వారమైనా కేంద్రానికి పంపని నివేదిక
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఆ ఊసే లేదు
అసలే నెల ఆలస్యం
ఆపై రిపోర్టు విషయంలో జాగు
బృందాల సందర్శనలు, నిధులు, సహాయక చర్యలు ఎప్పటికి?
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రంపై సూపర్ ఎల్‌నినో విసిరిన పంజాతో ఖరీఫ్ సేద్యం కుదేలై రైతులు అతలాకుతలమ వుతుండగా ఆర్చుకొని తీర్చుకొని ప్రభుత్వం చేసిన కరువు ప్రకటన కంటి తుడుపుగానే కనిపిస్తోంది. ఈ నెల 1న 21 జిల్లాల్లోని 388 కరువు మండలాలను ప్రకటించిన సర్కార్, నిబంధనల ప్రకారం ఇంకో నెల తర్వాత ప్రకటించాల్సింది కాస్తా ఎంతో ముందస్తుగా గుర్తించామని గొప్పలకు పోయింది. కరువును గుర్తించి తక్షణం సహాయక చర్యలు చేపట్టి రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను, పశుపోషకులను ప్రత్యేక ప్యాకేజీలతో ఆదుకోవాలని ఆందోళనలు జరుగుతున్నాయి. వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఎట్టకేలకు కొన్ని మండలాలను ప్రకటించిన ప్రభుత్వం, వారం రోజులైనా కేంద్రానికి సమగ్ర నివేదిక పంపలేదని సమాచారం. నిబంధనల ప్రకారం కరువును ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన వారం రోజుల్లోపు పరిస్థితులను వివరిస్తూ పూర్తి సమాచారంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాల్సి ఉంటుంది. జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి సహాయం కోరుతూ విజ్ఞాపన చేయాలి. ఎపి ప్రభుత్వం ఆ పని చేయలేదని అటు ఢిల్లీలో ఇటు అమరావతిలో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాతికేళ్ల ప్రజాప్రస్థానాన్ని అభినందిస్తూ బుధవారం ఘనంగా కేబినెట్‌లో తీర్మానం చేయడంతో పాటు ప్రత్యక్షంగా అభినందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కూటమి ఎంపిలు బుధ, గురువారాల్లో చేసిన ఢిల్లీ పర్యటనలో కరువు అంశం ఊసే లేదని సమాచారం. మామూలుగా అయితే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల తోపాటు సంబంధిత మంత్రిని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందించడం కద్దు. కానీ సిఎం ఢిల్లీ పర్యటటన షెడ్యూల్‌లో ఈ అంశం లేదని తెలిసింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం హడావిడి ప్రకటన చేసినట్లు విమర్శలొస్తున్నాయి.
ముందస్తు కొత్తేమీ కాదు
కేంద్రం ఆమోదించి అమలు చేస్తున్న 2016- కరువు మాన్యువల్ ప్రకారం మామూలుగా అయితే ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ ఆఖరుతో ముగుస్తున్నందున, అక్టోబర్ 31 లోపు కరువు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. తదుపరి వారం లోపు కేంద్రానికి సమగ్ర నివేదిక పంపాలి. ఆ నివేదిక అందాక వారంలో కేంద్ర బృందాలను వ్యవసాయ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి పంపుతుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం వారంలో కేంద్రానికి ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. సదరు నివేదిక అందాక నెల రోజుల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధుల విడుదలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కాగా కరువు తీవ్రత ఎక్కువగా ఉన్నపక్షంలో జూన్, జూలై మాసాల్లో వర్షాభావం లేదా ప్రామాణీకరించిన వర్షపు లోటు, డ్రైస్పెల్స్, సాగు తగ్గుదల, విత్తనాలు మొలకెత్తకపోవడం, పైరు ఎండిపోవడం
9 వలన జరిగే నష్టం, భూగర్భజలాల తగ్గుదల, రిజర్వాయర్లలో నీటి లభ్యత ఇండెక్స్, ప్రామాణీకరించిన సూచిక మేరకు భూమి ఉపరితలం, లోపల తేమ తగ్గుదల... ఈ అంశాల లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఆగస్టులోనే కరువు మండలాలను ప్రకటించి కేంద్రానికి నివేదిక పంపాలి. జూన్, జూలైలలో చాలా సూచికల్లో కరువు ఛాయలు కనిపించినప్పటికీ ఆగస్టులో కరువును గుర్తించలేదు. జూన్-ఆగస్టు వరకు ఉన్న డేటాననుసరించి కరువును ప్రకటించింది.
తక్షణ సహాయక చర్యలేవి...
ప్రకటించిన మండలాలను సైతం తీవ్ర స్థాయి 283, మధ్యస్థ స్థాయి 105గా పేర్కొంది. ఏడు జిల్లాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. నిజానికి సెప్టెంబర్ మూడవ వారం వరకు రాష్ట్రంలో 90 శాతానికిపైగా భూభాగం కరువులో చిక్కుకుంది. సెప్టెంబర్ 20 వరకు చూస్తే 50 శాతానికిపైగా లోటు వర్షం నమోదైంది. దాదాపు 625 మండలాల్లో దుర్భిక్షం తాండవించింది. వాయుగుండంతో సెప్టెంబర్ చివర్లో కురిసిన వర్షాలకు సగటున రాష్ట్రం సాధారణ స్థితిలోకొచ్చింది. ఇప్పటికీ రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర, పల్నాడు, తదితర జల్లాల్లో కరువు తీవ్రంగా ఉంది. ప్రకటించిన మేరకైనా ప్రభుత్వం నిర్దిష్టంగా కరువు సహాయక చర్యలు చేపట్టలేదు. రబీ సాగు సాగించేందుకు ప్రత్యామ్నాయ పంటల సేద్యం కోసం తాత్కాలిక ప్రణాళికలను అరకొరగా రూపొందించినా కాగితాలకే పరిమతమయ్యాయి. బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, తాగునీరు, పశువులకు గ్రాసం, తాగునీరు, వలసల నివారణ, కూలీలకు పనుల కల్పన వంటివి చేపట్టాలంటే నిధులు కావాలి. కేంద్రాన్ని నిధులడగకుండా, నివేదికే పంపకుండా రాష్ట్రం ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతుందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.







కామెంట్‌లు (0)