అమెరికా రాజకీయాల్లో మరొక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన కొద్ది కాలానికే మరో డెమోక్రటిక్ సోషలిస్టు నాయకురాలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమె జనీస్ లూయిస్ జార్జ్. వయసు 38 ఏళ్లు. కార్మిక కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె చిన్నప్పటి నుంచే సామాజిక అసమానతలను దగ్గరగా చూశారు. కార్మికుల హక్కుల కోసం పోరాడారు. అద్దె ఇళ్లలో నివసించేవారి సమస్యలపై గళమెత్తారు. న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ ప్రజల నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో కీలకమైన రాజధాని నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇళ్ల అద్దెలు, పిల్లల సంరక్షణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు వంటి సామాన్యుల సమస్యలను ఎన్నికల ప్రధాన ఎజెండాగా మార్చి విజయం సాధించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ‘కమ్యూనిస్టు’ అంటూ బహిరంగంగా వ్యతిరేకించినా ఓటర్లు మాత్రం ఆమెకు పట్టం కట్టారు.
జనీస్ లూయిస్ జార్జ్ 1988 ఏప్రిల్ 30న వాషింగ్టన్ డీసీలో జన్మించారు. ఆమె కుటుంబానికి ఆ నగరంతో మూడు తరాల అనుబంధం ఉంది. తల్లి పోస్టల్ యూనియన్‌లో పనిచేసేవారు. తండ్రి శ్రామిక నేపథ్యం నుంచి వచ్చినవారు. నానమ్మ ఆలిస్ డీల్ మిడిల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం వడ్డించే ఉద్యోగిగా పనిచేశారు. సాధారణ కుటుంబంలో పెరిగిన జనీస్కు చిన్నతనం నుంచే కార్మికుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అంతరాలు పరిచయమయ్యాయి. తల్లి కార్మిక సంఘాల సమావేశాలకు తీసుకెళ్లడం వల్ల కార్మికుల హక్కులు, యూనియన్ల పోరాటాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. సమాజంలో కొందరికి అపారమైన సంపద, మరికొందరికి కనీస అవసరాలు కూడా అందని పరిస్థితి ఎందుకు ఉందన్న ప్రశ్న ఆమెలో చిన్నప్పుడే మొదలైంది. స్థానిక పాఠశాలల్లో చదువుకున్న ఆమె, హైస్కూల్ రోజుల్లోనే డీసీ స్కూల్ బోర్డ్‌లో విద్యార్థి ప్రతినిధిగా, వైఎంసీఏ యూత్ మేయర్‌గా పనిచేశారు. 2005-06లో యూత్ మేయర్‌గా ఉన్నప్పుడు నేషనల్స్ పార్క్ స్టేడియం నిర్మాణం కోసం నిరుపేదలు నివాసాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారికి పునరావాసం కల్పించాలని కోరుతూ యువతరఫున చట్టపరమైన ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. చిన్న వయసులోనే ప్రజల నివాస హక్కు కోసం గొంతెత్తడం ఆమె రాజకీయ ప్రయాణానికి తొలి అడుగుగా నిలిచింది.
అనుభవాలే పాఠాలు
న్యూయార్క్‌లోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీలో ప్రభుత్వ వ్యవహారాలు, రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన జనీస్, 2011లో లాస్ ఏంజెలెస్‌లో అమెరికాకార్ప్స్ సిటీ ఇయర్ కార్యక్రమంలో వాలంటీర్‌గా పనిచేశారు. వెనుకబడిన విద్యార్థులకు చదువులో సహాయం చేశారు. అనంతరం హోవార్డ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. తన చదువు ఖర్చుల కోసం రెస్టారెంట్లో వెయిట్రెస్‌గా, రిటైల్ దుకాణంలో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా పనిచేశారు. చదువు పూర్తయ్యాక ఫిలడెల్ఫియాలో న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం వాషింగ్టన్ డీసీ అటార్నీ జనరల్ కార్యాలయంలో బాలనేరాల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. బాలనేరస్థులకు కేవలం శిక్షలు విధించడం కాకుండా, వారిలో పరివర్తన తీసుకురావడానికి పునరావాసం, బాధ్యత స్వీకరణ, బాధితులకు న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చే 'రెస్టోరేటివ్ జస్టిస్' విధానాలపై పనిచేశారు.
