నోరు మంచిదైతే ఊరు మంచి దవుతుందంటారనే సామెత ఆ పెద్దాయనకు ఆలస్యంగా తెలియవచ్చింది. అప్పటికి జరగాల్సిన డామేజి జరిగిపోయింది పాపం. ఇంతకూ అట్టాంటి ఇట్టాంటి పెద్దమనిషా అంటే కాదు. స్వయంగా ఈ విశాల భారత ప్రధాన న్యాయమూర్తులువారే. సిజెఐ సూర్యకాంత్ ఎక్కడకు వెళతానన్నా జెన్ జి...అదేనండీ ఆయన భాషలో బొద్దింకలు వెంట తరుముతున్నాయి. మొదట హైదరాబాద్‌లోని న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్‌కు పిలవాలనుకున్నారు. ఇంతలో అక్కడ పిల్లలు సంతకాలు చేసి ‘ఆయన వస్తే ఒప్పుకోం’ పొమ్మన్నారు. అంత పెద్దాయనను ఇంత మాటంటారా అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీకెవరికీ న్యాయవాద వృత్తిలోకి ప్రవేశం ఇవ్వబోమని బెదిరించింది. దీనిపై ఇంకా కోపం పెరిగింది. ఇది చూసిన పెద్దాయన అసలు నా తరఫున మీరెవరు ఇలా అనడానికి అని కోప్పడ్డారు. తర్వాత అసలు నల్సార్ వారి ఆహ్వానాన్ని తానెప్పుడూ ఒప్పుకోనేలేదు పొమ్మన్నారు. ఇంతలో ముంబాయిలోని ‘టిస్’ లో ఇదే కథ రిపీట్. ‘టిస్’ స్నాతకోత్సవానికి సిజెఐ రానున్నారనే కథనాలు వెలువడ్డాయి. షరామామూలగా అక్కడా విద్యార్థులు వీల్లేదు పొమ్మన్నారు. దేశానికే పెద్ద న్యాయమూర్తి వస్తానంటే పిల్లలు సంతోషించాలి గానీ ఇలా వద్దనడానికి కారణమేమని బిబిసి వంటి సంస్థలు పెద్ద కథనాలిచ్చాయి. ఇంతలో ‘టిస్’ మనసు మార్చుకుని తమ సంస్థకు చెందిన సీనియర్ డాక్టర్‌తో కథ నడిపించేయాలని నిర్ణయించింది. ఇక ఇప్పుడు సిజెఐ గారి కార్యాలయం ముందుకొచ్చింది. నవంబర్ వరకూ ఆయన డైరీలో ఖాళీలే లేవు. ఎక్కడికీ ఆహ్వానాలు ఆమోదించేది లేదు పొమ్మని ప్రకటించి కాపాడింది. ఈ ఐడియా కూడా బానే వుంది కదా? అయితే లోపల పేరుకున్న ఉక్రోషం ఊరుకుంటుందా? తను వాడిన బొద్దింక అన్న మాటను వక్రీకరించి లబ్ధి పొందిన వారిపై విచారణ జరపడాన్ని మీరెలా చూస్తారని కేంద్రానికి ఒక నోటీసిచ్చారు. ఏదో ఒకటి చేద్దామనే అనుకుంటున్నారట.
అమెరికా కాశ్మీర గీతం
దేశదేశాలలో దౌర్జన్య యుద్ధాలు, తాజాగా ఇరాన్‌పై దురాక్రమణ దాడి, ఆపైన హర్మూజ్ పేరిట కుటిల రాజకీయాలు చేసి భంగపాటుకు గురైన అమెరికా డాన్‌తో జిగ్రీదోస్త్‌గా పేరు తెచ్చుకున్న విశ్వగురువుకూ ఆ విన్యాసాల తాకిడి తప్పడం లేదు. భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియోగోర్ కాశ్మీర్‌లో పర్యటించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరిపి వచ్చారు. కాశ్మీర్ భారతదేశంలో విడదీయరాని భాగమని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడారు. అంతవరకూ బాగానే వుంది. మరి మీ దేశం కాశ్మీర్‌ను ప్రమాదకర ప్రాంతంగా ప్రకటించి పర్యాటకులను రావద్దంటూ సలహా విడుదల చేసింది కదా వెనక్కుతీసుకోండని ఒమర్ అడిగారు. ఇప్పుడే చెప్పలేను గానీ తప్పక పున:పరిశీలిస్తామని జారుకున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తమ ఘన విజయమని మోడీ సర్కారు చెప్పుకుంటుంది. ఇప్పుడా రద్దుకు ఏడేళ్లు గడిచాయి. ఇలాంటి తరుణంలో తమ ప్రియతమ నేస్తం అక్కడకు వెళ్లి అభినందనలు చెప్పడం కేంద్రానికి ఒకింత ఇరకాటంగానే వుంటుంది కదా. ఇక్కడే మరో మెలిక. పాకిస్తాన్ సైనిక మతతత్వ కూటమిని అమెరికా ఎప్పుడూ ఎగదోస్తుంటుంది. ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రస్తుతం త్రీవ నిరసనలపై అణచివేత సాగుతున్నది. బెలూచిస్తాన్ పైనా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా రాయబారి అక్కడకు వెళ్లి అంతా బావుందని కితాబివ్వడం, దాన్ని భారతదేశంలో భాగంగా చెప్పడం మింగుడు పడేదేనా? కనీసం షరామామూలుగా పాకిస్తాన్ పాలకులు ఈ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఇక్కడే మరో ట్విస్ట్. ఈ మధ్యనే పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలు మక్కా ఒప్పందం చేసుకున్నాయి. దీనిపైనా అమెరికా హర్షం ప్రకటించడం విమర్శలకు గురైంది. ఇరాన్ విషయంలోనూ పాకిస్తాన్ అటూ ఇటూ మధ్యవర్తిగా అభినయిస్తున్న ప్రాత చూస్తూనే వున్నాం. ఈ నేపథ్యంలోనే గోర్ కాశ్మీర గానాన్ని గమనించవలసి వుంటుంది కదా? వీటిని డైవర్షన్ ఎత్తుగడల కింద చూడాల్సిందే.
