చక్కెర ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన మన దేశం ఇప్పుడు ముడి చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితికి చేరుకోవడం విచారకరం. కీలకమైన విషయాల్లోనూ కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక లేమికి ఇది నిదర్శనం. దేశ వ్యాప్తంగా చక్కెర ధరలు అనూహ్యంగా పెరగడం వంటి పరిణామాలు ప్రజానీకంలో కలకలం రేపాయి. పండగ సీజన్ ప్రారంభంలోనే చక్కెర చేదెక్కడం చర్చనీయాంశంగా మారింది. ధరలను అదుపు చేసే పేరిట తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో పది లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. చక్కెర విషయంలో ఈ తరహా నిర్ణయం తీసుకోవడం పది సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిజానికి దేశంలో ఏటా సుమారు 280–290 లక్షల టన్నుల చక్కెర వినియోగమవుతుండగా, సాధారణంగా 320–340 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటుంది. దేశీయ అవసరాలు పోనూ అదనంగా ఉన్న ఉత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. 2025–26 సీజన్ ప్రారంభంలో సాధారణం కన్నా ఎక్కువ ఉత్పత్తి ఉంటుందనే అంచనా వేశారు. కానీ వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలు, నీరు నిలిచిపోవడంతో పాటు తెగుళ్ల వ్యాప్తితో ఉత్పత్తి 306 లక్షల టన్నులకు పడిపోయింది. అంటే ప్రారంభ అంచనాతో పోలిస్తే దాదాపు 35 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గింది. ఈ పరిస్థితి స్పష్టమవుతున్నప్పటికీ కేంద్రం చక్కెర ఎగుమతులను ఏ మాత్రం తగ్గించలేదు. పైగా తొలుత 15 లక్షల టన్నుల ఎగుమతికి అనుమతించి, ఆ తరువాత దానిని 20 లక్షల టన్నులకు పెంచింది. ఉత్పత్తి తగ్గుతుందని తెలిసినా, దేశీయ నిల్వలను కాపాడటంలో ఆలస్యం చేసింది. ఫలితంగా జులై 20 నుంచి చక్కెర ధర భారీగా పెరగడం ప్రారంభమైంది. కిలో రూ.48.18 నుంచి 70 రూపాయలకు చేరింది.
ఈ సంక్షోభంలో ఇ-20 ఇథనాల్ విధానం కూడా కీలకమైన అంశమే. 2025–26లో చెరకు రసం, సిరప్, బి–హెవీ మొలాసిస్ వంటి ముడిపదార్థాలను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా సుమారు 28–30 లక్షల టన్నుల చక్కెరకు సమాన పరిమాణం ఉత్పత్తికి దూరమైంది. ఇది కూడా చక్కెర ఉత్పత్తిపై ప్రభావం చూపింది. చెరకు ఉత్పత్తి తగడం, ఇథనాల్ కోసం వినియోగించడం వంటి అంశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులను కొనసాగించింది. దీంతో ప్రజల వినియోగానికి అవసరమైన చక్కెర అందుబాటులో లేకపోవడంతో ధరలకు రెక్కలు రావడం ప్రారంభమైంది. దీనికి బ్లాక్ మార్కెటింగ్ కూడా తోడు కావడం, పండగ సీజన్ కూడా రావడంతో సామాన్యులు భయపడే పరిస్థితి ఏర్పడింది. చక్కెర ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న సమయంలో ఇ-20 లక్ష్యాలు, దేశీయ చక్కెర అవసరాలు, ఎగుమతులు, కనీస నిల్వలను సమన్వయం చేయడంలో ముందుస్తు ప్రణాళికలే కీలకం. ఈ కీలక అంశాల్లోనే కేంద్రం విఫలం చెందిందన్నది స్పష్టం. అందువల్ల ప్రస్తుత సంక్షోభాన్ని కేవలం వర్షాలు, తెగుళ్లు, పండుగల డిమాండ్‌కు ఆపాదించి చేతులు దులుపుకోవడం సరికాదు. తగ్గుతున్న ఉత్పత్తికి అనుగుణంగా ఎగుమతులను పునఃసమీక్షించడం, ఇథనాల్‌కు మళ్లింపును అవసరానికి తగ్గట్టుగా నియంత్రించడం, కనీస భద్రతా నిల్వలను కాపాడటం వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోని ఉండాలి. ధరలు పెరుగుతుండటం గమనించి వెనువెంటనే అదుపు చేసే చర్యలు చేపట్టి ఉండాల్సింది. ముఖ్యంగా నిఘా వేసి దొంగ నిల్వలకు మళ్లకుండా చూడాల్సింది. కానీ కేంద్ర ప్రభుత్వం అటువంటి చర్యలేమీ తీసుకోలేదు. పైగా అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధర టన్నుకు 474 డాలర్ల నుంచి 552 డాలర్లకు పెరిగిన సమయంలో దిగుమతులకు వెళ్లాల్సి రావడం వల్ల దేశం అదనంగా ఆర్థిక భారాన్ని మోయవలసి వస్తోంది. ఇదే తరహా విధానాలను కొనసాగిస్తే దేశ ఆహార భద్రతకు సైతం ముప్పు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్పొరేట్ల కొమ్ము కాయడం మాని, ప్రజలను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందించి అమలు చేయాలి.







కామెంట్‌లు (0)