సోషలిస్టు భావాల వైపు...
జనీస్ రాజకీయ ఆలోచనలపై కుటుంబ నేపథ్యంతోపాటు వ్యక్తిగత అనుభవాలు కూడా ప్రభావం చూపాయి. ముఖ్యంగా లా చదువుతున్న సమయంలో ఆమె కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని అద్దె పెంచడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. కష్టపడి పనిచేసే కుటుంబం కూడా కేవలం అద్దె పెంపు కారణంగా నివాసాన్ని కోల్పోవాల్సి రావడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక హక్కు అని భావించారు. ఈ అనుభవాల నేపథ్యంలో డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా (DSA)లో చేరారు. కార్మికుల హక్కులు, అందుబాటు ధరల్లో గృహాలు, నాణ్యమైన విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి అంశాలపై దృష్టి సారించారు. డెమోక్రటిక్ సోషలిజం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఆర్థిక, సామాజిక అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వ విధానాలను ఉపయోగించడం. సంపద, అవకాశాలు కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని అందరికీ అందుబాటులో ఉండాలన్నది ఈ భావజాలంలోని ప్రధాన లక్ష్యం.
2020లో వాషింగ్టన్ డీసీ కౌన్సిల్‌లోని వార్డ్-4 నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చురుగ్గా పనిచేశారు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో నివసించేవారి హక్కుల కోసం పోరాడారు. ఈ నేపథ్యంలో 'హౌసింగ్ విత్ ఇంటిగ్రిటీ యాక్ట్'ను ప్రవేశపెట్టారు. అద్దెదారులకు భద్రత కల్పించడం, ఇళ్ల యజమానుల బాధ్యతను పెంచడం దీని లక్ష్యం. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై పోరాడే నాయకురాలిగా గుర్తింపు పొందారు.
ప్రజల ఎజెండా..
వాషింగ్టన్ డీసీలో ఇళ్ల అద్దెలు, పిల్లల సంరక్షణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు సామాన్య కుటుంబాలకు భారంగా మారాయి. వీటినే జనీస్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలుగా మార్చుకున్నారు. ఐదేళ్లలో 72 వేల గృహ నిర్మాణ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా ప్రకటించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ సరసమైన అద్దెలతో ఇళ్లు నిర్మించడం, అద్దెదారుల హక్కులను బలోపేతం చేయడం, ఇళ్ల నిర్మాణానికి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం వంటి ప్రతిపాదనలు చేశారు. వాషింగ్టన్ డీసీలో చైల్డ్‌కేర్ ఖర్చులు అమెరికాలోనే అత్యధికంగా ఉన్నాయి. కుటుంబ ఆదాయంలో ఏడు శాతానికి మించి పిల్లల సంరక్షణ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సబ్సిడీలు కల్పిస్తామని ప్రకటించారు. పిల్లలకు విద్యాబోధన చేసే చైల్డ్‌కేర్ ఎడ్యుకేటర్ల వేతనాలు పెంచేందుకు పే ఈక్విటీ ఫండ్‌ను బలోపేతం చేస్తామని చెప్పారు. తుపాకీ హింసను అరికట్టేందుకు పోలీసు చర్యలతోపాటు యువతకు ఉద్యోగ శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతిపాదించారు. వలసదారుల హక్కుల పరిరక్షణకు కూడా ప్రాధాన్యమిచ్చారు. ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. నగరం సోషలిస్టుల చేతుల్లోకి వెళ్లకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె గెలిస్తే నగర పరిపాలనపై కేంద్ర ప్రభుత్వ జోక్యం పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికలూ చేశారు. అయినా, నవంబర్ 3న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. 82 శాతానికి పైగా ఓట్లు సాధించి ప్రత్యర్థులపై భారీ ఆధిక్యం కనబరిచారు. జనవరి 2, 2027న మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.








కామెంట్లు (0)