తారల తళతళలు.. తేడాలు....
సినీ తారల తళతళలు, ఆకర్షణలు పెద్దగా తగ్గించేదేమీ లేదని తేల్చేశారు జీనత్ అమన్. గుర్తుంది కదా ఒకప్పటి బోల్డ్ హీరోయిన్. ‘దమ్ మారో దమ్’ అంటూ 70ల నాటి యువత అశాంతిలో ఒక భాగానికి రూపమిచ్చిన నటీమణి. తర్వాత రాజ్‌కపూర్ ‘సత్యం శివం సుందరం’, అమితాబ్ బచ్చన్ ‘దీవార్’ సహా పలు చిత్రాలతో రక్తికట్టించిన నవీన నటీమణి. కాకుంటే ఇప్పుడామెకు 75 ఏళ్లు. ఇప్పటికీ ఆమె మీడియాలో కనిపిస్తూ అడపాదడపా పాత్రలు ధరిస్తూ వుంటారు. అన్నిటినీ మించి సోషల్ మీడియాలో ఇంటరాక్టవుతుంటారు. దీనిపైనే వివరంగా మాట్లాడుతూ నేను ఇప్పుడు జెన్ జి అనో, 75 కాదు 45 అనో చెప్పుకోవడం లేదు. ఆ అవసరం కూడా లేదన్నారు. కాకుంటే మా అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోవడానికి సోషల్ మీడియా బాగుంటుందని పిల్లలు చెప్పడంతో మొదలు పెట్టాను. నిజంగా చాలా ఆసక్తిగా వుంటుందని వ్యాఖ్యానించారు. తన కాలంలో నటీనటులకు, ప్రేక్షకులకూ మధ్యన దూరం చాలా వుండేదని అందువల్ల ఒక విధమైన ఆరాధన, ఆకర్షణ కొనసాగేవని గుర్తు చేసుకున్నారు. సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. నటీనటుల వ్యక్తిగత, దైనందిన జీవితం, ఏం తింటారు, ఎలా వుంటారు, ఎక్కడకు వెళుతుంటారు వంటివి తెలిసేవి కావు గనక బోలెడు కథనాలు నడిచేవి. ఇప్పుడు అన్నీ వెంటనే ప్రత్యక్షంగా వచ్చేస్తున్నాయి. దీనివల్ల వేగంగా పేరు రావడం, పోవడం కూడా జరిగే వీలేర్పడిందని చెప్తున్నారు. అప్పటిలా గాక ఇప్పుడు నటీనటులు మాట్లాడటం, స్పందించడం, బేరసారాలు ఆడటం, వాణిజ్య ఒప్పందాలు వగైరాలన్నీ చూడవలసి వస్తున్నది. వాటిలో కూడా సక్సెస్ అయితేనే నిలబడగలుగుతున్నారు. ఈ మార్పు తప్పితే వారి పట్ల అభిమానానికి ఢోకా లేదని అభిప్రాయపడ్డారు. అమితాబ్ బచ్చన్ ఇటీవలే ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, స్పందించడం చాలా ఇష్టమైనప్పటికీ ఒప్పుకున్న కార్యక్రమాల కారణంగా సమయం వుండటం లేదని నిట్టూర్చారు. కనుక వరుస ఏమటన్నది తప్ప వయసేమిటన్నది సమస్య కాదన్నది ఇక్కడ నిన్నటి తారలు ఇద్దరూ చెబుతున్న మాట. క్రియాశీలత కీలకం.
- పీపీ







కామెంట్‌లు (0)