'ముగ్గురు అమ్మాయిలను ఎలా పెంచుతారు?` అని కొన్ని దశాబ్దాల క్రితం ఓ కుటుంబానికి ప్రశ్న ఎదురైంది. ట్రక్కు డ్రైవరుగా కూతుళ్లను పోషించడానికే దిక్కులేని ఆ తండ్రి ఆ రోజు కుమిలికుమిలి ఏడ్చివుంటాడు.. కానీ ఈ రోజు ఆ తండ్రి గురించే కాదు.. దేశం మొత్తం ఆ కుటుంబం గురించి మాట్లాడుకుంటోంది. జపాన్ నగోయాలో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో రన్నింగ్ విభాగంలో పోటీపడి ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు పతకాలను సొంతం చేసుకుంది 27 ఏళ్ల విథ్యా రామరాజన్. జాతీయ రికార్డును సైతం బద్దలుకొట్టిన ఆమె విజయం వెనుక ఆకలిని చంపుకుని బిడ్డలకు అన్నం పెట్టిన తండ్రి కథ ఉంది. అవమానాలు దాటుకుని కూతుళ్లను ఉన్నతంగా నిలబెట్టిన అమ్మ ధైర్యం ఉంది.
తమిళనాడు వలుక్కపరై పంచాయతి మీనాక్షిపురంలో పుట్టి పెరిగిన విథ్య పదేళ్ల వయసు నుండే పరుగుపోటీల్లో పాల్గొనేది. అప్పుడు తనను చూసిన వాళ్లు.. ‘మీ అమ్మాయి పి.టి ఉష లా పరుగెడుతుందే!` అనేవాళ్లు. విథ్య మాత్రం వాళ్ల అమ్మతో.. ‘పి.టి ఉష లా కాదు.. ఆమె కంటే వేగంగా పరుగెడతాను చూడు` అనేది. చిన్న వయసులో తన లక్ష్యం ఏంటో నిర్దేశించుకున్న విథ్య దాన్ని చేరుకునేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడింది. అయినా ఎక్కడా తన ఆశయం వదులుకోలేదు. విజయం సాధించేవరకు 'పరుగు` పెడుతూనే ఉంది.
ఈ ఆసియా క్రీడల్లో విథ్య వరుసగా మూడు రంగుల పతకాలు సాధించింది. మహిళల 4×400 మీటర్ల రిలేలో స్వర్ణం, మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో కాంస్యం గెలుచుకుని తన విజయాల వెనుక ఉన్న అమ్మానాన్న కష్టాన్ని ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు విథ్య విజయం గురించి చర్చించుకుంటున్న వాళ్లంతా ఆమె తండ్రి రామరాజు గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. కూతురు విజయం గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంటే.. రామరాజు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. బాల్యంలో కూతురు చేసిన పనులను గుర్తుకుతెచ్చుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ‘రెండేళ్లప్పుడు దాగుడు మూతలు ఆడుతూ మమ్మల్ని పరుగులు పెట్టించేది. తనంతట తాను బయటకు వచ్చేదాక మేము తనను కనిపెట్టలేకపోయేవాళ్లం. ఏదైనా అనుకున్నదంటే అంతలా సాధిస్తుంది. ఇప్పుడు దేశం గర్వపడేలా చేసింది. ఇంతలా ఎదిగిన తనను చూస్తుంటే.. నాకు చాలా గర్వంగా ఉంది` అని రామరాజు ఎంతో ఉద్విగ్నంగా మాట్లాడారు. విథ్య కవల సోదరి నిత్య కూడా అథ్లెట్ గా రాణించారు. అయితే విథ్య లక్ష్యం చేరుకోవడం కోసం తన కెరియర్ ను పక్కన పెట్టి విథ్యకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడ్డారు. చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న కూతుళ్లను మంచి హాస్టల్లో చేర్పించమని టీచర్లు చెప్పడంతో 5వ తరగతి చదువుతున్న కూతుళ్లను ప్రభుత్వ హాస్టల్ లో చేర్పించారు రామరాజు. చదువు, వసతి ఉచితమే అయినా పిల్లలు పరుగుపెట్టేందుకు రన్నింగ్ షూ కొనడానికి ఆ తండ్రి దగ్గర డబ్బులు ఉండేవి కావు. అదనపు డబ్బులు కోసం ఎక్కువ పనిగంటలు చేసేవాడు.
