శరణార్థుల కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి.. తాను పెరిగిన దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించడం అంత ఆషామాషీ కాదు. అమెరికా రాజకీయ నాయకురాలు ఆయేషా వాహబ్ మాత్రం దాన్ని సాధించి చూపారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన కుటుంబంలో పుట్టిన ఆమె 2022 నుంచి కాలిఫోర్నియా సెనెటర్‌గా ఉన్నారు. తాజాగా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికై మరో మైలురాయి దాటారు. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ఆఫ్ఘన్-అమెరికన్‌గా, హేవర్డ్ నగర కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి ఆఫ్ఘన్-అమెరికన్ మహిళగా, కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్‌లో తొలి ఆఫ్ఘన్-అమెరికన్, ముస్లిం వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు.
న్యూయార్క్ సిటీలో 1987లో ఆయేషా పుట్టారు. ఆఫ్ఘన్-సోవియట్ యుద్ధ సమయంలో ఆమె కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. ఆయేషా చిన్నతనంలోనే తండ్రి హత్యకు గురయ్యారు. కొంతకాలానికే తల్లి కూడా చనిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆయేషా, తన చెల్లి కొంతకాలం ఫోస్టర్ కేర్‌లో పెరిగారు. అనంతరం కాలిఫోర్నియాలోని ఓ ఆఫ్ఘన్ కుటుంబం వారిని దత్తత తీసుకుంది. దత్తత తర్వాత కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఆయేషా బాల్యం గడిచింది. ఆ తర్వాత శాన్ హోసే స్టేట్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం అభ్యసించారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ బే నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీని, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి సోషల్ వర్క్‌లో డాక్టరేట్‌ను పొందారు.
సేవ నుంచి రాజకీయాల వరకు..
రాజకీయాల్లోకి రాకముందు టెక్నాలజీ, లాభాపేక్ష లేని సంస్థలు, సామాజిక సేవా రంగాల్లో ఆయేషా పనిచేశారు. ఆఫ్ఘన్ కమ్యూనిటీలకు సేవలందిస్తున్న సంస్థలతో కూడా కలిసి పనిచేశారు. తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులే రాజకీయ ప్రాధాన్యతలను గుర్తించడంలో తనకు సహాయపడ్డాయని ఆమె తరచూ చెబుతారు. అమెరికా ఎదుర్కొన్న ఆర్థిక మాంద్యం తర్వాత ఆయేషా కుటుంబం వ్యాపారంలో నష్టపోయింది. ఇల్లు కోల్పోయింది. ఆయేషా కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయారు. బతుకుదెరువు కోసం ఆ కుటుంబం కాలిఫోర్నియా నుంచి హేవర్డ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఆమెను స్థానిక రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించేలా చేశాయి. 2018లో హేవర్డ్ నగర మండలికి ఎన్నికవడంతో ఆయేషా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగేళ్లకే కాలిఫోర్నియా సెనేట్‌కు ఆమె ఎన్నికయ్యారు. భారీ ఖర్చుతో సాగిన తాజా ఎన్నికల్లో ప్రత్యర్థికి బయటి వర్గాల నుంచి వచ్చిన గణనీయమైన ఆర్థిక మద్దతును ఎదుర్కొంటూ ఆమె కాంగ్రెస్‌లో స్థానం సంపాదించారు.
గాజాపై స్పష్టమైన వైఖరి
గాజాపై ఇజ్రాయిల్ యుద్ధానికి సంబంధించి ఆయేషా పంచుకున్న అభిప్రాయాలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఏప్రిల్‌లో జరిగిన ఒక అభ్యర్థుల సదస్సులో ఆయేషా మాట్లాడుతూ.. ‘గాజాలోని పాలస్తీనియన్లకు జరుగుతున్న అన్యాయం ఒక మారణహోమం’ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయిల్-గాజా అంశంపై ఆమె వైఖరి స్పష్టమైంది. అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఆయేషా దక్కించుకున్న స్థానం చాలా స్వల్ప కాలమే ఉండనుంది. జనవరి తర్వాత కూడా ఆమె కొనసాగాలంటే నవంబర్‌లో ఓటింగ్‌ను ఎదుర్కోవాలి. కాంగ్రెస్‌కు ఎన్నికైన తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికలు పాఠశాలలకు వెళ్లలేకపోవడం, స్వేచ్ఛగా తమ జీవితాలను గడపలేకపోవడంపై ఆమె నిరాశ వ్యక్తం చేశారు. ‘ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగించాలి’ అని అన్నారు. శరణార్థుల కుటుంబంలో పుట్టిన ఆయేషా.. తన కుటుంబ మూలాలున్న ఆఫ్ఘనిస్థాన్ పట్ల ప్రపంచ దేశాలు ఎలా వ్యవహరించాలో చెప్పే స్థాయికి ఎదగడం.. ఎందరో శరణార్థులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.







కామెంట్‌లు (0)