యేక ఉపాధి అవకాశాలు లేనందున, వారి చదువును కొనసాగించాల్సిన అవసరం లేదని కుటుంబాలు భావిస్తాయి. అందువల్ల, అబ్బాయిలు చదువు మానేసి కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరడం, గిగ్ వర్కర్లుగా మారడం జరుగుతుంది.
నూతన జాతీయ విద్యా విధానం-2020లో ఉన్నత విద్యలో 'జ్ఞానం' కంటే 'నైపుణ్యాల'పై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి, నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఇంటర్న్‌షిప్‌లు, బహుళ-విషయ అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఉన్నత విద్యలో పురోగతి కోసం 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి లేదా మొత్తం నమోదు రేటు లక్ష్యాన్ని 50 శాతానికి పెంచాలని విద్యా విధానం పేర్కొంది. అయితే, నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, విద్య పూర్తయ్యాక తగిన ఉపాధి అవకాశాలు కల్పించకపోతే, చాలా కుటుంబాలకు తమ పిల్లల నాలుగేళ్ల చదువును కొనసాగించడం సాధ్యం కావడం లేదని తెలుస్తున్నది.
సాధారణంగా, సైన్స్/సాంఘిక శాస్త్రాలలో ఏదైనా సబ్జెక్టులో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో చదవాలనే విద్యార్థుల కోరిక తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ వంటి వృత్తిపరమైన సబ్జెక్టులను అభ్యసించడం పెరిగినప్పటికీ, ట్యూషన్ ఫీజులు సామాన్యుడికి అందుబాటులో లేవు. దేశంలోని ప్రఖ్యాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు సంవత్సరానికి రూ.5 లక్షలకు పైగా ఉన్నాయి. సాధారణంగా, ఏ ప్రైవేట్ కళాశాలలోనైనా ఇంజనీరింగ్ చదవడానికి కనీస ఖర్చు సంవత్సరానికి రూ.1 లక్షకు పైగా ఉంటుంది. ఇంజనీరింగ్ చదవడానికి దేశంలో ఐఐటీలు ఉత్తమ విద్యాసంస్థలు. అవి ప్రభుత్వ విద్యాసంస్థలు అయినప్పటికీ, ఐఐటీల ట్యూషన్ ఫీజులు సంవత్సరానికి సుమారు రూ.2 లక్షలు ఉంటాయి. ప్రైవేట్ కళాశాలల్లో మెడిసిన్ చదవడానికి ట్యూషన్ ఫీజులు సంవత్సరానికి రూ.4.5 లక్షల నుండి రూ.25 లక్షల వరకు అవసరం. మరో మాటలో చెప్పాలంటే, మీరు ప్రతిభ పరంగా అగ్రశ్రేణుల్లో లేకపోతే, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా వైద్య విద్య అందుబాటులో ఉండదు. అంతే కాదు. ఈ పోటీ ప్రపంచంలో, ఇంజనీరింగ్, వైద్య, అన్ని ఇతర ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఎం.సి.క్యు (బహుళైచ్ఛిక ప్రశ్నలు) పద్ధతిలో తయారు చేయబడుతున్నాయి. ఫలితంగా, పాఠశాల విద్య-ప్రతిభ మాత్రమే సరిపోవడం లేదు. ప్రవేశ పరీక్షలలో విద్యార్థులకు మంచి ర్యాంకులు ఇప్పిస్తామని గొప్ప వాగ్దానాలతో వివిధ కోచింగ్ సెంటర్లు రంగంలోకి దిగుతున్నాయి. ఈ కోచింగ్ సెంటర్ల నిర్వహణ ఖర్చుల బాధ్యత కూడా కుటుంబాలపైనే పడుతుంది. అంతేకాకుండా, వైద్య విద్య ప్రవేశ పరీక్ష-నీట్ 2026 ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంతో ఆ పరీక్ష రద్దు చేయబడింది. దీనికి సంబంధించి మనం అపూర్వమైన విద్యార్థి ఉద్యమాన్ని చూస్తున్నాము. ఈ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా ఆ ప్రశ్నాపత్రం లీక్‌లో పాలుపంచుకున్నారు. కాబట్టి సహజంగానే, ప్రస్తుతం ఈ ప్రవేశ పరీక్షలన్నింటిలో ఎంత ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటున్నారు? ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారు? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఫలితంగా, చాలా మంది విద్యార్థులు ఉన్నత మాధ్యమిక విద్య ఉత్తీర్ణులైన తర్వాత కూడా ఉన్నత విద్యాలయాల్లోకి ప్రవేశించలేకపోతున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో, విద్యా రంగంపై కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ.1,28,650 కోట్లుగా ఉంది. ఇందులో, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 50,078 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులో, దేశంలోని 27 ఐఐటీలకు రూ. 12,123 కోట్లు, 56 కేంద్ర విశ్వవిద్యాలయాలకు రూ. 17,440 కోట్లు కేటాయించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎ.ఐ)లో పరిశోధన కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడానికి బడ్జెట్‌లో అధిక భాగాన్ని కేటాయించారు.
