- బహ్రెయిన్, కువైట్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యం..
- మరోసారి దాడులు జరిగితే మరిన్ని స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరిక
టెహ్రాన్/మనామా: అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. గురువారం ప్రభుత్వ టెలివిజన్ ఐఆర్ఐబి ప్రసారం చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్ ప్రకారం, కువైట్‌లోని అరిఫ్జాన్, అలీ అల్ సలేం, బహ్రెయిన్‌లోని జుఫైర్, షేక్ ఇసా ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల కీలక మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు నిర్వహించింది. అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులు చేస్తే, ఈ ప్రాంతంలోని ఇతర అమెరికా స్థావరాలపై కూడా తమ ప్రతీకార చర్యలు విస్తరిస్తాయని హెచ్చరించింది.
ట్రంప్ హెచ్చరికల అనంతరం అమెరికా దాడులు
హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో "గట్టిగా దెబ్బకొడతాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్దిసేపటికే, బుధవారం ఇరాన్‌పై అమెరికా కొత్త వైమానిక దాడులు ప్రారంభించింది. అయితే ఈ ఉద్రిక్తత త్వరలో ముగుస్తుందని ఆశిస్తున్నట్లు, చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు బహ్రెయిన్ రాజధాని మనామాలో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగిన కొద్ది సేపటికే పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా తాజా దాడులకు "తీవ్రమైన ప్రతిస్పందన" ఇస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
చమురు ధరలకు మళ్లీ రెక్కలు
ఇరాన్‌పై అమెరికా తాజా దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. యుద్ధం ముగిసి హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంటుందనే ఆశలు తగ్గిపోవడంతో మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటం ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.








కామెంట్‌లు (0)