అక్షర దోషాలతో ఓటర్లకు కష్టాలు
నేరస్తుల తరహాలో ఫోటోలు
ప్రజాశక్తి - అమరావతి : ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమం రాష్ర్టంలో ప్రజానీకానికి చేదు అనుభవాలను మిగులుస్తోంది. ఎన్నికల కమిషన్ నోటిసులు జారీ చేస్తున్న వారిలో అత్యధిక మంది అక్షర దోషాలతో ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో నేరస్తుల తరహాలో వీరి ఫొటోలు తీస్తున్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 44.25 లక్షల మందికి పైగా నోటీసులు జారీ చేయాల్సిఉంది. వీటిలో అత్యధికం అక్షర దోషాలు, సాంకేతిక సమస్యలే! ప్రభుత్వ సిబ్బందే ఇళ్ల దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే సులభంగా పరిష్కారమయ్యే సమస్యలకు సైతం తమ కార్యాలయాలకు రావాలని హకుం జారీ చేయడం, పైగా తేది, సమయం కూడా నిర్ధేశిస్తుండటంతో ప్రజలకు పెనుభారంగా మారుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు, దేశాలకు కూడా వెడుతుండటంతో ఓటర్లను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది.ఓటర్ల వివరాలను నిర్ధారించడానికి అధికారులు తెలుగుకన్నా ఇంగ్లీషుమీదనే ఆధారపడటం కూడా చర్చనీయాంశంగా మారింది. పెద్ద సంఖ్యలో పేర్లు తెలుగులో సరిగానే కనిపిస్తున్నప్పటికీ ఇంగ్లీషులో సరైన స్పెలింగ్ టైపు చేయకపోవడంతో తప్పులుగా కనిపిస్తున్నాయి. ఆ తప్పులకే వివరణ ఇవ్వాలని అధికారులు ఓటర్లను ఆదేశిస్తున్నారు. దీనికి బదులుగా తెలుగునే ప్రామాణికంగా తీసుకుంటే పెద్ద సంఖ్యలో నోటీసులు ఇచ్చే భారం తప్పే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రంలో మాతృభాషను విస్మరించే విధంగా వ్యవహరించడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు క్షేత్ర స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఈ తరహా సాంకేతిక సమస్యలపైనే దృష్టి సారించాల్సి రావడంతో ‘అసలైన ఓటు దొంగలు’ తప్పించుకునే అవకాశమూ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోటీసులు చూపిస్తున్నారంతే!
నోటీసులు ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా అనేకచోట్ల ప్రజలకు నోటీసులు ఇవ్వడం లేదు. సంబంధిత సిబ్బంది ఓటరుకు ఆ నోటీసును చూపించి, ఏ తేదిన అధికారుల ముందు హాజరుకావాలో చెప్పి, నోటీసు అందినట్లు సంతకాలు తీసుకుని వెళ్లిపోతున్నారు. అదేమని అడిగితే నోటీసులు ఇవ్వడానికి వీలు లేదని చెబుతున్నారు. కొందరు ఫోటోలు తీసుకోవడానికి అంగీకరిస్తుండగా, మరికొందరు దానికి కూడా ఒప్పుకోవడం లేదు. నోటీసులు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా క్షేత్ర స్థాయిలో నోటీసులు చూపించడమే జరుగుతోంది.
ఓటర్లు నేరస్తులా...?
నోటీసులు అందడంతో తగిన దృవీకరణ పత్రాలతో సచివాలయ కేంద్రాలతో పాటు, ఇతర పరిశీలనా కేంద్రాలకు వెడుతున్న ఓటర్లకు తీవ్రమైన అవమానం ఎదురవుతోంది. పలకమీద పేర్లు రాసి, పోలీస్ స్టేషన్లలో నేరస్తులు ఫొటోలు తీసే విషయం తెలిసిందే. అదే విధంగా ధృవీకరణ పత్రాలను ఓటర్ల చేత పట్టించి సిబ్బంది ఫోటోలు తీస్తున్నారు. అదేమని అడిగితే‘పై నుండి ఆదేశాలు’ అని చెబుతున్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి తీరాలి. ఏదైనా తప్పు ఉంటే దానిని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ప్రస్తుత సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ ఆ రాజ్యంగ స్ఫూర్తిగా పూర్తి భిన్నంగా వ్యవహరించడంతో పాటు, ప్రజలను ఇలా అవమాన పరిచేలా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
ఇంతగా భయపెట్టాలా...?
తప్పుడు వివరాలు ఇచ్చారంటూ ఎన్నికల కమిషన్ ప్రజలను భయపెడుతున్న తీరు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఓటర్లకు ఇచ్చిన (చూపిస్తున్న )నోటీసుల్లోని రెండవ పేజీలో ఆ అంశాలను ఎన్నికల కమిషన్ పేర్కొంది. అనేకచోట్ల నోటీసు వచ్చినట్లు చెప్పి సంతకాలు తీసుకుని పోతుండటంతో వాటిని చదివే అవకాశం కూడా ఓటర్లకు ఉండటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంతో జైలు శిక్ష విధించే అవకాశం ఉందని , ఓటర్ల జాబితా తయారీ, సవరణ, సరిదిద్దడం, చేర్చడం తదితర ప్రక్రియలో తప్పుడు ప్రకటన చేస్తే జైలుశిక్ష, జరిమానా రెంటిని కలిపి విధిస్తారని ఈ పేజిలో పేర్కొన్నారు. అదే విధంగా విచారణ సమయంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినా, ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు ప్రకటన చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే, అసలు తప్పు చేస్తున్నది ఎవరు? శిక్ష ఎవరికి పడుతోందన్నదే అసలైన ప్రశ్న!

