శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎవరి ‘కేర్‌’ కోసం?

1 గంట క్రితం

pm care funds
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

స్వయంగా ప్రధాని మోడీ నేతృత్వం వహించే పిఎం కేర్స్‌ నిధుల సమాచారమూ, వినియోగమూ మొదటినుంచి ఒక రహస్య అంశంగా మిగిలిపోవడం విస్మయం కలిగిస్తోంది. దాదాపు రెండున్నర ఏళ్ల ఆలస్యంగా వెల్లడైన 2023-24, 2024-25 ఖాతాల వార్షిక వివరాలు పరిశీలిస్తే ఈ పథకం ఎవరికోసం, ఎందుకోసం అన్న సందేహాలు కూడా ముప్పిరిగొంటాయి. రూ.8,452 కోట్లు ఖాతాలో ఉండగా, 2024-25 సంవత్సరానికిగానూ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కేవలం రూ.88 లక్షలే వెచ్చించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఈ కాలంలో ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాలు కలిగించినా ఈ నిధుల నుంచి ఒక్క పైసా కూడా విదల్చకపోవటం దారుణం. విపత్తులు తలెత్తినప్పుడు తక్షణం ఆపన్నులను ఆదుకునే పేరిట కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 27న ప్రధానమంత్రి కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసి, ప్రజల నుంచి ఆర్థిక సహాయం అర్థించింది. కోవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రజలు తమ శక్తిమేరకు ఈ నిధికి విరాళాలు అందించారు. ఉద్యోగులు తమ వేతనాల్లో కొంత భాగాన్ని ఉదారంగా ఇచ్చారు. ఎన్నో సంస్థలు విరాళాలు అందించాయి. దేశానికి అవసరమైనప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుందని ప్రజలు నమ్మారు. కానీ, ఈ ఐదేళ్ల కాలంలో ఏ ఆపత్కాలానికీ ఈ నిధి ఉపయోగపడలేదు.

ఈ సహాయ నిధిని ప్రారంభించినప్పుడు అందులో ప్రభుత్వ వాటా కూడా గణనీయంగా ఉంటుందని, ఆపన్నులకు అవసరమైన సహాయం అందుతుందని చాలామంది భావించారు. ఇప్పటికే ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ఉండగా ఈ పథకం ఎందుకనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయినప్పటికీ, కళ్లముందు దారుణమైన కోవిడ్ వైపరీత్యం సాగుతోంది కాబట్టి అనేకమంది పిఎం కేర్స్‌కు పెద్దఎత్తున విరాళాలు పంపారు. అయితే, విరాళాల ద్వారా వచ్చిన మొత్తం ఎంత అన్న ప్రశ్న దేశ ప్రజల నుంచి ఎదురైనప్పుడు వివరాలు చెప్పటానికి మోడీ ప్రభుత్వం నిరాకరించింది. ఇది ఒక ట్రస్టు అని, ప్రభుత్వ సంస్థ కాదని ప్రకటించింది. సమాచార హక్కు కింద వివరాలు కోరినా, పిఎం కేర్స్ ఫండ్ ఆ పరిధిలోకి రాదని కూడా తేల్చేసింది. ప్రధాని ఎక్స్-అఫిషియో ఛైర్‌పర్సన్‌గా, రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఎక్స్-అఫిషియో ట్రస్టీలుగా ఉన్న సంస్థ ప్రభుత్వానిది ఎందుకు కాకుండా పోతోందని విమర్శలు వచ్చాయి.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు విద్య, ఆరోగ్యం, వసతి, భోజనం వంటి సదుపాయాలు కల్పించటానికి పిఎం కేర్స్ నిధులు వినియోగిస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాంటి బాలలకు 18 ఏళ్లు నిండిన తర్వాత రూ.10 లక్షలు అందిస్తామని ప్రకటించింది. దాని ప్రకారం ఒక్కో విద్యార్థికి ఏటా రూ.20 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. 2024-25లో 3,383 మంది పిల్లలకు ఈ సహాయం అందాల్సి ఉండగా, ఖాతాల్లో చూపిన వ్యయం రూ.87.85 లక్షలు మాత్రమే! ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున చెల్లిస్తే సుమారు రూ.6.76 కోట్లు అవుతుంది. పథకాన్ని ప్రకటించినప్పుడు ఇచ్చిన హామీకి, వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తానికి మధ్య ఇంతటి వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ప్రభుత్వమే చెప్పాలి. అలాగే పిఎం కేర్స్ నిధుల వినియోగం ఏడాదికేడాది తగ్గిపోతూ వస్తోంది. 2022-23లో రూ.346 కోట్లు ఖర్చు చేయగా, 2023-24లో అది రూ.15 కోట్లకు పడిపోయింది. 2024-25లో అది ఏకంగా రూ.88 లక్షలకు దిగజారింది. కాగా, నిధుల్లో పెద్ద మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలోకి మళ్లించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.6,641 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్నాయి.

పిఎం కేర్స్ వ్యవహారంలో మొదటి నుంచీ పారదర్శకతపై ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావడానికి నిరాకరించడం, కాగ్ ఆడిట్‌కు దూరంగా ఉండటం, పూర్తి ఆడిట్ వివరాలను బహిరంగపరచకపోవడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. విడుదల చేసిన వివరాల్లో కూడా రసీదులు, ప్రారంభ నిల్వ, విరాళాల మొత్తం, వడ్డీ, రీఫండ్‌లు, చెల్లింపులు, ముగింపు నిల్వ వంటివే కనిపిస్తున్నాయి. అసలు ఎవరికి, ఎందుకు, ఎంత డబ్బు వెళ్లింది? ఎవరి నుంచి ఎంత వచ్చింది? వంటి వివరాలు వెల్లడించటం లేదు. పిఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన సంస్థలు ఏవి? ఆ సంస్థలు ఏమైనా ప్రభుత్వ ప్రయోజనం పొందాయా? వంటి వివరాలను కూడా బయటికి తెలపటం లేదు.

పిఎం కేర్స్ ఫండ్‌కు వచ్చేవి ఎవరి నుంచి ఏ రూపంలో వచ్చినా అది ఈ దేశ ప్రజల సొమ్ము. ప్రధాని, మంత్రిత్వ శాఖలు దాపరికం లేకుండా ఆ వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. అంతకుమించి ఏ ఉద్దేశంతో అయితే ట్రస్టు ప్రారంభించామని చెప్పారో ఆ ప్రయోజనాలకు ఉపయోగించాలి. 9 వేల మందికి పైగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు దరఖాస్తు చేసుకోగా, 4,543 దరఖాస్తులను మాత్రమే అంగీకరించినట్టు సమాచారం ఉంది. అర్హులందరికీ సంపూర్ణంగా ఈ నిధులు అందాలి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పట్ల దేశ ప్రజలు చూపిన ఆదరణను వారికి చేరేలా చూడడం ప్రభుత్వం బాధ్యత. అలాగే కేరళ, కర్ణాటక, అసోం వంటి రాష్ట్రాల్లో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఎంతో ఆస్తి నష్టం కలిగింది. అలాంటి సందర్భాల్లో ఉదారంగా తోడ్పాటునివ్వటానికి ఈ నిధిని ఉపయోగించాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచి, రేపటి పౌరులను తీర్చిదిద్దడం మీదా వెచ్చించాలి. దేశ ప్రజల అవసరాల కోసం సేకరించిన నిధిని అందుకోసం ఉపయోగించకుండా దాచిపెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి?

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్