గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆశావాదం.. ఆయుష్షుకు బలం!

4 గంటల క్రితం

One-Love-Malibu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

మనిషి ఎంతకాలం జీవిస్తాడో జన్యువులు, మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు.. అతని మనస్తత్వం కూడా కొంతవరకు నిర్ణయిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆశతో జీవించడం, సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టడం, రేపటి మీద నమ్మకంతో ముందుకు సాగడం వంటి ఆశావాద దృక్పథం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు.. జీవితకాలాన్ని కూడా పెంచగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ అంశానికి హాలీవుడ్ నటుడు, డ్యాన్సర్ డిక్ వాన్ డైక్ జీవితం ఓ ఉదాహరణగా నిలుస్తోంది. 2025 డిసెంబర్‌ 13న ఆయన తన వందో పుట్టినరోజును జరుపుకున్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆశావాదం, దీర్ఘాయుష్షు మధ్య ఉన్న సంబంధంపై మరోసారి చర్చకు దారితీశాయి.

ఆశే ఆయుష్షు

'100 Rules for Living to 100' పేరుతో డిక్ వాన్ డైక్ తన వందో పుట్టినరోజు సందర్భంగా ఓ పుస్తకాన్ని ప్రచురించారు. 'నేను ఎప్పుడూ అసహనంగా, ఒత్తిడితో నిద్ర లేవలేదు' అని అందులో పేర్కొన్నారు. నిత్యం చురుకుగా ఉండడం, ఇష్టమైన పని చేస్తూ ఉండడం, జీవితాన్ని ఆనందంగా స్వీకరించడమే తన ఆరోగ్యానికి, దీర్ఘాయుష్షుకు కారణమని చెప్పారు. ఇవి వ్యక్తిగత అనుభవాలుగా అనిపించినా, శాస్త్రీయ అధ్యయనాలు కూడా వాటిని సమర్థిస్తున్నాయి. 2025లో 'ది కన్వర్సేషన్‌' వెబ్‌సైట్‌లో ఆరోగ్య శాస్త్రవేత్త జోలాంటా బర్క్ రాసిన వ్యాసంలో డిక్ వాన్ డైక్ వంటి ఆశావాదులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఆమె 1930లో ప్రారంభమైన 'నన్ స్టడీ'ని ప్రస్తావించారు. నన్‌లుగా మారిన కొంతమంది మహిళలను వారి జీవితకథలు రాయమని కోరారు. ఆరు దశాబ్దాల తరువాత వాటిని విశ్లేషించగా, సానుకూల భావోద్వేగాలను ఎక్కువగా వ్యక్తం చేసిన వారు సగటున పదేళ్లు ఎక్కువ కాలం జీవించినట్లు పరిశోధకులు గుర్తించారు.

జీవన

​పరిశోధనల సాక్ష్యం

ఆశావాదం అంటే కేవలం సానుకూలంగా ఆలోచించడం మాత్రమే కాదు. జీవితంలో సంతృప్తిని అనుభవించడం కూడా. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన మానవాభివృద్ధి అధ్యయనాల్లో ఒకటి 1938 నుంచి కొనసాగుతోంది. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా సాగుతున్న ఈ అధ్యయనంలో వందలాది పరిశోధనా పత్రాలు, ప్రశ్నావళులు, వైద్య పరీక్షలు, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. సంతోషకరమైన సంబంధాలు, జీవితంపై సంతృప్తి, ఆశావహ దృక్పథం ఉన్నవారు వృద్ధాప్యంలో మెరుగైన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. 2019లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో నిర్వహించిన మరో అధ్యయనం కూడా ఇదే విషయాన్ని బలపరిచింది. ఆశావాద దృక్పథం కలిగినవారికి సగటున 15 శాతం ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. రెండు పెద్ద జనాభా సమూహాలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో అధిక ఆశావాదం కలిగిన వారికి 'అసాధారణ దీర్ఘాయువు' (85 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించడం) సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

​సంబంధాలే సంపద

యుక్తవయసులో స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు పెంచుకున్న వారు 80 ఏళ్ల వయసులోనూ మెరుగైన ఆరోగ్యంతో జీవిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. వారికి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉండటమే కాకుండా, అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. దీనికి ఖచ్చితమైన కారణాన్ని ఇంకా నిర్ధారించలేదు. అయితే మంచి సామాజిక సంబంధాలు రోజువారీ ఒత్తిడి, ఆందోళనల ప్రభావాన్ని తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 90 ఏళ్ల వయసును చేరుకోవడంలో దాదాపు 30 శాతం వరకు జన్యుపరమైన అంశాలు, 70 శాతం వరకు జీవనశైలి ప్రభావం చూపుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగిన నిద్రతో పాటు ఆశావహ దృక్పథం కూడా ఇందులో భాగమే. ఈ దృక్పథం అలవడడంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆప్తుల ప్రోత్సాహం ఉపయోగపడుతుంది. అలాగే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉండటం కూడా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుందని అమెరికా అధ్యయనాలు సూచిస్తున్నాయి. 50 ఏళ్లు దాటిన తరువాత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న చాలామందికి అర్థవంతమైన జీవిత లక్ష్యాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

​నూరేళ్ల ఆయుష్షుకు ఎవరూ హామీ ఇవ్వలేరు. అలాగే ఆశావాద దృక్పథమే ఒక్కటే దీర్ఘాయుష్షుకు కారణమని కూడా చెప్పలేం. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి సామాజిక సంబంధాలు, జీవితంపై సంతృప్తి, ఆశావహ దృక్పథం కలిసి దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశాలను పెంచుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, మనసునూ అంతే ఆరోగ్యంగా ఉంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్