గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకరువు నిబంధనలను ‘జటిలం’ చేసిన కేంద్ర ప్రభుత్వం

1 గంట క్రితం

farmer.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 05:42 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

దీర్ఘకాలం పాటు వర్షం లేకపోవడం, పంటలు పండక పోవడం, ప్రజలకు, పశువులకు ఆహార కొరత, మంచినీటి కొరత ఏర్పడటాన్ని కరువుగా పేర్కొంటారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలో పెద్దలు డొక్కల కరువు గురించి చెప్పుకునేవారు. బ్రిటిష్ పాలకులు ప్రజలను పట్టించుకోకపోవడంతో ప్రజలు మట్టి జావ కాసుకొని తాగినట్లు చెప్పుకునేవారు. స్వాతంత్ర్యానంతరం 52 లో రాయలసీమ కరువు ఏర్పడింది. ఆనాటి భారత ప్రభుత్వం రాయలసీమ కరువును గుర్తించటానికి, సహాయ చర్యలు చేపట్టడానికి నిరాకరించింది. దానికై ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి కరువు ప్రకటింప చేసుకున్నారు.

కరువు నిబంధనలు - నష్టపరిహారాలు

1966లో దేశ వ్యాపితంగా కరువు ఏర్పడింది. భారత ప్రభుత్వం కరువు నిబంధనలు రూపొందించింది. సాధారణ వర్షపాతం కన్నా 25 శాతం తక్కువ వర్షం కురవటం, పంటల సాగు విస్తీర్ణం 50 శాతం తగ్గటం, పంటల దిగుబడులు 33 శాతం తగ్గటం కరువు నిబంధనలుగా పేర్కొన్నారు. కరువు ప్రకటించాలంటే వర్షపాతంతో పాటు మరొక నిబంధన వర్తించాలని షరతు ప్రకటించారు. వర్షాన్ని _లెక్కించటానికి విధానం రూపొందించారు. 24 గంటలలో రెండున్నర మిల్లీమీటర్ల వర్షపాతం పడితే ఒక వర్షపు రోజు కింద లెక్క. అటువంటి వర్షం 21 రోజులు పడకపోతే తేలికపాటి కరువుగాను, 29 రోజులు కురవకపోతే తక్కువ కరువుగాను, _42 రోజులు దాటితే తీవ్ర కరువుగాను పరిగణించేవారు. కరువు ప్రకటించగానే ప్రభుత్వం తీసుకోవాల్సిన సహాయక చర్యల కింద ప్రజలకు ఉపాధి కల్పించడం, ప్రజలకు, పశువులకు తాగునీరు సరఫరా చేయటం, పశుగ్రాసం సరఫరా చేయటం, ఉచిత రేషన్ ఇవ్వటం, అంబలి కేంద్రాలు నిర్వహించడం, రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయటం, పేదలకు వినియోగ రుణాలు ఇవ్వడం తదితర కార్యక్రమాలు చేపట్టాలి.

బిజెపి ప్రభుత్వం తెచ్చిన చట్టాలు

2016లో దేశంలో తిరిగి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరువు విధానాలను పునః పరిశీలించింది. "వేదాస్" పేరుతో _కొత్త నిబంధనలు ప్రకటించింది. "విజువలైజేషన్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా అండ్ ఆర్కైవల్‌ సిస్టమ్‌" అనే విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో గతంలో ఉన్న మూడు నిబంధనలకు తోడు నీటి నిల్వలను కూడా పరిశీలించాలని చేర్చింది. వీటిలో కనీసం మూడు అంశాలు ఉంటేనే కరువుగా గుర్తించాలని పేర్కొన్నది. భూమిపైన, భూమి లోపల ఉన్న నీటి నిల్వలను భూమిలో ఉన్న తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నది. _వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి లోనిది. కావున రాష్ట్ర ప్రభుత్వాలు కరువు ప్రాంతాలను నిర్ణయించి పంపితే, కేంద్రం పరిశీలించి ఆమోదం తెలుపుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు పంపిన అనంతరం కేంద్ర బృందాలు పర్యటించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నిర్ధారించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నిధి నుండి కొంత సహాయం చేస్తుంది. కేంద్ర దళాలు పర్యటనకు రెండు నుండి నాలుగు మాసాల సమయం పట్టేది. అప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమయ్యేది. ఇది ఒక తంతుగా మారింది.

