గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅధ్యయనశీలి, నిర్మాణకర్త

1 గంట క్రితం

సోన్యా.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 06:20 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆకస్మికంగా కన్నుమూసిన ఐద్వా నాయకురాలు, విద్యావేత్త సోన్యా గిల్‌ (70) ప్రజల సమస్యలపై నిరంతరం పరితపించిన గొప్ప అధ్యయశీలి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నిర్మాణంలో క్రియాశీలక భాగస్వామి. తన జీవిత సహచరుడు, ప్రముఖ జర్నలిస్టు పి. సాయినాథ్‌తో కలిసి బుధవారం సాయంత్రం ముంబైలోని తమ ఇంటి సమీపంలో ఆమె నడకకు వెళ్లారు. కొంత అస్వస్థతగా అనిపించడంతో నడకను మధ్యలోనే ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ చివరి వరకు ఐద్వా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

​సోన్యా గిల్‌ జీవితం దాదాపు నాలుగు దశాబ్దాల మహిళా ఉద్యమంతో ముడిపడి ఉంది. యూనివర్సిటీ రోజుల నుంచే ఆమె ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తరువాత అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)లో చేరి క్షేత్రస్థాయి నుంచి సంస్థను నిర్మించారు. వర్లీ బీడీడీ చాళ్స్‌, జిజామాతా నగర్‌, డెలిసెల్‌ రోడ్‌ ప్రాంతాల్లోని మహిళల సమస్యలను తెలుసుకుంటూ, వారితో కలిసి పనిచేశారు. ఐద్వా ముంబై జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. కార్యకర్తల్లో సైద్ధాంతిక, సంస్థాగత కృషిని పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తరువాత మహారాష్ట్ర ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి భాషాపరమైన ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంస్థను బలోపేతం చేశారు. ఐద్వా కేంద్ర కార్యవర్గంలోనూ పనిచేశారు. 1994 నుంచి 32 ఏళ్ల పాటు ఆమెతో కలిసి పనిచేసిన మరియం ధవళే.. సోన్యా ఒక గొప్ప పోరాట యోధురాలని, అనారోగ్యంతో పోరాడుతూనే చివరి వరకు ఐద్వా కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు.

సోన్యా కార్మికుల, వ్యవసాయ హక్కుల కోసం పోరాడుతూనే మహిళల్లో లింగ సమానత్వ స్పృహ పెంపొందించేందుకు పనిచేశారు. ప్రజారోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ, మత సామరస్యం వంటి అంశాలపై అధ్యయనం చేశారు. ప్రజారోగ్య రంగంలో పరిశోధకురాలిగా, రచయిత్రిగా కూడా తన భాగస్వామ్యం అందించారు. 1999లో ముంబైలోని ఫౌండేషన్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ కమ్యూనిటీ హెల్త్‌ నుంచి ‘ఆసుపత్రి ఆధారిత పట్టణ ఆరోగ్య సేవలు’ అనే పుస్తకాన్ని రచించారు. అంతకుముందు ‘భారత ప్రజల ఆరోగ్య స్థితి: అందరికీ ఆరోగ్యం’ అనే గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ప్రజారోగ్య ఉద్యమంలో ఆమెతో కలిసి పనిచేసిన విభూతి పటేల్‌.. సోన్యాను ఆప్యాయమైన, సున్నితమైన, రాజకీయంగా బలమైన సహచరిగా గుర్తుచేసుకున్నారు. సోన్యా అందరితో కలిసిపోయి ఆప్యాయంగా పలకరించేవారు. కొత్తగా ఉద్యమంలోకి వచ్చిన వారికి కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల వీరోచిత పోరాట చరిత్రను వివరించేవారు. 1946 రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు సమయంలో కమల్‌ డోండే చేసిన పోరాటం, అహల్యా రంగ్నేకర్‌, విమలా రణదివే ఎదుర్కొన్న కాల్పులు వంటి ఘటనలను కార్యకర్తలకు ఉత్తేజపూరితంగా చెప్పేవారు.

​సోన్యా గిల్‌–పి. సాయినాథ్‌లది నలభై ఏళ్ల సహచర్యం. సాయినాథ్‌ గ్రామీణ భారతదేశంపై అధ్యయనం కొనసాగించడంలో సోన్యా అందించిన సహకారం ఎంతో కీలకం. సాయినాథ్‌ స్థాపించిన పీపుల్స్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా (PARI)కు ఆమె సహ వ్యవస్థాపకురాలుగా, ట్రస్టీగా ఉన్నారు. సాయినాథ్‌ తల్లి తరచూ ఆయనతో, “నువ్వు రాస్తావు కానీ అందుకు కావాల్సిన పని అంతా సోన్యానే చేస్తుంది!” అనేవారట. సోన్యా మరణంతో సాయినాథ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. “నలభై ఏళ్లు మేము కలిసి ఉన్నాం. సోన్యా లేని లోటును నేనెలా ఎదుర్కోవాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారని తిస్తా సెతల్వాద్‌ తన నివాళిలో రాశారు.

​సోన్యా గిల్‌ నిశ్శబ్దంగా పనిచేసిన మనిషి. దీర్ఘకాలిక అనారోగ్యం ఆమె శరీరాన్ని బలహీనపరిచినా ఉద్యమం పట్ల ఆమె సంకల్పాన్ని మాత్రం బలహీనపరచలేకపోయింది. తన అనారోగ్యం వల్ల ఎదురైన కష్టాల గురించి ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని సహచరులు చెబుతున్నారు. శ్రామిక, సామాన్య మహిళల మధ్య తిరుగుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, సమీకరిస్తూ, సంస్థను నిర్మిస్తూ సాగిన ఆమె జీవితం సహచరుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్