గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయోగి పాలనలో పడకేసిన అభివృద్ధి

2 గంటల క్రితం

yogi - development
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అభివృద్ధిని గురించి ఊదరగొడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న బిజెపి తీరు ఉత్తరప్రదేశ్‌లో స్పష్టంగా వెల్లడౌతున్నది. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నదని, రాష్ట్రాలలో కూడా తమకే అధికారం ఇస్తే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని శాసనసభల ఎన్నికల సమయంలో బిజెపి ప్రచారం చేస్తున్నది. ఆ ప్రచారమంతా డొల్లేనని కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలలోని బిజెపి ప్రభుత్వాలు ఇప్పటికే రుజువు చేసుకున్నాయి. ఇపుడు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం అంకెలతో సహా వెల్లడైంది. యు.పి లో గత ఆరు సంవత్సరాలుగా రెవెన్యూ మిగులు ఉంటున్నది. 2024-25లో ఆ రాష్ట్రం 59,327 కోట్ల రెవెన్యూ మిగులులో ఉన్నది. ఆ సంవత్సరంలో దేశంలోని 13 రాష్ట్రాల మొత్తం రెవెన్యూ మిగులు 1.27 లక్షల కోట్ల రూపాయలు కాగా, అందులో యు.పి వాటా దాదాపు 50 శాతంగా ఉన్నది. బడ్జెట్‌లో చూయించిన అంచనాల కన్నా అదనంగా ఆదాయం సంపాదించటం ద్వారా ఈ మిగులు రాలేదు. తన సొంత బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు వ్యయం చేయటంలో ప్రభుత్వ వైఫల్యమే రెవెన్యూ మిగులుకు కారణమని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేశాయి. 2020-21లో మినహా 2019-20 నుండి 2024-25 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాల కన్నా కనీసం 15 శాతం తక్కువగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. 2024-25లో బడ్జెట్‌లో చూయించిన మొత్తం కన్నా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రెవెన్యూ వసూళ్ళు 16 శాతం తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ దాని ఖర్చు 15.4 శాతం తగ్గటంతో రెవిన్యూ మిగులు కనిపిస్తున్నది. తగ్గిన ఆదాయాన్ని కూడా కలుపుకుంటే కేటాయించిన మొత్తంలో 30 శాతం కన్నా ఎక్కువ మొత్తం మిగులుగా ఉన్నదని స్పష్టమౌతున్నది. మరికొన్ని రాష్ట్రాలలో కూడా అపుడపుడు రెవెన్యూ మిగులు ఉంటున్నప్పటికీ, ఒక ఆనవాయితిగా, ప్రతి సంవత్సరం భారీ స్థాయి రెవెన్యూ మిగులు ఉంటున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ మాత్రమే.

అభివృద్ధిని పక్కన పెట్టి, కేవలం రెవెన్యూ వ్యయాన్ని తగ్గించటం కోసం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పథకం ప్రకారం పని చేస్తున్నది. కేంద్రం నుండి నిధులు వస్తున్నప్పటికీ వాటిని ఖర్చు చేయటంలో కూడా ప్రభుత్వం వెనుక పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం యు.పి కి 99,197 కోట్ల రూపాయలు కేటాయించగా, దాదాపు 38,000 కోట్ల రూపాయలు (38.4 శాతం) మాత్రమే ఖర్చు చేసింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో యు.పి ప్రభత్వం వివిధ రంగాలకు కేటాయించిన పెట్టుబడులు, చేసిన వ్యయం మధ్య భారీ వ్యత్యాసం ఉన్నది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన రంగంలో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉన్నది. 2024-25 బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం 1.55 లక్షల కోట్లు ఉండాలని ప్రతిపాదించి, 1.13 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే( 27 శాతం తక్కువ) ఖర్చు చేశారు. 41,800 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేక! మిగిల్చింది. ప్రాథమిక విద్య, ఎనరీ, పిడబ్ల్యూడి, పంచాయతి రాజ్‌, భారీ, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, మెడికల్‌, హెల్త్‌, ఫ్యామిలి వెల్‌ఫేర్‌, సెకండరీ విద్య, తదితర రంగాలకు భారీగా కేటాయింపులు చేసినప్పటికీ, ఆచరణలో ప్రతి రంగంలోనూ 10 నుండి 15 శాతం తక్కువ ఖర్చు చేశారు. ఎన్నికలకు ముందు బిజెపి చేస్తున్న వాగ్దానాలకు, అనంతరం వ్యవహరిస్తున్న తీరుకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు.

ప్రభుత్వ నిర్వాకం ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడక నడుస్తున్నాయి. విద్య, వైద్య రంగాలతో పాటు వివిధ రంగాలలో మౌలిక సదుపాయాల కల్పన వెనుకపడుతున్నది. సంక్షేమ పథకాలకు కేంద్రం అందిస్తున్న నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోక పోవటంతో పేదలకు ఉద్దేశించిన పథకాలు వారికి సక్రమంగా అందటం లేదు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయటంలో బిజెపి కి ఎవరూ సాటి రారని రాష్ట్రాభివృద్ధి విషయంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తున్నది.

- ఎ. కోటిరెడ్డి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్