నానా పటేకర్.. చాలా మందికి సినిమా నటుడిగా తెలుసు. కొద్దిమందికి మాత్రమే రైతుల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఆయన చేసిన నిస్వార్థ సేవల గురించి తెలుసు. తెరపై ఆవేదన, ఆగ్రహం, తిరుగుబాటును అద్భుతంగా పలికించిన ఈ దిగ్గజ నటుడు.. నిజ జీవితంలోనూ కష్టాల్లో ఉన్న మనుషుల పక్షాన నిలబడ్డారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా హిందీ, మరాఠీ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన నానా పటేకర్.. తెరపై సామాన్యుడి కోపానికి, బాధకు గొంతుకగా నిలిచారు. నిజ జీవితంలో రైతుల కష్టాలకు స్పందించి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ఆయన చేసిన కృషి విశిష్టమైనది.

‘దేశమంటే మట్టి కాదు.. మనుషులు’ అని నమ్మే నానా పటేకర్.. ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదాన్ని అక్షరాలా ఆచరించి చూపారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో జవాన్లతో కలిసి 60 రోజుల పాటు ‘క్విక్ రియాక్షన్ బృందం’తో గడిపారు. సినీ ప్రపంచంలో స్టార్ హోదా ఉన్నా నిరాడంబరమైన జీవితాన్నే ఎంచుకున్నారు. సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో 25 ఏళ్ల పాటు జీవించారు. 30 ఏళ్ల పాటు షూటింగ్‌కు ఆటోలో వెళ్లారు. లగ్జరీ కారు కొనుక్కోవడానికి దాచుకున్న కోటీ 50 లక్షల రూపాయలను రైతు కుటుంబాలకు దానం చేయడంతో ఆయన జీవితంలో సేవా అధ్యాయం మొదలైంది.
ఒక వార్త.. ఒక నిర్ణయం
2015లో మహారాష్ట్రలో కరువు, రైతుల ఆత్మహత్యల వార్తలు నానా పటేకర్‌ను తీవ్రంగా కలచివేశాయి. మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి అదే ఏడాది ‘నామ్ ఫౌండేషన్’ను ప్రారంభించారు. రైతు కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం చేయడంతో పాటు కరువు, నీటి సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారాలపై సంస్థ దృష్టి పెట్టింది. నీటి వనరుల పునరుద్ధరణ, కాలువల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపు, గ్రామాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టింది. రైతు కుటుంబాన్ని ఆదుకోవడం అంటే డబ్బు ఇచ్చి వెళ్లిపోవడం కాదని నానా పటేకర్ భావించారు. కుటుంబం తిరిగి తన కాళ్లపై నిలబడేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతు ఆత్మహత్యలతో కుటుంబ పెద్దను కోల్పోయిన మహిళలకు ఆర్థిక సాయం, పిల్లల చదువుకు సహాయం, ఉపాధి అవకాశాలకు చేయూత అందించారు. కరువు ప్రాంతాల్లో నీటి వనరులను పునరుద్ధరించడం ద్వారా రైతుకు ఆత్మహత్యే మార్గమనే పరిస్థితిని మార్చాలని ప్రయత్నించారు. కరువు పీడిత గ్రామాలకు వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పడం కూడా ఆయన సేవలో భాగమైంది. ఈ ఏడాది రైతుల ఆత్మహత్యల సమస్యపై మాట్లాడుతూ.. తీవ్రంగా కుంగిపోయిన రైతులు ఒంటరిగా భావించవద్దని, తన దగ్గరకు రావాలని పిలుపునిచ్చారు. రైతులకు ఆర్థిక సాయంతో పాటు మానసిక, సామాజిక అండ కూడా అవసరమని ఆయన పలుమార్లు చెప్పారు.

