గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమోడీ సేవలో... పవనుడి తోవలో...

1 గంట క్రితం

Vijay.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 05:10 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

పవన్‌ ‌కల్యాణ్‌కు రాజకీయాల్లో పెద్ద పోటీదారు ఎదురవడం ఊహించని షాకే. అది కూడా అనుకోని వారి నుంచి. అదేదో వైసిపి నేత జగన్‌ ‌వంటి వారి నుంచి అనుకుంటే పోరబాటే. జగన్‌కు గుడ్‌‌ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకుంటానని బయిలుదేరిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నుంచి తనకు పోటీ వస్తుందని పవర్‌ ‌స్టార్‌ ‌ఊహించివుండరు కదా? కానీ అదే జరిగింది. చేగువేరాను వదలిపెట్టిన పవన్‌ ‌కల్యాణ్‌ రాజును మించిన రాజభక్తుడిలా సనాతన జపంతో ఊగిపోతుంటే ఆయనను మించిన పైత్యం నాదంటున్నాడు విజయసాయి. ఆ మాటకొస్తే పవన్‌ ఎ.పిలో బిజెపి నేతలు కూడా కేంద్రంలో మోడీ సర్కారు స్థాయిలో హిందూత్వ కోసం రెచ్చిపోవడంలేదని ఆయన కంప్లైంట్‌. తిరుపతిలో వెంకన్నను చూసుకుని నేరుగా గోదావరి తీరంలో దిగిపోయారు. అక్కడ ఎ.ఇ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య అందరినీ కలచివేసిన మాట తెలిసిందే కదా. వారిని పరామర్శించారు బాగానే వుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వేధింపుల హింసను కాస్త లవ్‌ ‌జిహాద్‌ అన్న దాకా తీసుకెళ్లారు. పైగా ఈ కేసులో నిందితుడైన దుర్మార్గాలకు పాల్పడిన సాదిక్‌ ‌ఖాన్‌‌కు మరో తొమ్మిదిమంది తోడున్నారని చెబుతున్నారు. సాదిక్‌ను మీరట్‌‌లో అరెస్టు చేసి తీసుకొచ్చిన పోలీసు ఎస్.పి బిందు మాధవ్‌ ‌చెప్పని ఈ మాట సాయిరెడ్డికెలా తెలిసింది? మత మార్పిడులను ఆపడానికి ఎ.పిలో యు.పి తరహా చట్టం తేవాలని మరో వాదన. జగన్‌ అధికారంలో వున్నప్పుడు మత మార్పిళ్లను అరికట్టకపోగా ప్రోత్సహించారని, క్రిస్టియానిటీని తప్ప హిందూమతాన్ని పట్టించుకోలేదని అంటూ ఆయన ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని తేల్చేశారు. హిందూత్వ లేదా మరేదైనా పైత్యం వంట పట్టించుకునే విషయంలో చంద్రబాబు, జగన్‌ ఎవరు వెనకబడినా మంచిది కదా. రాజకీయ మనుగడ కోసం మనుషులెంతగా మారిపోతారనడానికి ఇది తాజా ఎగ్జాంపులేనంటారా?

శభాష్‌ ‌కనగా..

తమిళ దర్శకుడు లోకేశ్ ‌కనగరాజ్‌ అరుదైన ఒక రికార్డు సృష్టించారు. దర్శకుడిగా తీసిన సినిమాలు కొన్నే గానీ విజయాలు సాధించడంలో మిన్నగా వుంటారు. విక్రమ్‌, మాష్టర్‌, లియో వంటి చిత్రాలు వాటిలో చెప్పుకోదగినవి. విజయ్‌, రజనీకాంత్‌, కమల్‌‌హాసన్‌ ‌వంటి వారికి దర్శకత్వం వహించిన కనగరాజ్‌ విజయాలను చూసి అల్లు అర్జున్‌ ‌కూడా ఆయనతో సినిమాకు రెడీ అయిపోయారు. అయితే ఇంతలోనే తనే ఒక సినిమాలో హీరోగా చేసి ఘన విజయం సాధించేశాడు. ‘డిసి’ అనే ఆ సినిమాకు మూలం మనకు సుపరిచితమైన ‘దేవదాసు’. ఇందులో వేశ్య పాత్ర ధిక్కారం చేస్తుంది. అరుణ్‌ ‌మాతేశ్వరన్‌ ‌దర్శకత్వంలో కనగరాజ్‌ ‌నటించిన ఈ సినిమా చాలా త్వరితంగా వందకోట్లు దాటేసి రికార్డు సృష్టించింది. రాజ్‌‌కపూర్‌, ఎన్.టి.ఆర్, భాగ్యరాజా, దాసరి వంటి హీరోలే దర్శకులుగా తమ సినిమాలు తీసుకోవడం మనకు తెలుసు. కానీ ఇతరుల చిత్రాల్లో నటించడం అరుదు. పైగా దర్శకులుగా ఘన విజయాలు సాధించిన కోడి రామకృష్ణ, ఎస్‌‌.వి. కృష్ణారెడ్డి వంటి వారు హీరోలుగా ప్రయత్నించి దెబ్బతిన్నారు. కానీ కనగరాజ్‌ ‌తొలి ప్రయత్నంలోనే వందకోట్లు దాటేయడం విశేషమే కదా... అది కూడా మరొకరి దర్శకత్వంలో! ఈ ఏడాది విజయ్‌ ‌నటించిన ‘జన నాయగన్‌’ను మినహాయిస్తే తమిళంలో ఇదే అత్యధిక వసూళ్లు తెచ్చిందట.

