విద్యార్థులు, యువకులపై పైశాచిక దాడి
ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడి కంటి నుంచి రక్తస్రావం
పలువురికి తీవ్రగాయాలు
కేంద్ర బలగాల బీభత్సం.. విద్యార్థులు, యువజనులపై విచక్షణారహిత దాడులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలను అణచివేసేం దుకు కేంద్ర బలగాలు, పోలీసులు ఆదివారం తీవ్ర నిర్బంధానికి పాల్పడ్డాయి. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఆందోళన చేసిన విద్యార్థులు, యువకులపై పోలీసులు, భద్రతా బలగాలు పైశాచికంగా దాడి చేశాయి. సిజెపి, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కన్నాట్ ప్లేస్‌లో నిరసన జరిగింది. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ రెండో గేటు సమీపం నుంచి జంతర్ మంతర్ వైపు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. పాలికా బజార్ ప్రాంతానికి చేరుకోగానే కేంద్ర బలగాలు, పోలీసులు ఒక్కసారిగా ఆందోళన కారులపై విరుచుకుపడ్డారు. నాయకులను, కార్యకర్తలను చుట్టుముట్టి కొట్టడంతో పాటు పోలీసు వాహనాల్లోకి ఈడ్చుకెళ్లారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజి, డివైఎఫ్‌ఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు జైక్ సి. థామస్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఆదర్శ్ కంటి సమీపంలో గాయమై రక్తం కారింది. జైక్ సి. థామస్, డివైఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యుడు బాలేందర్ షాలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్ ఇళమణ్, కేంద్ర కమిటీ సభ్యుడు అభిజిత్ మణిలాల్, ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిమ్రాన్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు శరణ్య కూడా ఈ దాడుల్లో గాయపడ్డారు. ఎఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి దినేశ్ సీరంగరాజ్ దుస్తులను సైతం చించివేశారు. సిజెపి నాయకుడు సుధీర్ సాంగ్వాన్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీఘోష్‌ను కూడా అరెస్టు చేశారు. నిరసనకారులను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లో పడేయడంతో పాటు, వాహనాల్లోనూ తీవ్ర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు.

రోడ్లపై బలగాల కవాతు
కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులతో పాటు సిఆర్‌పిఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్), ఎస్‌ఎస్‌బి, ఐటిబిపి బలగాలను భారీగా మోహరించారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ గేట్ల సమీపంలో భద్రతా సిబ్బంది కవాతు నిర్వహించారు. అయినప్పటికీ నిరసనకారులు భద్రతా ఏర్పాట్లను దాటుకుని జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టుల కోసం సాధారణ ప్రయాణికుల రవాణాకు ఉపయోగించే బస్సును పోలీసు వాహనంగా మార్చారు. వాహనాలు సరిపోకపోవడంతో ఉత్తరప్రదేశ్ నుంచి మరిన్ని వాహనాలను రప్పించారు. పాలికా బజార్ రోడ్డు నుంచి అరెస్టయిన వారితో బయలుదేరిన బస్సును కొంతదూరం వెళ్లాక మళ్లీ కన్నాట్ ప్లేస్‌లోనే నిలిపివేశారు. అక్కడ పురుష ఆందోళనకారులను సెల్ గదులున్న మరో బస్సులోకి మార్చారు. ఈ సమయంలో బస్సు తలుపులు మూసివేసి కేంద్ర బలగాలు వారిపై దాడి చేశారు.

మహిళా సంఘం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యురాలు ఆనీ రాజాను కూడా అరెస్టు చేశారు. దిశ, రివల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, క్రాంతికారి యువ సంఘటన్ తదితర సంస్థలు కూడా నిరసనల్లో పాల్గొన్నాయి. అరెస్టయిన కార్యకర్తలను పోలీసు వాహనాల్లోకి ఎక్కించి దాడులు చేశారు. అనంతరం వారిని ఢిల్లీ సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లు, మైదానాలకు తరలించారు.
ఆర్‌కె ఆశ్రమ్ మెట్రో స్టేషన్ సమీపం నుంచి ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్ఎ కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎ అఖిల భారత అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు పలువురిని అరెస్టు చేశారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత ఎస్‌ఎఫ్‌ఐ మహిళా కార్యకర్తలు జాతీయ పతాకాలతో కన్నాట్ ప్లేస్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్, ఢిల్లీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెహినా ఫాతిమా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు సఖి బంధు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని చీకటి పడిన తరువాత లైట్లు లేని వాహనాల్లో విద్యార్థినులను తరలించారు. అందులో మగ పోలీసులు విద్యార్థినులపై దాడి చేశారు.








కామెంట్‌లు (0)