ఆకలి.. అవమానం నటన నేర్పాయి..
నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ గజానన్ పటేకర్. 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్-జంజీరాలో జన్మించారు. వస్త్ర వ్యాపారం చేసే ఆయన తండ్రికి నాటకాలంటే ఎంతో ఇష్టం. నానాను రంగస్థలం వైపు ప్రోత్సహించింది ఆయనే. అయితే నానాకు 13 ఏళ్ల వయసులో తండ్రి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. పాఠశాల పూర్తయ్యాక కుటుంబానికి భారంగా ఉండకూడదనే ఉద్దేశంతో సినిమా పోస్టర్లు పెయింట్ చేసే పని చేశారు. నెలకు రూ.35 సంపాదించడం కోసం ప్రతిరోజూ 8 కిలోమీటర్లు నడిచారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఆకలి, అవమానం నాకు నటన నేర్పాయి. అందుకోసం ప్రత్యేకంగా నటన పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం నాకు రాలేదు’ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
నటన అంటే కేవలం వృత్తి కాదు..
స్మితా పాటిల్ ప్రోద్బలంతో 1978లో ‘గమన్’ సినిమా ద్వారా నానా పటేకర్ వెండితెరపై అడుగుపెట్టారు. ‘సలామ్ బాంబే’తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘పరిందా’, ‘ప్రహార్’, ‘తిరంగా’, ‘క్రాంతివీర్’, ‘అగ్ని సాక్షి’, ‘ఖామోషీ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ‘వెల్‌కమ్’లో ఉదయ్ శెట్టి పాత్రతో హాస్యాన్ని కూడా అద్భుతంగా పండించగల నటుడిగా నిరూపించుకున్నారు. ‘పరిందా’కు ఉత్తమ సహాయ నటుడిగా, ‘క్రాంతివీర్’కు ఉత్తమ నటుడిగా, ‘అగ్ని సాక్షి’కి మరోసారి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది. పాత్రలోకి వెళ్లేటప్పుడు ‘నానా పటేకర్’ కనిపించకుండా.. ఆ పాత్ర మాత్రమే కనిపించాలని కోరుకునే నటుడు ఆయన. అందుకే ‘క్రాంతివీర్’లో ఆగ్రహం, ‘ఖామోషీ’లో నిశ్శబ్దం, ‘వెల్‌కమ్’లో హాస్యం.. ఇలా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి.

వేల కుటుంబాలకు భరోసా
‘నామ్ ఫౌండేషన్’ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 4,940 రైతు కుటుంబాలకు సాయం అందించింది. తొలుత ఒక్కో కుటుంబంలోని వితంతువుకు ₹15,000 చొప్పున సాయం చేయగా.. తర్వాత ఆ మొత్తాన్ని ₹25,000కు పెంచారు. 2015–2025 మధ్య 2,246 నీటి వనరులను పునరుద్ధరించారు. 178 నదులను పునరుజ్జీవింపజేశారు. 515 వాగులు, నాలాల అభివృద్ధి చేపట్టారు. 769 పెర్కొలేషన్ ట్యాంకులను పునరుద్ధరించడంతో పాటు 26 ఆనకట్టల్లో పూడికతీత పనులు చేశారు. ఈ పనుల ద్వారా 5.85 కోట్లకు పైగా క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి, సుమారు 40,847 కోట్ల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించినట్లు సంస్థ పేర్కొంది. ఫౌండేషన్ ద్వారా 77.17 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరిందని, 33.69 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి ప్రయోజనం కలిగిందని తెలిపింది.

రైతు పక్షపాతిగా...
2015లో ఓ ఇంటర్వ్యూలో రైతుల ఆత్మహత్యల దృశ్యాలు టీవీలో చూస్తూ రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదని నానా పటేకర్ చెప్పారు. రైతు కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసినప్పుడు పరిస్థితి మరింత బాధగా అనిపించేదన్నారు. 2018లో రైతులకు ఆర్థిక సాయంతో పాటు మానసిక, సామాజిక అండ కూడా అవసరమని చెప్పారు. నామ్ ఫౌండేషన్ ద్వారా మానసిక నిపుణుల సహాయంతో కౌన్సెలింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టారు.
2020లో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిర్వహించిన ఓపెన్ ఇంటర్వ్యూలో రైతులకు కేవలం రుణమాఫీలు ఇవ్వడం పరిష్కారం కాదని, రైతులు బిచ్చగాళ్లు కాదని అన్నారు. డబ్బు కంటే భావోద్వేగపరమైన అండ, ఓదార్పు, వారితో మాట్లాడే మనుషులు అవసరమని చెప్పారు. 2016లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నటన ద్వారా అవార్డులు, డబ్బు, గౌరవం అన్నీ వచ్చినా మనసులో ఏదో వెలితిగా ఉండేదని, ఇప్పుడు చేస్తున్న పని ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. 2015లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘మార్కెట్లో మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుకూ ధర ఉంటుంది. కానీ రైతు పండించిన పంటకు మాత్రం స్థిరమైన ధర ఎందుకు ఉండకూడదు?’ అని ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)