ప్రపంచంలో భారతీయ విద్యా సంస్థలను ఉన్నత స్థానంలో నిలపడానికి ప్రపంచ స్థాయి విద్యా సంస్థల అవసరం నిస్సందేహంగా ఉంది. కానీ పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్య నుండి మధ్యలోనే మానేస్తున్నప్పుడు... పరిమితంగా వున్న ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఈ వెనుకబడిన విద్యార్థుల జీవితాలలో ఎలాంటి మార్పును తీసుకురాలేవు. విద్య ప్రాథమిక అవసరాలను పక్కన పెడితే, దేశంలోని 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సుగల 27 శాతం యువత భవిష్యత్తుకు సంబంధించిన వృత్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ విద్యా వ్యవస్థను మెరుగుపరచలేము. బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టులలో ఆకర్షణీయమైన వాగ్దానాలు చేసినప్పటికీ, విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ వనరులను వినియోగిస్తున్నది.
ఈ పరిస్థితుల్లో, స్వాతంత్ర్య దినోత్సవం నాడు కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) లో శిక్షణ ఇస్తామని ప్రధాని ప్రకటించారు. అయితే ఏ స్థాయి శిక్షణ ఇస్తారు, శిక్షణ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అనే దానిపై స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అదేమిటంటే, ప్రపంచంలోని ఇతర దేశాలలో నూతన సాంకేతికతలలో జరుగుతున్న పురోగతిలో మన యువతను భాగస్వాములను చేయాలంటే...కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం స్వల్పకాలిక శిక్షణతో ఎటువంటి పురోగతి సాధ్యం కాదు. ముఖ్యంగా గణితం, సైన్స్, భాష, సాంఘిక శాస్త్రం వంటి ప్రాథమిక విషయాలలో జ్ఞానాన్ని సంపాదించడం చాలా అవసరం. ఎ.ఐ పై ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను ప్రకటించింది. కానీ ఈ ప్రాజెక్టుల లక్ష్యం అంత స్పష్టంగా లేదు, భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే దానిపై కూడా నిర్దిష్ట ప్రకటన లేదు. మరి అలాంటప్పుడు ప్రధానమంత్రి అకస్మాత్తుగా ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారన్నదే ప్రశ్న. 2020 స్వాతంత్ర్య దినోత్సవం నాడు, రాబోయే 1000 రోజుల్లో భారతదేశంలోని ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వాగ్దానం చేశారు. 2024లో, 95.15 శాతం గ్రామాలకు 3జి లేదా 4జి మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం ఉందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ నివేదించింది. కానీ ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారతదేశం 101వ స్థానంలో, మొబైల్ ఇంటర్నెట్ వేగంలో 37వ స్థానంలో ఉంది. దీని అర్థం, హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్న ప్రధాని వాగ్దానం నెరవేరడానికి ఇంకా చాలా దూరంలో ఉంది.
జులైలో మనం చూసిన అపూర్వమైన విద్యార్థి ఉద్యమం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది. కానీ పోరాటం ఇంకా ముగియలేదు. విద్యారంగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి (ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల) ముందు ఇంకా సుదీర్ఘ పోరాటం ఉంది. భారతదేశంలోని అధికశాతం మంది పిల్లలకు చదువుకునే అవకాశాన్ని దూరం చేయడానికి ఒక పథకం రూపొందించబడుతోంది. మనం ఈ చక్రాన్ని వెనక్కి తిప్పాలి. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండేలా చూడటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ విద్యాసంస్థలను గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఉచితంగా అందించాలి. ప్రైవేట్ విద్యాసంస్థల ట్యూషన్ ఫీజులను నియంత్రించడానికి ఏర్పాట్లు చేయాలి. ఒక్క విద్యార్థి కూడా అవకాశాలకు దూరం కాకుండా చూడటంపై మనం దృష్టి పెట్టాలి. ఏ దేశమూ తన ప్రజలలో అధిక శాతం మందిని వెనుక వదిలేసి ఎన్నడూ అభివృద్ధి చెందలేదు, భవిష్యత్తులోనూ సాధించలేదు.

-వ్యాసకర్త నందినీ ముఖర్జీ
కంప్యూటర్ శాస్త్రవేత్త, కోల్‌కతా లోని జాదవ్‌పూర్
యూనివర్సిటీ ప్రొఫెసర్/ (‘గణశక్తి’ సౌజన్యంతో)







కామెంట్‌లు (0)