ఈ ఫోటో చూడండి ...
కల్పనాకుమారి గోపిసెట్టి కదా! 2002 నాటి ఓటర్ల జాబితాలో ఆమె పేరు కల్పనా కుమారి జి అని ఉంది! అంతే, అధికారులకు డౌట్ వచ్చేసింది. తమ ముందుకు వచ్చి ‘అసలైన ఇంటిపేరు’ నిరూపించుకోవాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు! ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో తమ కుమార్తె వద్ద ఉంటున్నారు. ఆమె ఓటు ఎన్‌టిఆర్ జిల్లాలోని జి.కొండూరు మండలంలో ఉంది. నోటీసు వచ్చిన సమాచారం రావడంతో అధికారులు సూచించిన తేదీకి నానా కష్టాలు పడి ఆమె ఆ ఊరికి ప్రయాణమయ్యారు. మధ్య దారిలో ఉండగానే సంబంధిత అధికారి లేరని మరోసారి రావాలంటూ ఆమెకు ఫోన్ వచ్చింది. దీంతో వెనక్కి వచ్చిన ఆమె మళ్లీ అధికారులు చెప్పిన తేదికి మళ్లీ వెళ్లి వారు అడిగిన కాగితాలు చూపించివచ్చారు.

ఈ ఫోటో కూడా చూడండి.. తండ్రి పేరు రామచంద్రయ్య వారణాసి అని స్పష్టంగా కనిపిస్తోంది కదా! ఇంగ్లీషులో చూడండి.RAMACHADRAIAH అని ఉంది. ‘N’ అక్షరం మిస్ అయ్యింది. ఈ తప్పు ఎవరిది? 2002 ఓటర్‌లిస్టుకు ప్రస్తుత జాబితాలో ఉన్న తండ్రి పేరుకు వ్యత్యాసం ఉండటంతో ఓటర్ల లిస్టులో పేరు కొనసాగించడానికి సరైన ధృవీకరణ పత్రాలు చూపించాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశం. సర్ ప్రక్రియలో భాగంగా నింపి ఇచ్చిన గణన ఫారంలో సరైన వివరాలు ఇచ్చినప్పటికీ వాటిని ఏ మాత్రం పట్టించుకోని ఎన్నికల సంఘ అధికారులు తమ ముందు హాజరై తీరాల్సిందేనని ఆదేశిస్తున్నారు.







కామెంట్‌లు (0)