- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్లీ పెరిగిన చమురు ధరలు
వాషింగ్టన్/దోహా: మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడుల అనంతరం ముడి చమురు ధరలు 7 శాతం పెరిగి బ్యారెల్‌కు 75.38 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ ధరలు 8 శాతం ఎగసి బ్యారెల్‌కు 80.09 డాలర్లకు చేరాయి. జూన్ 23 తర్వాత చమురు ధరల్లో నమోదైన అత్యధిక పెరుగుదల ఇదే. చమురు ధరల పెరుగుదల ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. జపాన్, దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. యుద్ధం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, మధ్యప్రాచ్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 20కి పైగా యుద్ధనౌకలు గస్తీ నిర్వహిస్తున్నట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.
మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా భారతదేశానికి ఎల్‌ఎన్‌జీని తీసుకువెళ్తున్న అల్ రఖాయత్ ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిని ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) తీవ్రంగా ఖండించాయి. ఈ దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనికి ఇరాన్ పూర్తి బాధ్యత వహించాలని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ పేర్కొన్నారు. నిరసన తెలిపేందుకు ఖతార్‌లోని ఇరాన్ డిప్యూటీ రాయబారిని విదేశాంగ శాఖ పిలిపించింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గమైన హోర్ముజ్ జలసంధి భద్రత, స్థిరత్వానికి ఈ దాడి తీవ్రమైన సవాలని యూఏఈ, జీసీసీ ఆందోళన వ్యక్తం చేశాయి.








కామెంట్‌లు (0)