గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన విద్యార్థుల మరణాలపై నిరసన అణచివేత

2 గంటల క్రితం

హౌస్  arresr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 09:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నాయకుల హౌస్ అరెస్టులు

- ఖండించిన ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘాలు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల వరుస మరణాలపై న్యాయం కోరుతూ స్థానిక కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్, గిరిజన సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం. రమణ, నాయకులు కె. సీతారాం, ఎ. గంగారావు, బి. శ్రీను, ప్రకాష్ లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇరు సంఘాలు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును పోలీసు బలగాలతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. ఆశ్రమ పాఠశాలల్లో సరైన వసతులు, వైద్య సేవలు లేకపోవడం వల్లే గిరిజన విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించకుండా ఉద్యమ నాయకులను గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

అక్రమ అరెస్టులతో గిరిజనుల ఆవేదనను, విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయలేరని హెచ్చరించారు. మరణించిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో వెంటనే ఏఎన్‌ఎంలను నియమించి, మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. గృహనిర్బంధంలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్