హలో చైనా.. హలో రష్యా!

మన మీడియాలో కొంతమందికి చైనా అంటే బొత్తిగా పడదు. పాలక పార్టీలు, ప్రభుత్వాలు తమ అవసరాల మేరకు వ్యవహరిస్తుంటాయేమో గానీ ఈ బడా చోటా మీడియా మాత్రం చైనాపై విషం కక్కడానికి అహరహం పనిచేస్తుంటుంది. ప్రపంచంలోనే చరిత్ర కలిగిన ఈ రెండు ఇరుగు పొరుగు మహాదేశాలు కలసి మెలసి వుండాలని ఎవరైనా కోరుకోవాలి. అది ప్రపంచానికే మంచిది. వీరికి రష్యా కూడా తోడైతే ఆ కథే వేరు. కానీ స్వార్థ రాజకీయ శక్తులకూ, ఆధిపత్య శక్తులకు అది మింగుడుపడదు. మీరు కాస్త నిశితంగా పరిశీలిస్తే రెండు దేశాల మధ్య ఏ కాస్త తేడా వచ్చినా చాలా ప్రచారం చేస్తాయి గానీ మంచిగా దగ్గరైతే అలా చెప్పవు. కనీసం ఇంగ్లీషు మీడియా చెప్పిన మేరకైనా తెలుగు మీడియా చెప్పదు. వచ్చే నెల జరిగే బ్రిక్స్‌ ‌సమావేశం కోసం భారత దేశ ప్రత్యేక ప్రతినిధి అజిత్‌ ‌దోవల్‌ ‌చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకుని మాట్లాడారు. సమస్యలు పరిష్కరించుకుని సన్నిహితంగా మెలగాలనే సంక్పలం ప్రకటించారు. ఇరాన్‌‌పై అమెరికా దురాక్రమణతో మారిన సన్నివేశంలో తమ మధ్య సఖ్యత కీలకమని ఏకాభిప్రాయానికి వచ్చారు ఇరు నాయకులు. దీనిపై బోలెడు వివరాలు, సమాచారం వచ్చినా మన వాళ్లకు పట్టదు. ఇప్పుడే సరిగ్గా వెతికి వెతికి మరీ ఏవో చిన్న చిన్న సందేహాల సృష్టికి తంటాలు పడుతుంటారు. బ్రిక్స్‌ ‌కోసం చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ ‌కూడా రానుండటం గొప్ప సందర్భం అవుతుందని నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో చైనా తాను ఇరాన్‌‌కు పూర్తి మద్దతుగా వుంటానని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌రష్యాలో పుతిన్‌‌ను కూడా కలిసి మాట్లాడారు. ఆ దేశంతో మన వాణిజ్య లోటు చాలా ఎక్కువగా వున్న సంగతి చెబితే పుతిన్‌ లైట్‌ అన్నట్టు మాట్లాడారు. ఈ మూడు కీలక దేశాలు ఒక తాటిపైకి వస్తే ... అన్నది చాలా కాలంగా పరిశీలకులను ఊరిస్తున్న ప్రశ్న. ఇప్పుడది పాక్షికంగానైనా జరుగుతుందన్నమాట. అందుకే ట్రంపాసురుడు గంగవెర్రులెత్తి పోతున్నారు.

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్