భారతీయ మూలాలున్న లక్ష్మణన్ మెయ్యప్పన్ 16 ఏళ్లకే సీఏ (చార్టర్డ్ అకౌంటెన్సీ) పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో సీఏ పూర్తి చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించాడు. ఎంతో క్లిష్టమైన ఏసీసీఏ (అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్) అర్హతను కూడా సాధించాడు. తనకంటే ముందు 17 ఏళ్లకే సీఏ పూర్తి చేసిన భారతీయ విద్యార్థి దిషాన్ షా పేరిట ఉన్న రికార్డును లక్ష్మణన్ అధిగమించాడు.
లక్ష్మణన్ దుబాయ్‌లో 2005 జనవరి 11న జన్మించాడు. యూఏఈలోని షార్జాలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. 14 ఏళ్ల వయసులో అకౌంటింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. పదో తరగతి పరీక్షలతోపాటు ఏసీసీఏ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తొలుత పదో తరగతి పరీక్షలు పూర్తి చేసి, ఆ తర్వాత ఏసీసీఏ అర్హత కోసం కృషి చేశాడు. 13 పేపర్లను ఏడాదిలోనే పూర్తి చేసి అర్హత సాధించాడు. 16 ఏళ్ల 171 రోజుల వయసులో ఏసీసీఏ అర్హత సాధించిన విషయాన్ని లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరించింది. ఏసీసీఏకు 180 దేశాల్లో గుర్తింపు ఉంది. ఈ విజయానికి తన తల్లిదండ్రులు మెయ్యప్పన్, మీనాక్షి ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉందని లక్ష్మణన్ చెప్పాడు.
పీడబ్ల్యూసీ అకాడమీ మధ్యప్రాచ్య మార్కెటింగ్ విభాగం అధిపతి ప్రియంతో లక్ష్మణన్‌తో సంభాషించారు.
ఇంత చిన్న వయసులోనే ఏసీసీఏ జర్నీ ఎలా ప్రారంభించారు?
కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నాను. ఏసీసీఏ పూర్తి చేసిన మా అమ్మ నాకు ప్రాథమికంగా అకౌంటింగ్ అంశాలను పరిచయం చేశారు. అవి నాకెంతో ఆసక్తిగా అనిపించాయి. నా ఏసీసీఏ ప్రయాణానికి తొలి మెట్టు అదే. ఎప్పుడైతే మొదలుపెట్టానో.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏసీసీఏ అర్హత సాధించడానికి కృషి చేశాను.
ఒక్క సంవత్సరంలోనే అర్హత ఎలా సాధించగలిగారు?
నా గురువులు, తల్లిదండ్రులు, తాతయ్య–నానమ్మలు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. పీడబ్ల్యూసీ అకాడమీ శిక్షకులు నా బలాలు, బలహీనతలను గుర్తించి, ఉత్తీర్ణత సాధించే విధంగా నాకు శిక్షణ ఇచ్చారు. నేను ఎప్పుడైనా పొరపాటు చేసినా దాన్ని పరిష్కరించేందుకు సరైన మార్గనిర్దేశం చేశారు. ప్రతి పరీక్షా షెడ్యూల్‌లో ఒకటికంటే ఎక్కువ పేపర్లు రాసేలా సన్నద్ధమయ్యాను. పరీక్షల కోసం ఎక్కువ సమయం కేటాయించాను. చివరికి ఉత్తీర్ణత సాధించాను.
విద్యార్థులకు ఏం చెబుతారు?
ఏ పరీక్షా కష్టతరమైనదని ముందే అనుకోకూడదు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలి. మీరు చేసే పనిని ప్రేమించడం మొదలుపెట్టిన క్షణమే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం, అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ప్రాథమిక అంశాలు అర్థం కాకపోతే ఏదైనా క్లిష్టంగా అనిపిస్తుంది. నేను నేర్చుకోవడం ఎప్పటికీ ఆపను.
ప్రస్తుతం లక్ష్మణన్‌కు 21 ఏళ్ల వయసు. ఏసీసీఏతోనే ఆగిపోకుండా సీఎఫ్‌ఏ (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) లెవల్‌ను కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో ఎంఎస్సీ చేస్తున్నారు. దుబాయ్‌లోని ‘సెంచరీ ఫైనాన్షియల్’ సంస్థలో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో గడియారాల రూపకల్పన, తయారీపై కూడా ఆసక్తి చూపుతున్నారు.







కామెంట్‌లు (0)