తండ్రి పడ్డ కష్టాన్ని విథ్య గుర్తుచేసుకుంటూ 'నాన్న మా కోసం ఎంత కష్టపడేవారో అప్పుడు మాకు అర్థం అయ్యేది కాదు. క్రీడల్లో రాణిస్తున్న మాకు మంచి ఆహారం పెట్టేందుకు తను ఒక పూట భోజనం మానేసేవాడు. టీ, బిస్కెట్లు తాగి కడుపునింపుకునేవారు. ఆ రోజుల్లో భోజనం ఖరీదు రూ.10 నుండి రూ.50 వరకు ఉండేది. వాటిని కూడబెట్టేందుకే నాన్న భోజనం మానేసేవాడు` అని ఒక ఇంటర్వ్యూలో విథ్య చెప్పింది. తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగిన విథ్య, నిత్య క్రీడల్లో, చదువులో రాణించి ప్రభుత్వంలో ఉన్నత కొలువులు సాధించారు. వాళ్ల అక్క సత్య (30)కు వివాహం అయ్యింది.
విథ్య ప్రయాణంలో ఆర్థిక కష్టాలే కాదు. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అథ్లెట్ గా రాణించేందుకు హాస్టల్ లో చేరిన విథ్య జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా రాణించింది. 2018లో ఎన్ఐఎస్ పాటియాలాలోని జాతీయ శిబిరంలో శిక్షణకు వెళ్లింది. అయితే అక్కడ సరైన ఆహారం దొరికేది కాదు. హిందీ రాకపోవడంతో పాటు కోవిడ్ బారిన పడింది. అపెండిసైటిస్ సర్జరీ జరిగింది. చివరికి ఆ శిబిరాన్ని విడిచిపెట్టి కోచ్ నెహ్ పాల్ సింగ్ రాథోర్ దగ్గర స్వతంత్ర శిక్షణ తీసుకుంది. అయితే శిబిరం వదిలి రావడంతో శిక్షణ, ఆహారం, వసతి అన్నీ తన సొంత ఖర్చులే వినియోగించాల్సి వచ్చేది. ఇది విథ్యకు చాలా భారంగా ఉండేది. అప్పుడు నిత్య ఉద్యోగం చేసి ఆ ఖర్చులు భరించింది.
పతకాలు
2022 హాంగ్ జౌ ఆసియా క్రీడల్లో రెండు రజతాలు, ఒక కాంస్య పతకం, 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో 400 మీటర్ల హర్డిల్స్ లో కాంస్యం పతకం సాధించిన విథ్య, ప్రస్తుత ఆసియా పోటీల్లో పి.టి ఉష రికార్డును బద్దలుకొట్టింది. 55.42 సెకన్లతో పీటీ ఉష రికార్డు సమం చేసిన విద్య 01.51 సెకన్ల కంటే తక్కువ టైమింగ్‌లోనే 54.57 సెకన్లలోనే హర్డిల్స్‌ను దాటి లక్ష్యాన్ని చేరుకుంది.
ఆసియా క్రీడల్లో విజయం సాధించిన విథ్య ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘అమ్మానాన్న ఆ రోజు మమ్మల్ని హాస్టల్లో చేర్పించినప్పుడు మేం ఈ స్థాయికి చేరుకుంటామని ఊహించలేదు. పోటీల్లో పాల్గొనే ఆర్థిక స్థోమత లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయినా నిలబడ్డాం. పతకాలు చేజారుతున్నా నిరుత్సాహపడకుండా పరుగు పెట్టాం. జాతీయ రికార్డు బద్దలు కొట్టేంత వరకు నేను ఆ పరుగు ఆపలేదు. 2028 ఒలింపిక్స్ లో పతకం వచ్చేవరకు ఈ పరుగు వదిలిపెట్టను. రికార్డులు బద్దలు కొట్టడం నాకు సాధ్యమైంది. నాలాంటి ఎందరో అమ్మాయిలకు కూడా ఇది సాధ్యమే.. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అప్పుడే కూతుళ్లు ఎక్కడైనా విజయం సాధిస్తారు.. సాధిస్తూనే ఉంటారు` అని చెప్పింది.







కామెంట్‌లు (0)