ప్రైవేటు బీమా కంపెనీల లాభాల కోసం

కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశ పెట్టింది. దిగుబడి ఆధారిత పంటల బీమా, పర్యావరణ ఆధారిత పంటల బీమా పథకాలను కలిపి ఒకే చట్టం చేసింది. బీమా పథకం అమలుకు పది ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. 2019లో ప్రైవేటు బీమా కంపెనీలు వ్యవసాయ శాఖ ఉద్యోగులు రూపొందించిన కరువు అంచనాలను అంగీకరించేది లేదని, శాటిలైట్ సమాచారం ద్వారా సేకరించే విధానం ప్రవేశపెట్టాలని పేచీపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఈ కాలంలో ప్రైవేటు బీమా కంపెనీలు, రూ.24 వేల కోట్ల లాభాలు పోగేసుకున్నాయి. రైతులకు చెల్లించింది స్వల్పం. _ _ _ _ ప్రస్తుతం ఇండియన్ స్పేస్ రీఛార్జ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వారు రూపొందించిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా సమాచారం సేకరించే విధానం చేపట్టింది. స్వల్ప వర్షపాతం కలిగిన రాయలసీమలో విత్తనాలు మొలకెత్తని భూమి ఎంత శాతం. మొలకెత్తినా గిడసవారి నేలకు అంటుకుపోయిన విస్తీర్ణం ఎంత శాతం? మొలకెత్తి ఎండిపోయిన పంట ఎంత శాతం? అనేది ఎలా నిర్ధారిస్తారో అంతు పట్టదు. రాయలసీమలో భూగర్భ జలాలు అడుగంటుతున్న వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ సమాచారంలో వృక్ష సమాచారం ప్రకారం పంటలు వేయక పోయినా అటవీ వృక్షాలు, హార్టికల్చర్ పంటలు పచ్చని వాతావరణం చూపిస్తాయి. ఇప్పుడు వర్షాభావానికి గురైన పండ్ల తోటలు జబ్బుపడి ఏడాది పొడవునా పూత పూయటం, పూత నిలపటం, పిందె కట్టడం, కాపు నిలపటం అన్ని దశలలోనూ బలహీనంగా ఉంటాయి. ఇవన్నీ శాటిలైట్‌ ‌ద్వారా తెలియవు. ప్రత్యక్షంగా తీసుకోవాల్సిన వివరాలు.

నష్టపరిహారాలకు తిలోదకాలు

కేంద్ర ప్రభుత్వం 2025లో ప్రకృతి వైపరీత్యాల చట్టానికి సవరణలు చేసింది. గత చట్టంలోని 12, 13, 61 క్లాజులను తొలగించింది. సెక్షన్ 12లో బాధితులను ఆదుకోవటానికి ఉన్న నిబంధనలు తొలగించారు. 13లో పంటలు కోల్పోయిన రైతాంగానికి రుణాలు రీషెడ్యూల్ చేసే చాప్టర్ ను తొలగించారు. 61వ క్లాజు ప్రకారం మహిళలకు, షెడ్యూల్ కులాలకు వివక్ష చూపకుండా పరిహారం ఇవ్వాలనే నిబంధన తొలగించారు. ఈ చట్టం అమలు లోకి వస్తే _పంట నష్టపరిహారాలు, రుణాల రీ షెడ్యూలు హుళక్కే. పంటల బీమా మాత్రమే దిక్కు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి బీమా ప్రీమియం చెల్లించమని పదేపదే చెప్తోంది. గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు అమలు చేసింది. ఈ ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని రద్దు చేసింది. గత రెండు సంవత్సరాల నుండి బీమా చెల్లంచిన వారికి బీమా ఇచ్చిన దాఖలాలు లేవు. ఫలితంగా రైతులు ఆసక్తి చూపటంలేదు. చెల్లించాలని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్తున్నారు.

ముందుచూపు లేని ఫలితం

ఈ ఏడాది కేరళంకు రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. అప్పటికీ ముందు నుండే "ఎల్‌నినో" ప్రభావం గురించి శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణా, గోదావరి డెల్టాలకు ముందుగా నీరు వదులుతామని, ఒక నెల ముందుగానే నాట్లు వేస్తే నవంబర్, డిసెంబర్ మాసాలలో వచ్చే తుఫానులకు ముందే వరి కోతలు పూర్తి చేసుకోవచ్చని, ముందుగా నారుమళ్ళు పోసుకోమని రైతులకు పిలుపు ఇచ్చారు.

రైతాంగం నారుమళ్ళు పోయటం, భూమిని సిద్ధం చేయటం, గట్లు వేయటం, వగైరా పనులు పూర్తి చేశారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేశారు. కొందరు రైతులు భూమిని దున్ని ఎద పెట్టారు. కొందరు గింజలు చల్లి పొడి కప్పు కప్పారు. జులై చివరి నాటికి కృష్ణా డెల్టాలో వరి నాట్లు వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతాంగాన్ని గందరగోళం లోకి నెట్టారు.

అంతర్జాతీయ నీటి యాజమాన్యం ఇన్‌‌స్టిట్యూట్ వారు చెప్పిన వివరాల ప్రకారం భారత ప్రభుత్వం నెలకొల్పిన "సుఖ రక్షక్ "అడ్వైజర్ సిస్టమ్‌ ఈ ఏడాది వర్షపాతం అతి తక్కువగా ఉంటుందని మే 22‌వ తేదీనే సమాచారం ఇచ్చిందని పేర్కొంది."సుఖ రక్షక్ " దేశంలోని 22 భారతీయ భాషలలో ఈ విషయం ప్రకటించినట్లు అంతర్జాతీయ నీటి యాజమాన్య ఇన్‌‌స్టిట్యూట్ వారు పేర్కొన్నారు. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు సిద్ధం చేయకపోవటం దురదృష్టం. ఇందుకు రాష్ట్ర ప్రజానీకం మూల్యం చెల్లించాల్సి వస్తున్నది.

y.kesavarao ph.jpg

వ్యాసకర్త -సీనియర్ రైతు నాయకులు వై. కేశవరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్