ప్రెస్ కార్డులున్నా ఈడ్చుకెళ్లి.. ఫోన్లు లాక్కున్న పోలీసులు
వీడియోలు తొలగించాలని ఒత్తిడి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛపై మరోసారి అత్యంత క్రూరమైన, తీవ్రమైన దాడి జరిగింది. 13 కోట్ల మందికి పైగా ఓటర్లను తొలగించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శని, ఆదివారాల్లో జంతర్‌మంతర్ పరిసరాల్లోనే కాకుండా, నిరసన స్థలానికి కిలోమీటర్ల దూరంలోనూ జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ ఐడీ కార్డులు చూపించి, జర్నలిస్టులమని చెప్పినా వినిపించుకోలేదు. మహిళా జర్నలిస్టులను సైతం బట్టలు పట్టుకుని ఈడ్చుకెళ్లడం, తోసేయడం, దుర్భాషలాడటం, ఫోన్లు లాక్కోవడం, పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలను తొలగించాలని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
స్వతంత్ర మీడియా సంస్థల జర్నలిస్టులు శనివారం జంతర్‌మంతర్ చేరుకోకముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గంలోని బిజెపి కార్యాలయం వెలుపల సుమారు 60 మంది నిరసనకారులు గుమిగూడారు. ఈ పరిణామాలను స్క్రోల్ వార్తా సంస్థ విలేకరి ఆయుష్ తివారీ చిత్రీకరిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియా టుడే జర్నలిస్టులు, తనతో సహా సుమారు 30 మందిని బస్సులో ఎక్కించారని తివారీ వివరించారు. హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ వద్ద నిరసనకారులపై దాడి ఘటనలను చిత్రీకరిస్తున్న తనను అదుపులోకి తీసుకోవాలని ఓ పోలీసు అధికారి ఆదేశించినట్లు తివారీ చెప్పారు. తనను బలంగా బస్సులోకి తోసేయడంతో నడుముపై గాయమైందని, చొక్కా పూర్తిగా చిరిగిపోయిందని వివరించారు.
మహిళా జర్నలిస్టునూ ఈడ్చుకెళ్లిన పోలీసులు
బిజినెస్ స్టాండర్డ్ జర్నలిస్టు అనుష్క భరద్వాజ్‌ను బ్యాగు, దుస్తులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. తాను జర్నలిస్టునని చెప్పినప్పుడు పోలీసులు వదిలేశారని, కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి మళ్లీ అదుపులోకి తీసుకున్నారని అనుష్క తెలిపారు. 'ఇక చాలు.. చాలా సేపటి నుంచి జర్నలిస్టునని చెబుతున్నావు' అంటూ తనను ఈడ్చుకెళ్లారని ఆమె పేర్కొన్నారు. తన చొక్కా పైకి జరిగిపోతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి బయటే స్క్రోల్ విలేకరి నిర్బంధం
స్క్రోల్ ఉద్యోగి, జర్నలిస్టు షోయబ్ డానియల్‌ను జంతర్‌మంతర్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఢిల్లీలోని తన ఇంటి సమీపంలో అదుపులోకి తీసుకున్నారని ఆ సంస్థ ఎడిటర్ సుప్రియా శర్మ ఎక్స్‌లో పోస్టు చేశారు. సిఆర్ పార్క్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తామని చెప్పి, ఆగి ఉన్న బస్సులో కూర్చోబెట్టారని డానియల్ వివరించారు. బస్సులో నుంచే పోలీసుల చర్యలను వీడియో తీస్తుండగా, ఆ దృశ్యాలను తొలగించాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఓ ఇన్‌స్పెక్టర్ తనను పోలీసు వాహనంలోకి తీసుకెళ్లాలని ఆదేశించడంతో వాహనంలోకి ఎక్కించారని సీనియర్ జర్నలిస్టు పరంజోయ్ గుహా ఠాకుర్తా చెప్పారు.
ఢిల్లీలోని ఐఎన్ఎ మార్కెట్ ప్రాంతంలో రాయిటర్స్ జర్నలిస్టు సౌరభ్ శర్మను కూడా కొద్దిసేపు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేరు సూచించే ట్యాగ్ లేని, ముఖానికి ముసుగు ధరించిన పోలీసు అధికారి తనను ఈడ్చి, తన్నినట్లు ఆయన చెప్పారు. మోలిటిక్స్ అనే డిజిటల్ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టును బస్సులోకి ఎక్కించే ముందు పోలీసులు తోసివేశారు. న్యూస్‌లాండ్రీకి చెందిన అశ్వినే కుమార్ సింగ్, అస్తా సవ్యసాచి, అన్మోల్ ప్రీతమ్, ఇంటర్న్ అన్షులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్మోల్, అన్షుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అశ్విన్‌ను తోసివేసి ఆయన ఫోన్‌ను లాక్కున్నారు. మీడియా ప్రతినిధులమని జర్నలిస్టులు చెప్పినప్పుడు 'కోయీ మీడియా నహీ హై' (ఇక్కడ మీడియా లేదు) అని పోలీసులు సమాధానమిచ్చినట్లు న్యూస్‌లాండ్రీ పేర్కొంది. అనంతరం వారిని ఉత్తర ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. నవభారత్ టైమ్స్ జర్నలిస్టులు హృతిక్ జోషి, రాహుల్ చరస్‌లను కూడా పోలీసులు నిర్బంధించారు. రాహుల్‌తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిని దరియాగంజ్‌కు తీసుకెళ్లారని పత్రిక ఎడిటర్ ఆశిష్ పాండే ఎక్స్‌లో తెలిపారు. బూమ్‌లైవ్ రిపోర్టర్ జాగృతి త్రిషను అదుపులోకి తీసుకున్నారని ఆ సంస్థ ఎడిటర్ జెన్సీ జాకబ్ వెల్లడించారు. ఇండియా టుడే డిజిటల్ వీడియో బ్రాండ్ 'మో'లో పనిచేస్తున్న శివాంగ్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను జర్నలిస్టునని పదేపదే చెప్పినా బస్సులోకి తోశారని, కొట్టారని ఆయన పేర్కొన్నారు. నిరసనను కవర్ చేస్తున్న 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హిందీ'కి చెందిన ముగ్గురు జర్నలిస్టులు శాశ్వత్, సియా, విజయ్, హిందూస్తాన్ టైమ్స్, మెట్రిక్ న్యూస్, కేరళ న్యూస్ ఛానల్స్ రిపోర్టర్ టీవి, 24 న్యూస్ జర్నలిస్టులతో సహా ఏడుగురిని ఆర్‌కె ఆశ్రమం వద్ద ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విద్యార్థి సంఘాల ఆందోళనను కవరు చేస్తోన్న జర్నలిస్టులను అరెస్టు చేశారు.








కామెంట్‌లు (0)